రంగారెడ్డి, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ)/ఇబ్రహీంపట్నం : అధికార పార్టీ కుట్రలు, కుతంత్రాలను బీఆర్ఎస్ కౌన్సిలర్లు, నాయకులు తిప్పికొట్టి పార్టీని గెలిపించడంతోపాటు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికలో ఆ పార్టీ పరిశీలకులుగా విచ్చేసిన సబితారెడ్డి, సుధీర్‌రెడ్డి, కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మె ల్యే మల్రెడ్డి రంగారెడ్డి, అధికార పార్టీ నాయకులు కావాలనే సమస్యలు సృష్టించి కోర్టుల ద్వారా ఇప్పటికే రెండుసార్లు ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేయించారన్నారు. ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ పార్టీకి సరిపడా బలం లేకున్నా అధికార దుర్వినియోగంతో మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అనేక కుట్రలు, కుతంత్రాలు చేసిందని.. అయినా బీఆర్ఎస్ కౌన్సిలర్లు మాత్రం సుమారు 50 రోజుల పాటు దీక్ష, పట్టుదలతో ఉండి పార్టీని గెలిపించి ప్రజాస్వామ్యాన్ని రక్షించారని వారు చేసిన పోరాటాన్ని అభినందిస్తున్నట్టు సబితాఇంద్రారెడ్డి తెలిపారు.
బీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు చూపిన పట్టుదల, తెగువ చూస్తుంటే రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించి.. కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన తీరును ప్రజలు గమనిస్తున్నారని.. కౌశిక్‌రెడ్డి విషయంలో ఆయన చేసిన ప్రసంగాన్ని రాష్ట్ర ప్రజలు ఛీదరించుకుంటున్నారన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి దిగజారుడు రాజకీయాలకు పాల్పడారని మండిపడ్డారు.
బీఆర్ఎస్కు చైర్మన్ పీఠం దక్కడాన్ని కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సంఖ్యా బలం లేకున్నా అడ్డదారుల్లో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు అనేక కుట్రలు పన్నినా బీఆర్ఎస్ కౌన్సిలర్లు వాటిని తిప్పి కొట్టారని మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బీఆర్ఎస్ అడ్డా అని కౌన్సిలర్లు, నాయకులు మరోసారి రుజువు చేశారని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా ఉండి పార్టీని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి క్యామ మల్లేశ్, గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి, రైతుబం ధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, వెంకట్‌రెడ్డి, భాస్కర్, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.