సిటీబ్యూరో, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): అక్రమ కిడ్నీ మార్పిడి కేసులో నిందితులకు ఇతర రాష్ర్టాలతో పాటు శ్రీలంకకు కూడా లింక్లున్నట్లు రాచకొండ పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పరారీలో ఉన్న కింగ్ పిన్ పవన్ కోసం ఎల్ఓసీ జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి అప్పగించేందుకు నిర్ణయించినా అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు జారీ కాకపోవడంతో ఈ కేసును రాచకొండ పోలీసులే దర్యా ప్తు పూర్తి చేసే అవకాశాలున్నాయి. ఈ కేసులో ఇప్పటి వరకు 13 మందిని సరూర్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న పవన్ శ్రీలంకలో ఎక్కడున్నాడు, ఎవరి వద్ద ఆశ్రయం పొందుతున్నాడు అనే అంశాలపై దృష్టి పెట్టారు. జనవరి 21వ తేదీన సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని డాక్టర్స్ కాలనీలో అలకనంద దవాఖానాలో అక్రమంగా కిడ్నీల మార్పిడి జరుగుతుందని పోలీసులకు వచ్చిన సమాచారంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాలకు చెందిన వారే డోనీ, డోనర్లు ఉన్నారు. అయితే ఇదంతా అక్రమ పద్ధతిలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తుంది. కిడ్నీ కావాల్సిన వారిని, కిడ్ని ఇచ్చే వారిని హైదరాబాద్ తీసుకొచ్చి గుట్టుచప్పుడు కాకుండా కిడ్నీలు మారుస్తున్న ఘరాణ ముఠా గుట్టును పోలీసులు బయట పెట్టారు. పోలీసులకు వచ్చిన ఫిర్యాదుతో అలకనంద దవాఖానలో పోలీసుల సోదాలు నిర్వహించారు, ఆ సమయంలో ఇద్దరు డోనర్లు, ఇద్దరు రిసీవర్లు ఉండడంతో వారిని గాంధీ దవాఖానకు తరలించారు. ఈ కిడ్నీ మార్పిడి రాకెట్ వెనుక ఉన్న వారిని గుర్తించారు. జీవన్‌దాన్‌తో పాటు ఇతరాత్ర మార్గాల ద్వారా కిడ్నీ అవసరమైన బిగ్ షాట్స్‌ను గుర్తించడం, పేదరికంలో ఉంటూ డబ్బు అవసరమైన వారిని గుర్తించి కిడ్నీ ఇచ్చేందుకు ఒప్పిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది.
ఒకో కిడ్నీ మార్పిడికి రూ.55 లక్షల నుంచి రూ. 60 లక్షల వరకు చేతులు మారుతుండగా అందులో రూ. 5 లక్షల వరకే కిడ్నీ ఇచ్చే వారికి అందుతున్నాయని, మిగతావి డాక్టర్లు, ఏజెంట్లు, ఆపరేషన్ థియేటర్ నిర్వాహకులు, దవాఖాన నిర్వాహకులు ఇలా పంచుకుంటున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో జనవరి 25వ తేదీన అలకనంద దవాఖాన నిర్వాహకుడు సుమంత్ ఈ వ్యవహారంలో కీలకంగావ్యవహరించిన జనరల్ సర్జన్ సిద్దంశెట్టి అవినాష్, దళారులు ప్రదీప్, సూరజ్ మిశ్రా, మెడికల్ అసిస్టెంట్స్ గోపి, రమావత్ రవి, రవీందర్, హరీష్, సాయిలను అరెస్ట్ చేశారు. కిడ్నీ అక్రమ దందాలో కీలకంగా వైజాగ్‌కు చెందిన పవన్ వ్యవహరిస్తున్నట్లు విచారణలో బయటపడింది. ఇతడి కోసం పోలీసులు గాలింపు చేపట్టడంతో శ్రీలంకలో తలదాచుకున్నట్లు తెలిసింది. గతంలో శ్రీలంకలో అక్రమ కిడ్నీ రాకెట్ల దందాను పవన్ నిర్వహించాడు. ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ర్టాలకు చెందిన వారితో పాటు తమిళనాడు, కర్ణాటకకు చెందిన వారికి కిడ్నీ మార్పిడి అవసరమైందంటే శ్రీలంకకు తీసికెళ్లి మార్పిడి చేసేవారు. ఈ క్రమంలోనే అక్కడ ఉన్న దవాఖానలు, వైద్యులు, కిడ్నీ మార్పిడి రాకెట్‌తో పవన్‌కు మంచి సంబంధాలున్నాయి. ఇందులో భాగంగానే ఇక్కడ కేసు కాగానే పవన్ శ్రీలంకకు వెళ్లి తలదాచుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు.
