కొడంగల్, మార్చి 7 : గ్రామీణ ప్రాంతాల్లో ఎంతోమంది క్రీడా ఆణిముత్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ గుర్తింపు పొందలేకపోతున్నారు. ఆసక్తి ఉన్నవారు ఆయా ప్రాంతాల్లో, పాఠశాలల్లో జరిగే పోటీల్లో పాల్గొని ప్రతిభను కనబరచుకుంటూ క్రీడా ప్రతిభను చాటుకుంటున్నారు. అలాంటి కోవకు చెందినదే కృష్ణవేణి. కొడంగల్ మండలం రుద్రారం గ్రామానికి చెందిన బిజ్జారం కిష్టప్పకు ముగ్గురు సంతానం. కిష్టప్ప గొర్రెల కాపరి. వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆర్థిక స్థోమత లేని కారణంగా ముగ్గురు సంతానాన్ని స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తున్నాడు. కిష్టప్ప పెద్ద కూతురు కృష్ణవేణి ప్రస్తుతం యాలాల మండలంలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో విద్యనభ్యసిస్తున్నది. మరో ఇద్దరు చిన్నారులు స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నారు.
చిన్ననాటి నుంచి కరాటేపై మక్కువ
కృష్ణవేణికి 6వ తరగతి నుంచే క్రీడల్లో రాణించాలనే ఆసక్తిని పెంచుకుంది. ఆర్థికంగా వెనుకబాటుతో ప్రైవేటుగా ఆటలను నేర్చుకోలేకపోయింది. పాఠశాలలోనే కరాటే విద్యను శ్రద్ధగా అభ్యసించింది. పాఠశాల పరిధిలో ప్రావీణ్యం సంపాదించుకొని ఆయా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో పాల్గొని సత్తా చాటుకుంది. బహుమతులతోపాటు ప్రశంసాపత్రాలు, గోల్డ్, సిల్వర్ మెడల్స్‌ను అందుకున్నది. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో రాష్ట్ర, జాతీయస్థాయి కరాటే పోటీల్లో పాల్గొని విజయాల బాటలో ముందుకు సాగుతున్నది.
రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో బంగారు పతకాలు
రాష్ట, జాతీయస్థాయిలో నిర్వహించే కరాటే పోటీల్లో పాల్గొని బంగారు, కాంస్య పతకాలతో పాటు ప్రశంసాపత్రాలు సాధించింది. ఈ నెల 4న రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో న్యూ పవర్ కుంగ్‌ఫూ, కరాటే మార్షల్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ లెవల్ ఆఫ్ ైస్టెల్స్ మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో పాల్గొని సిల్వర్ మెడల్‌ను సాధించినట్లు ఆమె పేర్కొంది. గతంలో చాలా వరకు జాతీయస్థాయి పోటీల్లో కూడా పాల్గొన్నట్లు తెలిపింది. కృష్ణవేణి క్రీడా ప్రతిభను చాటి గ్రామానికి మంచి పేరు ప్రఖ్యాతలు సాధించి పెడుతున్నందుకు గ్రామ పెద్దలు, తోటి స్నేహితులు అభినందిస్తున్నారు.
ప్రోత్సాహముంటే మరింత రాణింపు : కృష్ణవేణి
ఆర్థికంగా వెనుబడి ఉన్నప్పటికీ పాఠశాల, కళాశాలల్లో కరాటే శిక్షణ ఇవ్వడంతో లబ్ధి పొందాను. ఆయా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని విజయం సాధించి బంగారు, కాంస్య పతకాలను సాధించాను. ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే రాష్ట్రం, దేశం తరఫున పోటీల్లో పాల్గొని సత్తా చాటుకోవాలనే కోరిక. నేటి రోజుల్లో మహిళలు అన్నింటా రాణిస్తున్నారు. అదే బాటలో నా కృషి కొనసాగుతుంది.