మొయినాబాద్, జనవరి 5 : బ్రహ్మోత్సవాలకు చిలుకూరి సురగంటి భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం ముస్తాబైంది. శనివారం నుంచి 10వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. మండల పరిధిలోని చిలుకూరు రెవెన్యూలో ఉన్న సురగంటి భ్రమరాంబ మల్లికార్జు స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం సంక్రాంతి ముందు ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. అందులో భాగంగా శనివారం సాయంత్రం గంగస్నానంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.
ఆదివారం ఉదయం 9 గంటలకు ధ్వజారోహణం, స్వామి వారికి అభిషేకం, 10 గంటలకు ఎల్లమ్మ లగ్నం, మధ్యాహ్నం 2 గంటలకు ఎల్లమ్మ బోనాలు, మధ్యాహ్నం 2.15 గంటలకు మల్లికార్జునస్వామి కల్యాణం, సాయంత్రం 4 గంటలకు స్వామి వారి బోనాల ఊరేగింపు, 5 గంటలకు శివసత్తుల అగ్నిగుండాల తొక్కుట, 5.30 గంటలకు ఒగ్గువారు ఉక్కు గొలుసు తెంపుట, రాత్రి 8 గంటలకు ఒగ్గు కథ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సదరు పటం తొక్కుట, సాయంత్రం 5 గంటలకు గ్రామంలో ఊరేగింపు, మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు నల్లపోచమ్మ బోనాలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఆలయ కమిటీ అధ్యక్షుడు సంగరి మల్లేశ్ కోరారు.