రంగారెడ్డి, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు తోడు.. ప్రత్యేకాధికారుల పాలనలో పారిశుధ్యం పడకేయడంతో సీజనల్ వ్యాధు లు పెరుగుతున్నాయి. దోమల విజృంభణతో మలేరియా, డెంగీ, టైఫాయిడ్ వంటి విషజ్వరాల బారిన ప్రజలు పడుతున్నారు.
పారిశుధ్య పనులకు ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడం, తాగునీటి పైపులైన్ల లీకేజీలకు మరమ్మతులు చేయకపోవడంతో తాగునీరు కలుషితమై ప్రజలు జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలతో ఆస్పత్రుల పాలవుతున్నా రు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోకపోవ డం, ఖాళీ స్థలా ల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, పిచ్చిమొక్కలు, నీటి నిల్వలపై దృష్టి సారించక పోవడంతో గ్రామాల్లో దోమలు విపరీతంగా పెరుగుతున్నాయి.
అందని ప్రభుత్వ వైద్యం..
జిల్లాలోని ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్, శంషాబాద్, రాజేంద్రనగర్, యాచారం తదితర ప్రాంతాల్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను అధికారులు వైద్యవిధాన పరిషత్ పరిధిలోకి మార్చడంతో ఈ దవాఖానల్లో ప్రజలకు వైద్యసేవలు అందడం లేదు. దీంతో విధి లేని పరిస్థితుల్లో రోగులు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన అక్కడి నిర్వాహకులు జ్వరం, మలేరియా, డెంగీ వంటి రక్త పరీక్షల కోసం పెద్ద ఎత్తున డ బ్బులు గుంజుతున్నారు.
అవసరం లేకపోయి నా రోగులను వారాల తరబడి ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే అడ్మిట్ చేసుకుని పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు. దీంతో చాలామంది పేదలు వేలాది రూపాయల ఫీజులు చెల్లించలేక మంచానికే పరిమితమవుతున్నారు. ఇప్పటికే కలెక్టర్ వైద్యారోగ్యశాఖ, మున్సిపల్, పంచాయతీ శాఖల అధికారులతో ప్రత్యేక మీటింగ్‌లు నిర్వహించి సీజనల్ వ్యాధులపట్ల అప్రమత్తం గా ఉండాలని ఆదేశించారు.
నేటి నుంచి జిల్లాలో ఫీవర్ సర్వే..
జిల్లాలో సీజనల్ వ్యాధులు పెరిగిపోతున్న నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. నేటి నుంచి జిల్లాలో ఫీవర్ సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. మున్సిపాలిటీ ల్లోని వార్డులు, గ్రామపంచాయతీల్లో వారం రోజుల పాటు ఫీవర్ సర్వే నిర్వహించనున్నారు. ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు, వైద్యారోగ్యశాఖ సిబ్బంది యూనిట్‌గా ఏర్పడి గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి సర్వే చేపట్టి.. జ్వరం బారిన పడిన వారి వివరాలను సేకరించనున్నారు. ఈ సర్వే ఆధారంగా గుర్తించిన రోగులకు ప్రత్యేక వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు.