టార్గేట్ మార్చి ౩1
గతానికి భిన్నంగా అనూహ్య స్పందన
రంగారెడ్డి జిల్లాలో మొత్తం 558 గ్రామపంచాయతీలు
ఈ ఏడాది పన్ను వసూలు లక్ష్యం రూ. 27.19కోట్లు
ఇప్పటివరకు వసూలైంది రూ. 23.65 కోట్లు
మార్చిలోగా వంద శాతం వసూలు చేసేలా కార్యాచరణ
స్వపరిపాలనకు ఊతమిస్తున్న స్థానిక ఆదాయం
ప్రగతి పథంలో దూసుకెళ్తున్న పల్లెలు
షాబాద్, ఫిబ్రవరి 20: గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర సర్కార్ పెద్దపీట వేస్తున్న విషయం తెలిసిందే. ‘పల్లె ప్రగతి’తో ప్రతి నెలా నిధులు మంజూరు చేస్తుండడంతో గ్రామాల రూపురేఖలూ మారాయి. దీంతో తమ ఊరును మరింత అభివృద్ధి చేసుకోవాలని పల్లెవాసుల్లో చైతన్యం వచ్చింది. ప్రభుత్వ నిధులకు తోడుగా ఇంటి పన్ను, నల్లా పన్ను, ఆస్తి పన్ను తదితర వాటిని స్వచ్ఛందంగా చెల్లిస్తున్నారు. గతానికి భిన్నంగా పన్నులు వసూలవుతుండడం విశేషం. రంగారెడ్డి జిల్లాలో 588 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఈ ఏడాది రూ.27.19 కోట్ల పన్నులు వసూలు చేయాలని పంచాయతీ అధికారులు లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటి వరకు రూ. 23.65 కోట్లు వసూలయ్యాయి. మార్చి 31లోగా వంద శాతం పూర్తి చేస్తామని పంచాయతీ సిబ్బంది, అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిధులకు తోడుగా స్థానిక ఆదాయం స్వపరిపాలనకు ఊతమిస్తుండడంతో పల్లెలు ప్రగతి పథంలో దూసుకెళ్తున్నాయి.
ఇంటి పన్నుల వసూలు జిల్లాలో జోరందుకున్నది. రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం నెలనెలా గ్రామ పంచాయతీలకు పెద్ద ఎత్తున నిధులు అందిస్తూ మౌలిక వసతుల కల్పనతో పాటు పచ్చదనం, పారిశుధ్యాన్ని పెంపొందిస్తున్నది. ఇంటింటికీ తాగునీరు అందేలా చర్యలు తీసుకుంటున్నది. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధికి కార్యక్రమాల ప్రయోజనాలను పొందుతున్న ప్రజల ఆలోచనలోనూ మార్పు మొదలైంది. కొవిడ్ పరిస్థితుల్లోనూ బాధ్యతగా పన్నులు చెల్తిస్తూ పంచాయతీలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఇందుకు నిదర్శనం. రంగారెడ్డి జిల్లాలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకు 87శాతం ఇంటి పన్ను వసూలైంది. ఈ ఏడాది మార్చి వరకు సమయం ఉండడంతో వందశాతం లక్ష్యం చేరుకునేలా సంబంధిత శాఖ జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఇస్తున్న నిధులకు ప్రజలు పన్నుల రూపేణా చెల్లిస్తున్న ఆదాయం తోడవడంతో గ్రామ పంచాయతీల్లో నిధులు జమ అవుతున్నాయి. ఫలితంగా గ్రామాల్లో అభివృద్ధి పనులు సైతం సాఫీగా సాగి పల్లెలు ప్రగతి పథంలో ముందుకు సాగుతున్నాయి.
87శాతం వసూలు…
జిల్లావ్యాప్తంగా మొత్తం 558 గ్రామ పంచాయతీల్లో 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను 87శాతం ఇంటి పన్ను వసూలు చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ ఏడాది పన్ను వసూలు లక్ష్యం రూ.27.19కోట్లు ఉండగా, ఇప్పటివరకు రూ. 23.65కోట్లు వసూలు చేశారు. ఈ ఏడాది మార్చిలోపు లక్ష్యాన్ని అధిగమించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో నిత్యం పంచాయతీ కార్యదర్శులు పన్నుల వసూలు చేపడుతున్నారు. వెనుకబడిన మండలాలపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టి పన్నులు వసూలు చేస్తున్నారు.
ప్రతి నెలా రూ.8కోట్లు..
అభివృద్ధి, సంక్షేమం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా వెనుకకు తగ్గడం లేదు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక సంక్షోభం నెలకొన్నప్పటికీ పొదుపు చర్యలను పాటిస్తూనే నిధులను అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తున్నది. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ప్రతినెలా రూ. 8కోట్ల నిధులను జిల్లాలోని పంచాయతీలకు ప్రభుత్వం విడుదల చేస్తున్నది. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు జిల్లాలోని ఆయా గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నుంచి రూ.90.78కోట్లు విడుదలయ్యాయి. గతంలో ఆర్థిక సంఘం నిధుల్లో వందశాతం గ్రామ పంచాయతీలకే కేటాయిస్తుండగా..ప్రస్తుతం విడుదల చేసిన నిధుల్లో జిల్లా, మండల పరిషత్‌లకు సైతం ప్రాధాన్యం కల్పించింది. గ్రామ పంచాయతీలకు 85శాతం, మండల పరిషత్‌లకు 10శాతం, జిల్లా పరిషత్‌లకు 5శాతం చొప్పున నిధుల కేటాయింపు జరుగుతున్నది. 2011 జనాభా ప్రాతిపదికన మూడు విభాగాల్లో సాధారణ, ఎస్టీ, ఎస్సీ కేటగిరీల వారీగా నిధులను ఖర్చు చేస్తున్నారు. క్రమం తప్పకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిధులను నేరుగా పంచాయతీల ఖాతాల్లో జమ చేస్తుండడం..పన్నులు ఆశించిన స్థాయిలో వసూలు అవుతుండడంతో సంక్షోభ పరిస్థితుల్లోనూ ప్రగతి పరుగులు పెడుతున్నది.
మార్చినాటికి వందశాతం..
జిల్లాలోని 558 గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్ను వసూలు వేగవంతంగా జరుగుతున్నది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 27.19కోట్లు లక్ష్యంగా ఉండగా, ఇప్పటివరకు రూ. 23.65కోట్లు వసూలు చేశాం. పన్నులు వసూలు చేయడంలో సిబ్బంది కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ ఏడాది మార్చిలోగా పూర్తి లక్ష్యాన్ని చేరుకునేలా పటిష్ట కార్యాచరణ అమలు చేస్తున్నాం.
–శ్రీనివాస్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి