రంగారెడ్డి, మార్చి 3 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని మామిడి రైతుల ఆశలు ఆవిరైపోతున్నాయి. గత రెండు సీజన్లల్లోనూ ఆశించిన మేర మామిడి దిగుబడి రాక.. తీవ్ర నష్టాల్లో ఉన్న మామిడి రైతులకు ఈసారి కూడా పెద్దగా ఫలితాలు దక్కే అవకాశాలు లేకుండా పోతున్నాయి. ఓవైపు మండుతున్న ఎండలు.. మరోవైపు కరెంట్ కోతలతో సరిపడా నీటి లభ్యత లేక మామిడి పూత పెద్ద ఎత్తున రాలిపోతున్నది. దానికితోడు అనేక రకాల చీడపీడలు సోకుతున్నాయి. మామిడి పూత రాలే విషయంలో రైతులకు ముందు జాగ్రత్తగా సూచనలు ఇవ్వడంలో ఉద్యానవన శాఖ అధికారులు ముందుకు రావడంలేదన్న ఆరోపణలున్నాయి.
మామిడి తోటలను సాగు చేసిన రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఓ వైపు మండుతున్న ఎండలు.. మరోవైపు కరెంట్ కోతలతో సరిపడా నీటి లభ్యత లేక మామిడి పూత పెద్ద ఎత్తున రాలిపోతున్నది. అంతంత మాత్రంగానే ఉన్న పూత పిందెలు పట్టకముందే రాలుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది కూడా మామిడి దిగుబడిపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా, జిల్లాలో 26,000 మామిడి తోటలున్నాయి.
జిల్లాలో 26 వేల ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. జిల్లాలోని 21 మండలాల్లో ఇబ్రహీంపట్నం, మంచాల, యాచా రం, తలకొండపల్లి, మా డ్గుల, అబ్దుల్లాపూర్మెట్, షాద్నగర్, కొందుర్గు, కేశంపేట, కడ్తాల్ మండలాల్లో ఈ తోటలు అధికంగా ఉన్నాయి. మామిడి పూత సమయంలో చెట్ల వద్ద పాదులు చేసి, ఎరువులు వేసి నీటిని అందిస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యం లో భూగర్భజలాలు అడుగంటి బోరు బావుల్లోనూ నీటిమ ట్టం గణనీయంగా తగ్గిపోయింది. దీంతో గతంలో రోజంతా పోసే బోర్లు కూడా ఒకటి లేదా రెండు గంటలు మాత్రమే పోస్తున్నాయి. దీంతో మామిడి తోటలకు సరిపడా నీరు అందక పూత రాలేందుకు ప్రధాన కారణమవుతున్నది. దీంతో అంతంత మాత్రంగానే ఉన్న పూత పిందెలు పట్టకముందే రాలుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది కూడా మామిడి దిగుబడిపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
మామిడి తోటలతో ప్రతి ఏటా నష్టాలే వస్తున్నాయి. ఇబ్రహీంపట్నం మండలంలోని దండుమైలారం గ్రామంలో సుమారు 700 ఎకరాల్లో రైతులు మామిడి తోటలను సాగు చేశారు. అయితే, ఆ తోటలు పూత పూసి కాత దశకు వచ్చే సమయంలో ఎండలు తీవ్రరూపం దాల్చి భూగర్భజలాలు అడుగంటుతుండడంతో బోరుబావులు ఎండిపోయి నీరు సక్రమంగా అందడం లేదు. దీంతో పూత రాలిపోయి తీవ్ర నష్టాలు వస్తున్నాయి. ఈ ఏడాది ఇంకా దారుణంగా తయారైంది. మామిడితోటను కాపాడుకునేందుకు మూడు బోర్లు వేసినా అవి రెండు రోజులు పోసి ఎండిపోయాయి. దీంతో తీవ్ర ఇబ్బందిగా మారింది. -బిట్ల వెంకట్రెడ్డి, దండుమైలారం
ఎండలు పెరుగుతుండడం.. సరిపడా నీరు అందకుంటే పూత రాలేం దు కు ఆస్కారం ఉంటుంది. అందుకోసం తప్పనిసరిగ్గా నీరు అందించాలి. అప్పుడే పూత రాలకుండా ఉండడమే కాకుండా కాత కూడా కాస్తుంది.
-సురేశ్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి
నాకు పదెకరాల మామిడి తోట ఉన్నది. ఏటా పాదులు తవ్వించడం, మందులను పిచికారీ చేసేందుకు అధికంగా ఖర్చు అవుతున్నది. గత మూడు సీజన్లలోనూ పూత రాలి.. కాత రాక తీవ్రంగా నష్టపోయా. పెట్టుబడులూ రాలేదు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి నెలకొన్నది. ఎండలు పెరుగుతుండడంతో బోర్ల నుంచి నీరు సరిగ్గా రాకపోవడంతో తోటలకు అం దించలేకపోతున్నా. దీంతో పూత రాలి పిం దెలు పట్టడం లేదు. దీంతో ఈ సారీ నష్టాలు తప్పేలా లేవు.
-వల్లూరి ముత్యమయ్య, రైతు