సిటీబ్యూరో/చాంద్రాయణగుట్ట, జూలై 19 (నమస్తే తెలంగాణ) : లాల్‌దర్వాజ బోనాల ఉత్సవాలను ఆదివారం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు నగరవాసులు సిద్ధమయ్యారు. ఆషాడంలో మొదటిగా గోల్కొండ బోనాలు, రెండోది బల్కంపేట ఏల్లమ్మ బోనాలు, ఆ తరువాత సికింద్రాబాద్ ఉజ్జయిని బోనాలు అనంతరం వచ్చే ఆదివారం రోజున లాల్‌దర్వాజ బోనాలు నిర్వహించడం సాంప్రదాయంగా వస్తున్నది. ఈ నేపథ్యంలో నేడు జరిగే లాల్‌దర్వాజ బోనాల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
మరుసటి రోజు సోమవారం లాల్‌దర్వాజ నుంచి చార్మినార్ కేంద్రంగా ఢిల్లీ దర్వాజ వరకు భారీ ఊరేగింపుగా ఘటాల ఉత్సవం కన్నుల పండువగా కొనసాగనున్నది. లక్షలాదిగా భక్తులు తరలిరానుండటంతో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు చేపడుతున్నారు. ‘అమ్మవారి బోనాల ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశాం. ఆదివారం దేవి మహాభిషేకం, బోనాల సమర్పణ, సాయంత్రం శాంతి కల్యాణం, సోమవారం పోతరాజు స్వాగతం, రంగం కార్యక్రమాలతో పాటు లక్షలాది మంది భక్తజనం మధ్య ఘటాల ఊరేగింపు నిర్వహిస్తున్నాం’ అని ఆలయ కమిటీ చైర్మన్ బి.మారుతి యాదవ్ అన్నారు.
‘తెలంగాణ బోనాల ఉత్సవాలను విశ్వవ్యాప్తం చేయాలనే సంకల్పంతో పదకొండు ఏళ్లుగా లాల్‌దర్వాజ బోనాలను దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహిస్తున్నాం. మన సంసృతీ, సంప్రదాయాలకు ప్రతీకగా లాల్‌దర్వాజ బోనాలు నిలుస్తాయి.’ అని ఆలయ కమిటీ కన్వీనర్ జి.అరవింద్ కుమార్‌గౌడ్ అన్నారు. ‘అమ్మవారి బోనాల సమర్పణ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా దర్శనం కోసం పదిలక్షల మంది భక్తుల వరకు వచ్చే అవకాశం ఉంది. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాం. ప్రభుత్వ శాఖల అధికారుల సహకారం తీసుకుంటున్నాం. ప్రశాంత వాతావరణంలో వేడుకలు నిర్వహించుకోవడానికి భక్తులు కృషి చేయాలి.’ అని ఆలయ కమిటీ మాజీ చైర్మన్ కె.వెంకటేశ్ పేర్కొన్నారు.
నేడు మద్యం దుకాణాలు బంద్
బోనాల పండుగ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, కల్లు కంపౌండ్లు, బార్ అండ్ రెస్టారెంట్లను మూసివేస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి ఆదేశాలు జారీచేశారు. అంతేకాకుండా పబ్బులు, క్లబ్బులు, స్టార్ హోటళ్లలో సైతం మద్యం సరఫరాను ఆ ఒక్కరోజు నిలిపివేస్తున్నట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా మద్యం, కల్లు విక్రయాలకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.