షాద్నగర్, డిసెంబర్ 16 : షాద్నగర్ గడ్డపై మరోమారు గులాబీ జెండా ఎగురుతుందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం షాద్నగర్ నియోజకవర్గంలో తాజాగా గెలుపొందిన బీఆర్ఎస్ సర్పంచుల సన్మాన కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ తెలంగాణ భవన్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. షాద్నగర్ నియోజకవర్గంలో 65 మందికి పైగా సర్పంచులు, వందల సంఖ్యలో వార్డు సభ్యులుగా బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు గెలుపొందడం సంతోషకరమని పేర్కొన్నారు. ఇదే పట్టుదలతో రానున్న మండల, జిల్లాపరిషత్ ఎన్నికల్లో రాణించాలని పిలుపునిచ్చారు.

ఐకమత్యాన్ని కోల్పోకుండా కలిసికట్టుగా పార్టీ బలోపేతానికి కృషిచేయాలని, ప్రజల పక్షాన పనిచేయాలని కోరారు. కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రజలకు వివరించాలని కోరారు. మరో మూడేండ్లలో కచ్చితంగా మన ప్రభుత్వమే వస్తుందని, ఇప్పటి నుంచే ప్రతి కార్యకర్త పూర్తిస్థాయిలో పనిచేయాలని చెప్పారు.
గెలిచిన సర్పంచులు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రతి గ్రామపంచాయతీకి నిధులు కచ్చితంగా వస్తాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ శ్రేణులను బెదిరిస్తున్నా పట్టించుకోవద్దని చెప్పారు. సంక్షేమ పథకాలను ప్రజలకు అందించాల్సిన ఎమ్మెల్యేలే దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.

2001 నాటి నుంచి నేటి వరకు అంజయ్యయాదవ్ పార్టీ కోసం పనిచేశారని, రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారని తెలిపారు. 2001లో తెలంగాణ అంటే కనీస రాజకీయ అవగాహన లేని సమయంలో తెలంగాణవాదాన్ని తెలంగాణ ప్రాంతానికి వినిపించేలా కేశంపేట జడ్పీటీసీగా గెలుపొందారని చెప్పారు. ఎవ్వరి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని, అంజయ్యయాదవ్ నాయకత్వంలోనే పనిచేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు నారాయణరెడ్డి, రవీందర్యాదవ్, సర్పంచులు, వార్డు సభ్యులు, పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.