ఆదిబట్ల, జనవరి 12 : భార్యాభర్తలను కిడ్నాప్ చేసిన ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన సంఘటన ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. ఆదిబట్ల ఎస్ఐ లక్ష్మీనారాయణ కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా, లింగాల మండలం, ధారారం గ్రామానికి చెందిన కేతావత్ శంకర్‌నాయక్ తన భార్య విజయతోపాటు ఇద్దరు కొడుకులు, కూతురుతో కలిసి కూలి పని చేసుకుంటూ ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని నాదర్గుల్ గ్రామంలో గత కొంతకాలంగా నివాసముంటున్నారు. భార్యాభర్తలు తరచూ గొడవపడుతుండేవారు. దీంతో విజయ తనను వేధిస్తున్నాడని భర్తపై గతంలో సరూర్‌నగర్ పోలీసులకు.. కొన్ని రోజుల క్రితం ఆదిబట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనికంతటికి కారణం తన బావమరిది కృష్ణ, అతడి భార్య పద్మ కారణమని వారిపై కక్ష పెంచుకున్నాడు శంకర్‌నాయక్. మంగళవారం రాత్రి నాదర్గుల్లో నివాసముంటున్న వారిని ఎలాగైనా కిడ్నాప్ చేయాలని పథకం వేశాడు.
తనకు పరిచయమున్న కేతావత్ చిన్న, సీతారాం, నల్లబోతుల రమేశ్, పద్మ, మానుపాటి రాజు, కంప తిరుపతయ్యతో కలిసి వారు నివాసముంటున్న ఇంటికి చేరుకున్నాడు. వారిని కిడ్నాప్ చేసి కారులో ఎత్తుకెళ్లారు. విజయ తన అన్నావదినలను శంకర్‌నాయక్‌తోపాటు మరో ఆరుగురు కలిసి కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆదిబట్ల పోలీసులు కిడ్నాప్ కేసుగా నమోదు చేసి కిడ్నాప్‌నకు గురైన కృష్ణ, పద్మలను రక్షించారు. కిడ్నాప్‌నకు పాల్పడిన ఏ1 కేతావత్ శంకర్‌నాయక్‌తోపాటు మరో ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని ఎస్ఐ తెలిపారు.