నవాబుపేట : మండల పరిధిలోని మాదారం గ్రామంలో ( Madaram villagers) నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు. ముఖ్యంగా గ్రామంలో ప్రధానమైన డ్రైనేజీ సమస్యతో సతమతమవుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ (Drainage system) నీరు రోడ్డుపైకి ప్రవహించి దుర్గంధం వ్యాప్తించి రోగాల బారిన పడుతున్నామని వెల్లడించారు.
గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మాజీ ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా పెడచెవిన పపెడుతున్నారని పేర్కొన్నారు. గ్రామ సమస్యలను ఎన్నోసార్లు మాజీ ప్రజాప్రతినిధులకు , సంబంధిత అధికారులకు, పంచాయతీ సెక్రటరీకి చెప్పినా చేస్తాం.. చూస్తాం అనే మాటలతో సరిపెడుతున్నారని ఆరోపించారు. రోడ్డుపై చెత్తాచెదారం, డ్రైనేజీలపై సరైన మూతలు లేక రోడ్డుపై మురుగు నీరు పారడంతో దోమలు, ఈగలు వ్యాపించి అనేక రోగాలకు దారితీసే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం హయంలో గ్రామాలు పచ్చదనంతో పాటు పరిశుభ్రతతో ఉండేవని కేసీఆర్ పదేండ్ల పాలనను గుర్తు చేసుకున్నారు. సర్పంచుల వ్యవస్థ లేక గ్రామ వాతావరణం పూర్తిగా భ్రష్టుపట్టిందని మాజీ సర్పంచ్ బండారి రాములు వెల్లడించారు. అధికారులకు బాధ్యతలు అప్పజేప్పడం కాదు వారికి సరైన బడ్జెట్ను కేటాయించి సమస్యల పరిష్కారానికి దారిచూపాలని సూచించారు. తాను కాంగ్రెస్ వ్యక్తినే అయినప్పటికీ మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని ఆరోపించారు.