సిటీబ్యూరో, అక్టోబర్ 3 ( నమస్తే తెలంగాణ ) : సారథి నుంచి రవాణా శాఖ తప్పుకోనుందా? మళ్లీ పాత సాఫ్ట్వేర్ పోర్టల్ సీఎఫ్ఎస్టీనే వినియోగంలోకి తీసుకురానున్నారా? స్లాట్ బుక్ చేయడానికి కూడా వీల్లేని విధంగా సారథి పోర్టల్.. ఓటీపీలు సకాలంలో రాక ఇబ్బందులు పెడుతున్న పోర్టల్‌తో ఆర్టీఏ అధికారులు సైతం విసిగిపోతున్నారు. ఈ క్రమంలో రెండు నెలల నుంచి సారథి సేవలపై రవాణా శాఖ ఉన్నతాధికారులు ఆర్టీఓ కార్యాలయాల వారీగా ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. నగరంలోని అన్నీ ఆర్టీఓ కార్యాలయాల నుంచి సారథీ పోర్టల్‌తో అన్నీ ఇబ్బందులే ఎదురవుతున్నాయంటూ ఆర్టీఓలు అభిప్రాయాలను పంపించారు. సారథి సమస్యలను పరిష్కరించే ఐటీ బృందాలు సైతం ఎర్రర్ ఇష్యూలను పరిష్కరించలేకపోతున్నది. వాహనదారులు లైసెన్స్‌ల విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నదని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో సారథి పోర్టల్ సేవల నుంచి తప్పుకునే మార్గాలను సైతం రవాణా శాఖ ఉన్నతాధికారులు చర్చిస్తున్నట్టు తెలిసింది.
ఎక్కడైనా ఏదైన కొత్త పాలసీ అమలు చేయాలంటే ముందుగా పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేసి వాటిలోని సాధ్యసాధ్యాలను పరిశీలిస్తారు. ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వాటికి పరిష్కార మార్గాలను గుర్తిస్తారు. పూర్తిస్థాయిలో ఆ పాలసీ అమలు చేయడానికి అవసరమైన అన్నీ మార్గాలను సులభతరం చేస్తారు. కానీ రవాణా శాఖ అధికారులు సారథి పోర్టల్ సేవలను వినియోగంలోకి తీసుకురావడానికి సికింద్రాబాద్ ఆర్టీఏ కార్యాలయాన్ని పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేశారు. కానీ ఇబ్బందులను మాత్రం వదిలేశారు. స్లాట్ సమస్య పైలెట్ ప్రాజెక్టులోనే ఎదురయ్యాయి. కానీ వాటికి పరిష్కార మార్గాలను కనుగొనడంలో విఫలమయ్యారు. సెంట్రల్ పోర్టల్ అంతే ఉంటుందంటూ మిగిలిన కార్యాలయాల్లోనూ సారథి పోర్టల్ అమలు చేశారు.
దీంతో సారథి సమస్యల వలయంలో చిక్కుకున్నది. స్లాట్ బుక్ చేయాలంటే వాహనదారులకు తలకు మించిన భారంగా మారింది. స్వతహాగా స్లాట్ బుక్ చేసుకోలేని విధంగా టెక్నికల్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఒక్క స్లాట్ బుక్ చేయాలంటే గంటకుపైగా సమయం తీసుకుంటుంది. అందులోనూ నాలుగైదు సార్లు ఓటీపీలు ఎంటర్ చేయాల్సి వస్తున్నది. అవి సకాలంలో రాక మళ్లీ మళ్లీ ఓటీపీలు వస్తుండటంతో తీరా ప్రాసెస్ సమయం ముగిసి మళ్లీ మొదటికొస్తున్నది. సారథీ స్లాట్ బుక్ చేయాలంటే ఏజెంట్లను ఆశ్రయించి రూ. వెయ్యి వరకు వసూలు చేస్తున్నారు. స్లాట్ బుకింగ్‌లో సమస్యలు వస్తుండటంతో వాహనదారులు ఏజెంట్లను ఆశ్రయించడానికే మోగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో సారథి సేవలు నిలిపివేసి సీఎఫ్ఎస్టీ పోర్టల్ సేవల వినియోగించడంపై యోచిస్తున్నట్టు ఓ అధికారి తెలిపారు.