కొడంగల్, అక్టోబర్ 7 : మున్సిపల్ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులు ప్రపోజల్స్ చేశారు. సోమవారం సీడీఎంఏ వీపీ గౌతమ్ మున్సిపల్ పరిధిలో పర్యటించి అభివృద్ధి చేపట్టాల్సిన పనులపై కలెక్టర్ ప్రతీక్‌జైన్‌తో పాటు అధికారులతో కడా కార్యాలయంయలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా మున్సిపల్ పరిధిలోని అంబేద్కర్ కూడలి, లాహోటీ కాలనీలో పార్క్, పాత కొడంగల్ ప్రాంతంలోని ఎడ్యుకేషన్ హబ్ స్థలం, కొడంగల్ పెద్ద చెరువు వద్ద లేక్ వ్యూ డెవలప్మెంట్, మినీ స్టేడియం, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, ఇంటర్నల్ రోడ్స్, డంపింగ్ యార్డ్ తదితర అభివృద్ధి పనుల నిర్వహణపై అధికారులతో చర్చించారు. చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించి ప్రణాళిక, పనుల ప్రారంభం వంటి వాటితో పాటు మున్సిపల్ పరిధిలోని పలు అభివృద్ధి పనులకు సంబంధించి వివరాలను సీడీఎంఏ అధికారులతో వివరాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
పారిశుధ్యం, పచ్చదనంపై శ్రద్ధ పెట్టాలి
పరిగి : పారిశుధ్యం, పచ్చదనంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీడీఎంఏ గౌతమ్ మున్సిపల్ కమిషనర్‌కు సూచించారు. సోమవారం పరిగిలోని మున్సిపల్ కార్యాలయాన్ని కలెక్టర్ ప్రతీక్‌జైన్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా భువన్ యాప్‌లో ఇండ్ల వివరాల నమోదు, స్వచ్ఛ ఆటోలకు జీపీఎస్ ట్రాక్, పన్నుల వసూలును పర్యవేక్షించడంతోపాటు జంతు జనన నియంత్రణ కేంద్రంలో కుక్కలకు కు.ని. ఆపరేషన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పరిశుభ్రతపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటింటి నుంచి చెత్త సేకరణ, డంపింగ్‌యార్డు విషయం అడిగి తెలుసుకున్నారు.
డంపింగ్‌యార్డు కోసం సర్వే నం.50లో 4 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు కేటాయించారని అధికారులు సీడీఎంఏకు వివరించారు. మున్సిపల్లో పనిచేసే ఏఈ పదోన్నతిపై వెళ్లడంతో అభివృద్ధి పనులు చేపట్టడంలో జాప్యం జరుగుతున్నదని సీడీఎంఏ దృష్టికి తీసుకురాగా ఏఈ నియామకం చేపడతామని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, కమిషనర్ వెంకటయ్య, డీఈఈ రాకేశ్, మేనేజర్ నరేశ్‌కుమార్, మున్సిపల్ ఉద్యోగులు పాల్గొన్నారు.