కిడ్నీ రాకెట్లో కీలక సూత్రధారిగా ఉన్న పవన్ 2022లో మియాపూర్ ప్రాంతంలో ఒక దవాఖానను నిర్వహించాడు. అదే సమయంలో కిడ్నీల అక్రమ మార్పిడి వ్యవహరంలో పవన్ కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో ఏపీలో కిడ్నీల రాకెట్‌కు సంబంధించి 2023లో కేసు నమోదైయింది. ఈ కేసులో పవన్, పూర్ణ, రాజశేఖర్‌లు అరెస్టయ్యారు. ఈ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత పవన్ నేరుగా కిడ్నీ అవసరమైన వారిని గుర్తించడం, డోనర్లను గుర్తించడం, కావాల్సిన దవాఖానాలను వెతికిపెట్టేందుకు తన నెట్‌వర్క్‌ను విస్తరించాడు. దీంతో 2022 నుంచి హైదరాబాద్‌లోని జననీ, అరుణ, అలకనంద దవాఖానాలో 2025 వరకు భారీ సంఖ్యలో కిడ్నీ మార్పిడీలు నిబంధనలకు విరుద్దంగా నిర్వహించారు.
ఈ ముఠాలకు పవ న్ సూత్రదారిగా వ్యవహరిస్తూ కిడ్నీల దందా నిర్వహించినట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉండగా కిడ్నీ అవసరం ఎవరికి ఉంది అనే విషయాలను గుర్తించేందుకు ఈ ముఠా కొందరకు వైద్యుల సహాయం కూడా తీసుకున్నట్లు విచారణలో బయటపడింది. అయితే వైద్యుల వద్ద నుంచి కిడ్నీ అవసరం ఎవరికుందనే సమాచారాన్ని తీసుకుంటున్నట్లు పోలీసుల విచారణలో బయట పడింది. అయితే ఇదంతా కర్ణాటక, తమిళనాడులోనే ఈ నెట్వర్క్ పనిచేస్తుందని, హైదరాబాద్‌లో కేవలం దవాఖానలలోని ఆపరేషన్ థియేటర్లను వాడుకున్నారని పోలీసుల విచారణలో బయటపడింది. అయితే కీలక నిందితుడి దొరికితే ఈ కేసులో ఇంకా ఎవరికైన సంబంధాలున్నాయా అనే సమాచారం కూడా వస్తుందని భావిస్తున్నారు.
ఇతర రాష్ర్టాలతో ముడిపడి ఉండడం, కీల క నిందితుడు విదేశాలకు పారీపోవడంతో ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీఐడీకి బదిలీ చేస్తుందని అందరు భావించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వంలోని ఓ మంత్రి సైతం కేసును సీఐడీకి బదిలీ చేస్తామన్నారు. మూడు నెలలవుతున్నా ఇప్పటి ఎలాంటి ఆదేశాలు పోలీసులకు అందలేదు. దీంతో రాచకొండ పోలీసులే ఈ కేసు విచారణను పూర్తి చేయనున్నారు. కీలక నిందితుడు పవన్‌ను పట్టుకుంటేనే ఈ కేసు దర్యాప్తు పూర్తి అయ్యేందుకు అవకాశముంటుంది.