రంగారెడ్డి, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో భూసమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. శివారు ప్రాంతాల్లో భూ ముల ధరలు విపరీతంగా ఉన్న నేపథ్యంలో కొం దరు తప్పుడు పత్రాలు సృష్టించి భూములను కబ్జా చేస్తున్నారు. భూవివాదాలతో శాంతిభద్రతల సమస్య తలెత్తి పోలీసులకు సవాల్‌గా మారుతున్నది. జిల్లాలో 16 మున్సిపాలిటీలు, 2 మున్సిపల్ కార్పొరేషన్లున్నాయి. ఈ మున్సిపాలిటీల పరిధి నుంచి ఔటర్‌రింగ్ రోడ్డు వెళ్లడంతో శివారు ప్రాం తాల్లో భూములకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఔటర్ లోపలి గ్రామాల్లో గజం భూమి విలువ రూ. 30,000 నుంచి రూ. 1,00,000 వరకు చేరింది. దీంతో ఖాళీగా ఉన్న భూములపై కొంతమంది తప్పుడు పత్రాలు సృష్టించి కబ్జాలకు పాల్పడుతున్నా రు. అసలు యజమానులు ఒరిజినల్ పత్రాలతో వచ్చేలోపే వాటిని ఇతరులకు విక్రయిస్తున్నారు. అలాగే, ఔటర్ వెలుపలి గ్రామాల్లోనూ భూసమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పెద్దఅంబర్‌పేట, తుర్కయాంజా ల్, ఆదిబట్ల, తుక్కుగూడ, ఇబ్రహీంప ట్నం వంటి మున్సిపాలిటీల్లో అధికంగా ఉన్నాయి.
తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని కమ్మగూడ గ్రామంలో భూసమస్యపై ఇరువర్గాల వారు పరస్పరం దాడులకు దిగి వాహనాలకూ నిప్పు పెట్టడంతో శాంతిభద్రతల సమస్య తలెత్తింది. ఈ గ్రామంలోని సర్వేనంబర్ 240, 241, 242లలో ఉన్న పదెకరాలపై కొంతకాలంగా వివాదం జరుగుతున్న ది. ఈ సర్వేనంబర్‌లోని భూమి తమదం టూ కొందరు ఇప్పటికే కొన్ని ప్లాట్లు చేసి విక్రయించారు. ఇటీవల కోర్టు తమకే అనుకూలంగా తీర్పునిచ్చిందని మరికొందరు భూమి తమదేనటు అక్కడికి రావడంతో ఇరువురి మధ్య పరస్పరం రాళ్ల దాడులు జరిగాయి. ఇరువర్గాల వారు పెద్ద ఎత్తున జనాన్ని పోగుచేసుకోవడంతో గ్రామంలో శాంతిభద్రతల సమస్య తలెత్తడంతో పోలీసులు పికెట్‌ను ఏర్పాటు చేశారు. శాంతిభద్రతల దృష్ట్యా ఆ భూమి వైపు ఎవరూ వెళ్లొద్దంటూ 160 సెక్ష న్ అమల్లోకి తీసుకొచ్చారు.
అలాగే, పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీలోని కుంట్లూరు గ్రామంలోనూ పట్టాదారులు, ప్లాట్ల యజమానులకు మధ్య భూవివాదం కొనసాగుతున్నది. ఆదిబట్ల ఠాణా పరిధిలోని పలు గ్రామాల్లోనూ భూసమస్యలు పెద్ద ఎత్తున తలెత్తుతున్నాయి. ఔటర్‌రింగ్‌రోడ్డు పరిసర ప్రాంతాల్లోని పలు గ్రామాల్లోనూ భూ సమస్యలకు సంబంధించిన కేసులు ప్రతిరోజూ ఆయా ఠాణాలకు చేరుతున్నాయి. బాధితులు న్యాయం చేయాలని పోలీసులను కోరుతున్నారు.
జిల్లాలో 21 మండలాలు గ్రామీణ ప్రాంతాలుగా ఉన్నాయి. ఈ మండలాల్లో డబుల్ రిజిస్ట్రేషన్ల వివాదాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొన్నేండ్ల కిందట భూములను కొని ప్లాట్లు చేసి విక్రయించారు. భూములు కొనుగోలు చేసిన వారి పేర్లు రికార్డుల్లో నమోదు కాకపోవడంతో.. గతంలో భూములు విక్రయించిన వారి పేరుమీదనే పాస్బుక్కుకొచ్చాయి. దీంతో కొత్తగా పాస్‌బుక్కులు రావడంతో ఆ భూమిని మరొకరికి తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఈ డబుల్ రిజిస్ట్రేషన్లతో ఇరువురు కొనుగోలు దారుల మధ్య వివాదాలు తలెత్తి పోలీస్స్టేషన్ల వరకు ఆ గొడవ వెళ్తున్నది. ఈ సమస్య అనేక గ్రామాల్లో కొనసాగుతున్నది.
జిల్లాలో నకిలీ ధ్రువపత్రాలు పెద్ద ఎత్తున తెరపైకి వస్తున్నాయి. భూముల ధరలు పెరగడంతో ఎప్పుడో ప్లాట్లు కొనుగోలుచేసి విదేశాలకు వెళ్లిన వారు ఇక్కడ లేకపోవడాన్ని ఆసరాగా తీసుకుంటున్న కొందరు.. ఆ ప్లాట్లపై తప్పుడు ధ్రువపత్రాలను సృష్టించి విక్రయిస్తున్నారు. దాని యజమానులు చాలా రోజుల తర్వాత వచ్చి తమ ప్లాట్లను చూసుకునే సరికి ఆ కబ్జాలోకి మరొకరు వస్తున్నారు. అలాగే, ఇనాం లాంటి భూములపైనా తప్పుడు ఓఆర్సీలు సృష్టిస్తూ కొంతమంది భూములు తమవంటూ ముందుకొస్తుండడంతో భూసమస్యలు తలెత్తుతున్నాయి.
నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి భూములను కబ్జా చేసే వారిపై చర్యలు తీసుకుంటాం. శివారు ప్రాంతాల్లో నకిలీ పత్రాలను సృష్టిం చి భూములను కబ్జా చేస్తున్నట్లు పలు ఫిర్యాదులొచ్చాయి. భూ వివాదాలకు పాల్పడే ముఠాలను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.
-కేపీవీ రాజు, ఇబ్రహీంపట్నం ఏసీపీ