కొత్తూరు, ఫిబ్రవరి 28 : రంజాన్ తర్వాత జేపీ దర్గా మాస్టర్ ప్లాన్ అమలు చేస్తామని వక్ఫ్ బోర్డు చైర్మన్ మసిఉల్లాఖాన్ అన్నారు. జేపీ దర్గా మాస్టర్ ప్లాన్ అమలుపై ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం కొత్తూరు మండల పరిధిలోని జహంగీర్ పీర్ దర్గాలో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి మసిఉల్లాఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు దర్గా పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే, చైర్మన్ చాదర్‌ను సమాధులకు సమర్పించారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎక్కడెక్కడ ఏయే అభివృద్ధి పనులు చేపట్టాలో స్థానికులను అడిగి తెలుసుకున్నారు.
చిరు వ్యాపారులు నష్టపోకుండా మాస్టర్ ప్లాన్
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిరు వ్యాపారులకు నష్టం కలుగకూడదనే ఉద్దేశంతో మాస్టర్ ప్లాన్ అమలులో కొంత ఆలస్యం జరిగిందన్నారు. చాలా ఏండ్లుగా చిరు వ్యాపారులు అక్కడ ఉపాధి పొందుతున్నారని చెప్పారు. అందువల్ల వారి వ్యాపారాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా మాస్లర్ ప్లాన్ అమలు చేస్తామని చెప్పారు. వక్ఫ్ బోర్డు చైర్మన్ మాట్లాడుతూ.. రంజాన్ తర్వాత మాస్టర్ ప్లాన్ పనులు మొదలవుతాయని చెప్పారు. మొదటగా మసీదు, మహిళలు, పురుషులకు వేర్వేరుగా వజూ ఖానాలు, ఖవాలీ సెంటర్, సమావేశ మందిరం, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. వీఐపీల కోసం ముందుగా గెస్ట్‌హౌస్ నిర్మాణం చేపడుతామని వివరించారు. దర్గా సర్వతోముఖాభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో పట్టుదలతో ఉన్నారని చెప్పారు. మాస్టర్ ప్లాన్ అయిన తర్వాత సీఎం కేసీఆర్ అభివృద్ధి పనులు ప్రారంభిస్తారని ఆయన పేర్కొన్నారు.