‘భూ సేకరణ ప్రక్రియలో హడావుడి ఎందుకు.. భూ సేకరణ చట్టం 2013కు లోబడి నిబంధనల ప్రకారం జరుగాలి..’ అని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పేర్కొన్నారు. సోమవారం దుద్యాల మండలంలోని లగచర్ల, రోటిబండ తండా గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ బృందం సభ్యులు పర్యటించి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ నెల 11వ తేదీన జరిగిన ఘటన వివరాలను తెలుసుకోవడంతోపాటు ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేస్తున్నట్లు ముందుగా అధికారులు తెలుపలేదని, బ్యాంకుల్లో పంట రుణాలు ఇవ్వకపోవడంతో ఆరా తీస్తే విషయం తెలిసిందని బాధితులు కమిషన్ సభ్యులకు మొర పెట్టుకున్నారు. దీంతో ఆందోళనకు గురయ్యామని, అనుకోకుండా లగచర్లలో ఘటన జరిగిందని, అంతమందిలో కలెక్టర్ ఉన్నట్లు తమకు తెలియదని వారు వివరించారు. ఉన్న ఎకరం, రెండు ఎకరాల పొలం పోతే ఏం చేసి బతకాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుల ఎదుట తమ గోడును వెల్లడించారు. రాత్రికిరాత్రే పోలీసులు వచ్చి సంబంధం లేని వారిని కూడా అరెస్టు చేసి తీసుకెళ్లారని, తర్వాత కొంత మందిని విడిచిపెట్టారని కన్నీటిపర్యంతమయ్యారు. ఇంకా మరి కొంత మంది అమాయకులు జైలులోనే ఉన్నారని బోరుమన్నారు. మాకు న్యాయం చేయాలని, తమ వారిని విడిపించి పుణ్యం కట్టుకోవాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులను ఫార్మా బాధితులు వేడుకున్నారు.
– కొడంగల్, నవంబర్ 25
రైతుల ఇష్ట ప్రకారమే భూ సేకరణ జరుగాలి..
– ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
రైతుల ఇష్ట ప్రకారమే భూ సేకరణ జరుగాలి.. సామరస్యంగా మాట్లాడుకుంటే ఉత్తమంగా ఉండేది.. లగచర్ల ఘటన బాధాకరం.. కలెక్టర్‌పై దాడిని ఖండిస్తున్నాం.. అని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. సోమవారం లగచర్ల భూ బాధితులతో ఆయన మాట్లాడారు. బలవంతంగా భూ సేకరణ జరిగే ప్రసక్తే ఉండదని స్పష్టం చేశారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం… భూమికి భూమి లేదా నగదు వంటి ఇతరత్రా సదుపాయాలు కల్పించాల్సి ఉంటుందన్నారు. హడావుడిగా వచ్చి భూములను తీసుకోవడం కుదరదని పేర్కొన్నారు. ఇంత వరకు అధికారులు భూమిని సేకరిస్తున్నట్లు ఏమైనా నోటీసులు అందించారా… అంటూ బాధితులను అడుగగా.. ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, అందుకే ఆందోళనకు గురయ్యామని గ్రామస్తులు తెలిపారు. ముందస్తు నోటీసులు ఇవ్వడంతోపాటు గ్రామంలో దండోరా వేయించి భూ సేకరణ చేపడుతున్నట్లు చెప్పాల్సి ఉంటుందని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ పేర్కొన్నారు.
ప్రజాభిప్రాయ సేకరణతో పాటు రైతులు ఆందోళనకు గురికాకుండా కౌన్సెలింగ్ తదితర ప్రక్రియలనూ నిర్వహించాల్సి ఉంటుందన్నారు. తాతల కాలం నుంచి గిరిజన రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని, భూములు కోల్పోతున్నట్లు తెలిస్తే బతుకులు భారంగా మారి ఆవేదన చెందడం సహజమేనన్నారు. బాధిత కుటుంబాల నుంచి పూర్తి వివరాలు సేకరించామని, రైతులకు అండగా ఉంటామని, అవసరమైతే సీఎంను కలిసి నివేదిక అందిస్తామని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య రైతులకు భరోసా ఇచ్చారు. ఘటనకు సంబంధం ఉన్న వారిపైనే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, అరెస్ట్ అయిన అమాయకులను వెంటనే విడుదల చేసి, వారిపై పెట్టిన కేసును రద్దు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం ప్రజా సంఘాల నాయకులు ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు నీళాదేవి, రాంబాబునాయక్, డీబీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్, అధికారులు పాల్గొన్నారు.