పరిగి, ఆగస్టు 30 : ఎన్నికలు వచ్చాయంటే ఏదో ఒకటి చెప్పి ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని.. లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు ఎన్నికల స్టంట్ అని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రూ.20 వేల కోట్లు ఖర్చు చేసి లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టును నిర్మిస్తామని పరిగి, షాద్‌నగర్ ఎమ్మెల్యే లు పేర్కొనడం హాస్యాస్పదమన్నారు. బీఆర్ఎస్ హ యాంలో ఉద్దండాపూర్ రిజర్వాయర్ నుంచి సాగునీటిని తరలించేందుకు కాల్వల నిర్మాణానికి రూ. 5600 కోట్లతో టెండర్లు పూర్తయ్యాయని, ఆ పనులు పూర్తైతే మొదట పరిగి నియోజకవర్గానికి సాగునీరు వస్తుందన్నారు.
శనివారం ఆయన పరిగిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. 20 నెలల కాంగ్రెస్ పాలనలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా తట్టెడు మట్టిని ఎత్తిపోయలేదని ఎద్దేవా చేశారు. స్థానిక ఎన్నికలు రావడంతో అధికార పార్టీకి లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు గుర్తుకొచ్చిందన్నారు. రూ. 20,000 కోట్లు ఖర్చు చేసి రిజర్వాయర్‌ను నిర్మిస్తామని అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రకటించారని, పనులు ఎంత చురుగ్గా జరిగినా ఆ రిజర్వాయర్ నిర్మాణానికి దాదాపుగా ఐదు నుంచి ఆరేండ్ల సమయం పడుతుందన్నారు. టెం డర్లు పూర్తి చేసిన కాల్వల పనులను ప్రారంభిస్తే రెండేండ్లలో జిల్లాలోని భూములకు సాగునీరు అందించొచ్చని ఆయన సూచించారు. బీఆర్ఎస్ హయాంలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులను ప్రారంభిస్తే కాంగ్రెస్ నాయకులే కేసులు వేసి అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత కేసీఆర్ ప్రభుత్వం కేసులన్నింటినీ ఎదుర్కొని ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని 90శాతం వరకు పూర్తి చేసిందన్నా రు. ముఖ్యమంత్రి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై సమీక్ష జరిపి వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలకు నీరు వచ్చే లా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి పాలనపై పట్టు రాలేదని, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 420 హామీల్లో ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు కావడంలేదని మాజీ ఎమ్మెల్యే దుయ్యబట్టా రు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో రైతుభరోసా డబ్బులు వేశారని, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని మరోసారి ఇటీవల డబ్బులు వేశారని, మధ్యలో రెండు పర్యాయాలు పెట్టుబడి సాయం డబ్బులను ఎగ్గొట్టారని ఆరోపించారు. ఈ విషయాన్ని రాష్ట్రంలోని అన్ని వర్గాల వారు గ్రహించారన్నారు.
ఈ ప్రాంతానికి సాగునీరు వచ్చేంతవరకు బీఆర్ఎస్ తరఫున పోరాడుతామన్నారు. గత రెండు నెలలుగా యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. వారికి సరిపడా అందించాలని డి మాం డ్ చేశారు. భారీ వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని, సన్న వడ్లకు క్విం టాకు రూ.500 బోనస్‌ను వెంటనే అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మాజీ ఎంపీపీ కరణం అరవిందరావు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజేందర్, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మీర్ మహమూద్‌అలీ, వెంకట్రాంరెడ్డి, భాస్కర్, వెంకట్రాంకృష్ణారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, కృష్ణ, రవీంద్ర, సంతోష్, రాజు, తాహెర్‌అలీ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.