తుర్కయాంజాల్, ఆగస్టు 6 : రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధి తొర్రూర్‌లో హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన లే అవుట్లలో తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన బహిరంగ ప్లాట్ల వేలాన్ని తొర్రూర్ హెచ్ఎండీఏ లే అవుట్లో పట్టా కాగితం కలిగి రిజిస్ట్రేషన్ అవ్వని పట్టాదారులు అడ్డుకున్నారు. దీంతో రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని తొర్రూర్ హెచ్ఎండీఏ లేఅవుట్లో పట్టాలు కలిగిన వారితో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పట్టాలు కలిగిన వ్యక్తులు అదనపు కలెక్టర్‌తో మాట్లాడుతూ తొర్రూర్ సర్వే నంబర్ 383లో తమ భూములను తీసుకొని గత ప్రభుత్వం హెచ్ఎండీఏ లేఅవుట్‌ను అభివృద్ధి చేసిందని, లేఅవుట్‌ను అభివృద్ధి చేసిన క్రమంలో సుమారు 100 మందికి ప్రభుత్వం కుటుంబానికి 300 గజాల స్థలాన్ని కేటాయిస్తూ పట్టాలను అందజేసిందని తెలిపారు.
అయితే గతంలో ముగ్గురికి మాత్రమే రిజిస్ట్రేషన్ కాగా, మిగిలిన 97 మందికి హెచ్ఎండీఏ అధికారులు రిజిస్ట్రేషన్ చేయడం లేదని 97 మందికి రిజిస్ట్రేషన్ చేసే వరకూ బహిరంగ వేలం పాటను నిలిపివేయాలని వారు అదనపు కలెక్టర్‌ను కోరారు. అనంతరం అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ కాని 97 మందికి మరో 15 రోజుల్లో రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని బహిరంగ వేలాన్ని మాత్రం అడ్డుకోవద్దని వారికి సూచించారు. దీంతో పట్టాలు కలిగిన 97 మంది మరో 15 రోజుల పాటు రిజిస్ట్రేషన్ కోసం వేచి చూస్తామని లేని పక్షంలో తిరిగి తమ భూమిలో వ్యవసాయం చేసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి, రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్ చీఫ్ ఇంజినీర్ భాస్కర్‌రెడ్డి, జనరల్ మేనేజర్ నరేందర్‌రెడ్డి, డీఈ రవీందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, మల్లారెడ్డి, అబ్దుల్లాపూర్‌మెట్ మండల తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు.
ఆర్అండ్బీ రోడ్ల పరిశీలన..
మున్సిపాలిటీలో రూ.65కోట్లతో ఆర్అండ్బీ అధికారులు అభివృద్ధి చేస్తున్న రోడ్లను బుధవారం రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పనులలో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఆర్అండ్బీ అధికారులు పాల్గొన్నారు.