వికారాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ) : స్పీకర్ హోదాలో ఉండి రెండేళ్లలో వికారాబాద్‌కు చేసిందేమీ లేదని, స్పీకర్‌ను గెలిపించడమే వికారాబాద్ ప్రజలకు శాపమా అని శాసనమండలి ప్రతిపక్ష నేత, వికారాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల ఇన్చార్జి మధుసూదనాచారి విమర్శించారు. బుధవారం వికారాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్‌తో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించినా ఏ వర్గానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదని, ప్రజలు చైతన్యవంతులని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమన్నారు.
పార్టీ కోసం కష్టపడి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కార్యకర్తలకు సూచించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, గ్యారెంటీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని, అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామని చెప్పి, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు ఏ మేరకు టికెట్లు కేటాయించారని ప్రశ్నించారు. ఇన్ని దుర్మార్గాలకు ఒడిగట్టిన కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ఓటేస్తే ఇచ్చే అరకొర పథకాలను కూడా నిలిపివేస్తారన్నారు.
2014కు ముందున్న కరెంట్ గోసను అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే పరిష్కరించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌దన్నారు. సమైక్య రాష్ట్రంలో దండుగలా మారిన వ్యవసాయాన్ని పండుగలా మార్చి, దేశానికి తెలంగాణను ధాన్యాగారంగా చేశారన్నారు. అన్ని వర్గాల ప్రజలను అనేక రకాలుగా హింసిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారని రేవంత్ రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టాలని, ఇలా చేస్తేనే ప్రజలు కాంగ్రెస్ పార్టీని భూస్థాపతం చేస్తారని భయం ఉంటుందన్నారు.
కాంగ్రెస్ పార్టీకి గెలిచే సత్తా లేకనే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భయపెట్టి గుంజుకుంటున్నదని, ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ఖూనీ చేసిందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ విమర్శించారు. వికారాబాద్ మున్సిపాలిటీలో చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీకి పోటీ చేసేందుకు అభ్యర్థులు లేకపోవడంతోనే బీఆర్ఎస్ అభ్యర్థులను భయపెట్టి మార్చుకున్నారన్నారు. ఎస్సీ మహిళా రిజర్వేషన్ వచ్చినప్పుడు అన్ని పదవులు ఒక కుటుంబానికే కాకుండా ఇతరులకు అవకాశమివ్వాలనే ఆరోపణలు వస్తున్నాయన్నారు. అన్ని పార్టీల్లోని ఎస్సీలందరూ కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేయాలనేది ఆలోచించాలన్నారు. వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో కనీసం ఒక డైరెక్టర్ పోస్టు కూడా ఇవ్వని కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు చేస్తున్న అన్యాయాన్ని ఆలోచించాలన్నారు. డైరెక్టర్ పదవికి కూడా ముస్లింలు పనికిరానివిధంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీపై మసీదుల్లో చర్చ జరగాలని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అని చెప్పి కేవలం 9 సీట్లు ఇచ్చారని, పార్టీలకు అతీతంగా బీసీలు ఆలోచన చేయాలన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆశావర్కర్లు, అంగన్వాడీలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏం చేశాం, కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఏం చేస్తుందనేది ఆలోచించి ఓటేయాలన్నారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ కూడా అందడం లేదన్నారు. కాంట్రాక్టర్ల వద్ద 10-15 శాతం కమీషన్ వసూలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతున్నదని, తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎవరినైనా అడిగితే దేనికైనా సిద్ధమని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత వికారాబాద్ జిల్లా తీసేస్తారనే ప్రచారం జరుగుతున్నదని, జిల్లాను రద్దు చేసే కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేయాలనేది ఆలోచన చేయాలన్నారు.
కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగేందర్‌గౌడ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై అనవసర కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, ప్రజలు ఓటేస్తే గెలవాలి కానీ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా చేయొద్దన్నారు. బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల అనర్హత విషయంలో స్పీకర్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారన్నారు. వికారాబాద్‌లో సిండికేట్ రాజకీయం చేస్తున్నారని, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్తున్నారని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ టౌన్ ప్రెసిడెంట్ గోపాల్, బీఆర్ఎస్ నాయకులు రాంరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.