వికారాబాద్, జనవరి 31, (నమస్తే తెలంగాణ) : జిల్లాలో నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. పరిగి నియోజకవర్గం కులకచర్ల మండలంలోని దాస్యానాయక్ తండాలో సేవాలాల్ సేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించనున్నారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడనున్నారు.
కేటీఆర్ పర్యటన దృష్ట్యా విగ్రహావిష్కరణతోపాటు బహిరంగ సభకు సంబంధించి సేవాలాల్ సేన ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. అదేవిధంగా కేటీఆర్‌కు పరిగి నియోజకవర్గ కేంద్రంలో ఘన స్వాగతం పలకడంతోపాటు భారీ ర్యాలీ నిర్వహించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితాఇంద్రారెడ్డితోపాటు పరిగి, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యేలు మహేశ్‌రెడ్డి, మెతుకు ఆనంద్, బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొననున్నారు.