e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, January 20, 2022
Home రంగారెడ్డి వరికి బదులుగా ఇతర పంటలు సాగు చేయండి

వరికి బదులుగా ఇతర పంటలు సాగు చేయండి

  • వచ్చే ఏడాది ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవు
  • ఉమ్మడి జిల్లాల వ్యవసాయాధికారులు గోపాల్‌, గీతారెడ్డి

బొంరాస్‌పేట, డిసెంబర్‌ 7 : యాసంగిలో రైతులు వరికి బదులు ఇతర పంటలను సాగు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి గోపాల్‌ అన్నారు. మంగళవారం మండలంలోని బురాన్‌పూర్‌లో ఆరుతడి పంటల సాగుపై ఆయన రైతులకు అవగాహన కల్పించారు. యాసంగిలో సాగు చేసే ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనబోమని తేల్చిచెప్పడంతో రైతులు వరి సాగును మానుకోవాలని సూచించారు. యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా ఉండవన్నారు. వరికి బదులు రాగులు, పెసర, వేరుశనగ, మినుములు, బెబ్బెర్లు వంటి పంటలను రైతులు సాగు చేసుకోవాలని, మినుములను పండిస్తే ప్రభుత్వం వాటిని కొనుగోలు చేస్తుందని డీఏవో అన్నారు. ఒక ఎకరా వరి పంటను పండించే నీటితో మూడు ఎకరాల ఆరుతడి పంటలను సాగు చేయవచ్చని, ఆరుతడి పంటలతో లాభాలు ఉంటాయన్నారు. ఇతర పంటలను సాగు చేసుకునే రైతులకు విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నామని గోపాల్‌ అన్నారు. చెరువుల కింద రైతులు వరిసాగు చేస్తే సన్నరకాలను సాగు చేసుకోవాలని.. వాటిని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయదని, మిల్లింగ్‌ చేసుకుని బియ్యం అమ్ముకుంటే రైతులకు లాభదాయకంగా ఉంటుందని అన్నారు. బోర్ల కింద మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వరి సాగు చేయరాదని డీఏవో గోపాల్‌ స్పష్టం చేశారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన
మండలంలోని బురాన్‌పూర్‌, నాగిరెడ్డిపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను డీఏవో గోపాల్‌ సందర్శించి ధాన్యం కొనుగోళ్లను, తేమ శాతాన్ని పరిశీలించారు. తూకం చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని సూచించారు. రైతుల ఆధార్‌ కార్డులను యంత్రాలలో నమోదు చేస్తే రైతులకు ఓటీపీ నెంబరు వెళ్తుందని, కానీ వివరాలు మాత్రం డిస్‌ప్లే కావడం లేదని, దీనివల్ల జాప్యం జరుగుతున్నదని కొందరు రైతులు డీఏవో దృష్టికి తెచ్చారు. స్పందించిన గోపాల్‌ వెంటనే పౌరసరఫరాల శాఖ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. బురాన్‌పూర్‌ కొనుగోలు కేంద్రం పరిధిలోకి దుప్‌చెర్ల గ్రామాన్ని చేర్చడంతో కేంద్రంలో ధాన్యం ఎక్కువగా వచ్చి రద్దీ పెరిగిందని, దుప్‌చెర్ల గ్రామాన్ని బొంరాస్‌పేట కేంద్రం పరిధిలోకి మార్చాలని ఎంపీటీసీ సుదర్శన్‌రెడ్డి, రైతులు డీఏవోను కోరారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, ఏవో రాజేశ్‌కుమార్‌, ఏఈవో భార్గవి పాల్గొన్నారు.

- Advertisement -

ఆరుతడి పంటలవైపు మొగ్గు చూపాలి
కొత్తూరు రూరల్‌, డిసెంబర్‌ 7 : ఆరుతడి పంటలవైపు రైతులు మొగ్గు చూపలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గీతారెడ్డి అన్నారు. కొత్తూరు మండల పరిధిలోని ఏనుగులమడుగుతండాలో గీతారెడ్డి పర్యటించారు. రైతులతో మాట్లాడుతూ ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కల్పించారు. వరికి బదులు ఆరుతడి పంటలు వేయడం వల్ల రైతులకు మంచి లాభాలు వస్తాయని తెలిపారు. ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖ అధికారులపై ఉందన్నారు. కార్యక్రమంలో షాద్‌నగర్‌ ఏడీ రాజారత్నం, మండల వ్యవసాయ శాఖ అధికారి గోపాల్‌, సర్పంచ్‌ అరుణ, ఎంపీటీసీ పత్లవత్‌ డాకి, ఏఈవో దీపిక పాల్గొన్నారు.

మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలు వేయాలి
నందిగామ, డిసెంబర్‌ 7 : మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలు వేయడం ద్వారా రైతులకు అధిక లాభాలు వస్తాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గీతారెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని బండోనిగూడ గ్రామంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గీతారెడ్డి పర్యటించి ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ సూచనల మేరకు వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు ఆరుతడి పంటలపై అవగాహన కల్పించాలని.. దీనికి ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల నేతలు, రైతులు సహకరించాలని కోరారు. ఆరుతడి పంటలైన నువ్వులు, రాగులు, పెసర్లు, మినుములు, కుసుమలు, వేరుశెనగ వంటి నూనెగింజల పంటల సాగువైపు రైతులు మొగ్గు చూపేలా ప్రోత్సహించాలన్నారు. రైతులకు కావాల్సిన విత్తనాలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. కార్యక్రమంలో షాద్‌నగర్‌ ఏడీ రాజారత్నం, మండల వ్యవసాయ శాఖ అధికారి శ్వేత, బండోనిగూడ సర్పంచ్‌ జెట్ట కుమార్‌, ఏఈవో రవి, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement