రంగారెడ్డి, మే 31 (నమస్తే తెలంగాణ) : రిజర్వాయర్ వద్దు.. మాకు పొలాలే కావాలంటూ శనివారం మాడ్గుల మండలంలోని ఇర్విన్ గ్రామ రైతులు కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. తాతల కాలం నుంచి ఆ భూముల్లో వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నామని ..రిజర్వాయర్ నిర్మాణానికి ఆ భూములను తీసుకుంటే తాము రోడ్డున పడుతామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూముల్లో రిజర్వాయర్ వద్దే..వద్దంటూ తాము పలు రకాలుగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడంలేదని.. రూ.కోటి విలువ చేసే భూమికి సర్కార్ కేవలం 8,00,000 మాత్రమే ఇస్తుందని.. రైతుల అంగీకారం లేకుండానే ప్రభుత్వం ఆ భూములను తీసుకొని రైతుల బ్యాంకు ఖాతాల్లో ఎకరానికి ఎనిమిది లక్షల చొప్పున జమ చేస్తున్నదని మండిపడ్డారు.
రిజర్వాయర్ పూర్తైతే రామపురం నల్లచెరువు ఇరువైపులా ఉన్న గ్రామాల్లోని రైతులు సుమారు వెయ్యి ఎకరాల వరకు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశా రు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రిజర్వాయర్ నిర్మాణానికి చర్యలు తీసుకోగానే.. వద్దని ప్రభుత్వ పెద్దలను కలిస్తే..ఆ ప్రతిపాదనను విరమించుకుని దాని స్థానంలో పంప్‌హౌస్‌ను నిర్మిస్తామని చెప్పారని గుర్తు చేశారు. అయితే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ రిజర్వాయర్ నిర్మాణం అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిందని.. రిజర్వాయర్ కోసం రాత్రి సమయాల్లో డ్రోన్ కెమెరాలతో సర్వే నిర్వహిస్తున్నారని రైతులు పేర్కొన్నారు. ఆదుకుంటాడని భావించిన రేవంత్‌రెడ్డి తమను నిలువునా ముంచాలని చూస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రిజర్వాయర్ నిర్మాణాన్ని రద్దు చేసి రైతులను ఆదుకోవాలి. లేని పక్షంలో భూమికి బదులు భూమి ఇవ్వాలి. తమ తాతలు, తండ్రులు ఈ భూములనే నమ్ముకొని జీవించారు. మేము కూడా ఈ భూము ల్లో పంటలు పండించుకుని బతుకుతున్నాం. భూములు తీసుకొని మమ్మల్ని రోడ్డుపాలు చేయొద్దు. రిజర్వాయర్ నిర్మాణంతో మాకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. కొంతమంది పెద్దల ప్రయోజనాల కోసమే దానిని నిర్మిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి రిజర్వాయర్ నిర్మాణాన్ని రద్దు చేయాలి.
– కడారి అల్లాజీ
ఇర్విన్ గ్రామ పరిసరాల్లో ఎకరానికి రూ. కోటి వరకు ధర పలుకుతున్నదని.. కానీ, ప్రభుత్వం ఎకరం భూమికి రూ. 8,00,000 నష్టపరిహారం కింద చెల్లిస్తే తాము తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వాయర్ కోసం తమ భూములను తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తే.. భూమికి బదులు భూమి ఇవ్వాలని లేకుంటే.. బయట మార్కెట్లో ఉన్న ధర ప్రకారం ఎకరానికి రూ. కోటి వరకు చెల్లించడంతోపాటు ఇంటికొక ఉద్యోగం, ఇండ్ల స్థలం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయకుండా భూములను బలవంతంగా తీసుకుంటే ఆత్మహత్యలు చేసుకుంటామని రైతులు హెచ్చరించారు.
గ్రామాల్లో భూమి ఉంటేనే విలువ ఉంటుంది. కానీ, ప్రభుత్వం నాకున్న మూడు ఎకరాలను తీసుకోవాలని చూస్తున్నది. భూమి లేకపోతే మా పిల్లలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి జీవించాలి వస్తుంది. అంతేకాకుం డా పిల్లను కూడా ఇవ్వరు. భూములను మా నుంచి విడదీయొద్దు. ముఖ్యమంత్రి మా గోడు విని న్యాయం చేయాలి.
-అంజమ్మ రైతు