యాచారం, ఫిబ్రవరి 28 : వేసవి కాలం వచ్చిందంటే చాలు.. భగభగమండే సూర్యతాపానికి ప్రజలు అల్లాడిపోతుంటారు. మండే ఎండల్లో చల్లటి మంచినీటి కోసం తహతహలాడుతుంటారు. గుక్కెడు చల్లని నీటితో తమ దాహాన్ని తీర్చుకుంటారు. కూల్ వాటర్ కోసం డబ్బున్న వారు రిఫ్రిజరేటర్లు కొని వాడుతుంటే.. పేదలు మాత్రం మట్టి కుండలను వినియోగిస్తున్నారు. మట్టి కుండల తయారీలో రంగారెడ్డి జిల్లాలోనే నందివనపర్తి గ్రామం ఆదర్శంగా నిలుస్తున్నది. మండలంలోని మిగిలిన గ్రామా ల్లో కుల వృత్తి క్రమంగా కనుమరుగు కాగా.. ఈ గ్రామంలోని కుమ్మరులు కుటుంబ సభ్యులతో కలిసి ఏడాదంతా కుండల తయారీలో నిమగ్నమవుతారు. కుల వృత్తినే నమ్ముకొని వివిధ ఆకృతుల్లో కుండలను తయారు చేసి మార్కెట్‌కు తరలించి లాభాలను పొందుతున్నారు. ప్లాస్టిక్ ప్రపంచంతో పోటీపడుతూ తమ వృత్తి అంతరించి పోకుండా కాపాడుకుంటున్నారు. గ్రామం లో సుమారుగా 60 కుటుంబాలకు పైగా కుల వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నారు వారు ప్రతిరోజూ దాదాపుగా 15 నుంచి 20 కుండల చొప్పున తయారు చేస్తున్నారు. స్టీల్, ప్లాస్టిక్, అల్యూమినియం పాత్రలు అందుబాటులోకి రాకముందే మట్టి పాత్రలను ప్రజలు వాడుతున్నా రు. ఎండాకాలంలో చల్లటి నీటిని అందించే కుండలు పేదవాడి ఫ్రిజ్‌గా పేరొందాయి. ఈ కుండల్లోని నీరు ఫ్రిజ్ నీటి కంటే మంచిదని వైద్యులు చెబుతుండటంతో ఈ మధ్యకాలంలో కుండలను వినియోగించే వారి సంఖ్య పెరుగుతున్నది. దీంతో ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా వారు వివిధ రకాల కుండలను తయారు చేస్తున్నారు. వాటిలో ట్యాప్ బిగించిన కుండలతోపాటు కూజాలు, బొడ్డుపావులు, బోనం కుండ లు, కల్లు కుండలు, వాటర్ బాటిళ్లు, వివిధ రకాల వంట పాత్రలు ఆకట్టుకుంటున్నాయి. ఇవేకాకుండా అలంకరణకు సం బంధించినవి కూడా వివిధ ఆకృతుల్లో లభ్య మవుతుం డగా వాటికి కూడా నగరాల్లో మంచి డిమాండ్ ఉన్నది.
కుండల తయారీ ఇలా..
కుండలను తయారు చేసే కుమ్మరులు చెరువులు, కుంటల నుంచి ఒండ్రు మట్టిని తీసుకొచ్చి దానిని జల్లెడ పడుతారు. చిన్న, చిన్న రాళ్లు, ఇతర వ్యర్థాలను తొలగించి ఆ మట్టిని బాగా కాళ్లతో తొక్కుతారు. మెత్తగా అయిన తర్వాత రెండు రోజులపాటు ఆ మట్టిపై వస్త్రం కప్పి నీటిని చల్లుతారు. ఆపై ముద్దలుగా చేసి సారెపై ఉంచి వారి కళానైపుణ్యంతో వివిధ రకాల ఆకృతుల్లో మట్టికుండలను తయారు చేస్తారు. అనంతరం వాటిని ఆరబెట్టి కొలిమిలో పొట్టువేసి కాల్చుతారు. రెండు రోజుల తర్వాత వాటిపై నీరు చల్లి.. శుభ్రపర్చి మార్కెట్లో ఒక్కో కుండ, వివిధ ఆకృతుల్లో ఉండే కూజాలను రూ. 50 నుంచి రూ.200 వరకు అమ్మి లాభాలను పొందుతారు. ఎండాకాలం ఆరంభంలోనే ప్రజల అభిరుచికి అనుగుణంగా వివిధ రకాల ఆకృతుల్లో కుండలు లభ్యమవుతుండటంతో ప్రజలు వాటిని ఇష్టపడి కొంటున్నారు. రకరకాల ఫ్రిజ్లొచ్చినా మట్టికుండల స్థానం ఇప్పటికీ పదిలంగానే ఉన్నది. బాటసారులకు నీటిని అందించే చలివేంద్రం కుండలు సైతం మార్కెట్లోకి రావటంతో వాటికీ మంచి డిమాండ్ సంతరించుకుంది. అంతేకాకుండా కుమ్మరులు వీటిని జిల్లాతోపాటు హైదరాబాద్, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని సంతలు, జారతల్లో విక్రయించి లాభాలు పొందుతున్నారు.
కుమ్మరులను ఆదుకోవాలి
కుమ్మరులను ప్రభుత్వం ఆదుకోవాలి. కుండల తయారీ శిక్షణాకేంద్రాన్ని ఏర్పాటు చేసుకునేందుకు నియోజకవర్గంలో రెండెకరాల స్థలాన్ని కేటాయించాలి. కుండల తయారీకి అవసరమైన మట్టిని చెరువులు, కుంటల నుంచి ఉచితంగా అందజేయాలి. గ్రామాల్లో కుమ్మరి వాముల ఏర్పాటుకు కూడా స్థలాన్ని కేటాయించడంతోపాటు కుండలను విక్రయించుకునేందుకు దుకాణా సముదాయాన్ని ఏర్పాటు చేయాలి.
-కొండాపురం శ్రీశైలం, నందివనపర్తి