వికారాబాద్ జిల్లావ్యాప్తంగా సెప్టెంబర్ నెల మొదటి వారంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిసి పంటలు, కూరగాయలకు తీవ్ర నష్టం వాటిల్లగా.. ప్రభుత్వం అరకొరగా పరిహారం అందించడంతోపాటు పరిహారం అందుకున్న రైతుల జాబితాను వ్యవసాయాధికారులు గోప్యంగా ఉంచడం పలు విమర్శలకు తావిస్తున్నది. సెప్టెంబర్ నెల ప్రారంభంలో వరుసగా నాలుగైదు రోజులపాటు కురిసిన వర్షానికి అన్ని ప్రాంతాల్లో పంటలకు, కూరగాయలకు నష్టం చేకూరింది. దీంతో పంటలు నష్టపోయినవారికి పరిహారం అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో పర్యటించి నష్టం అంచనా వేయాల్సిందిగా వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించింది.
ఇందులోభాగంగా అధికారులు పంట నష్టానికి సంబంధించిన అంచనాలు తయారుచేసి ప్రభుత్వానికి పంపించారు. ప్రభుత్వం పరిహారం డబ్బులు విడుదల చేసిన తర్వాత చూస్తే తక్కువ విస్తీర్ణం పంటలకే పరిహారం మంజూరైంది. వికారాబాద్ జిల్లావ్యాప్తంగా 1385 మంది రైతులకు 1508.32 ఎకరాలకు రూ.1,50,88,000 పంట నష్ట పరిహారాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. భారీ వర్షాల వల్ల వేల ఎకరాల్లో పంటలకు నష్టం జరిగితే కేవలం 1508 ఎకరాలకే పరిహారం అందించడం ఏమిటని పలువురు రైతులు ప్రశ్నిస్తున్నారు. పంట నష్టం అంచనాల తయారు సమయంలోనే ఎంత మేరకు తగ్గితే అంత కుదించాలనే మౌఖిక ఆదేశాల వల్లే ఇంత తక్కువ విస్తీర్ణంలో పంట నష్ట పరిహారం వచ్చిందనే విమర్శలున్నాయి.
– పరిగి, నవంబర్ 6
విడుదలకాని రైతుల జాబితా..
సెప్టెంబర్ నెల ప్రారంభంలో నాలుగైదు రోజులపాటు కురిసిన భారీ వర్షాలకు వాగులు వరద నీటితో ఉధృతంగా ప్రవహించడంతోపాటు పొలాల్లో నీరు నిలిచి, రోజుల తరబడి ఎండ లేకుండా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లగా జిల్లావ్యాప్తంగా కేవలం 1508 ఎకరాలకే పరిహారం అందడం ఏమిటని పలువురు రైతులు ప్రశ్నిస్తున్నారు. దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం ఎకరాకు రూ.10వేల చొప్పున నష్ట పరిహారం అందించింది. 33 శాతానికి పైగా నష్టపోయిన పంటలకే పరిహారం అందిందని వ్యవసాయాధికారులు పేర్కొంటుండగా.. పరిహారం అందిన రైతుల జాబితా విషయంలో ఎందుకు గోప్యత పాటిస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. వాస్తవంగా పంట నష్టం అంచనా వేస్తే గోప్యత ఏమి అవసరమని ప్రశ్నిస్తున్నారు. ఒకసారి జిల్లావ్యాప్తంగా పరిహారం అందిన వివరాలు పరిశీలిస్తే వర్షాలు కురిసి అన్ని గ్రామాల్లో నష్టం జరగగా.. పెద్దేముల్ మండలంలో ఒక్క రైతుకే పరిహారం రావడం ఏమిటని పేర్కొంటున్నారు. పలు మండలాల్లో ఒక క్లస్టర్ పరిధిలోని ఒకటి రెండు గ్రామాల రైతులకే పరిహారం వచ్చింది. వాగుల పక్కన, పల్లపు భూముల్లో నీరు నిలిచిన చోటనే నష్టం వాటిల్లిందని వ్యవసాయాధికారులు పేర్కొంటుండగా.. అసలు ఏ రైతు పంటకు నష్టం జరిగింది, ఎవరికి పరిహారం అందిందనే విషయంలో వ్యవసాయాధికారులు జాబితా విడుదల చేయకుండా గోప్యత పాటించడం పలు అనుమానాలకు తావిస్తున్నదని పలువురు రైతులు పేర్కొంటున్నారు. వాస్తవంగా నష్టం జరిగిన రైతుల పేర్లే రాస్తే గోప్యత అవసరం లేదని అంటున్నారు.
పంటలు నష్టపోయినా పరిహారం రాలేదు
గత నెల మొదటి వారంలో వరుసగా భారీ వర్షాలు కురిసి వివిధ పంటలకు, కూరగాయలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించాల్సి ఉండగా వ్యవసాయాధికారులు సరైన అంచనాలు తయారు చేయకపోవడం వల్ల వాస్తవంగా పంట నష్టం జరిగిన రైతులకు పరిహారం అందలేదు. పరిగి మండలం నస్కల్ క్లస్టర్లో వర్షాలతో పంటలకు నష్టం వాటిల్లగా మా గ్రామానికి చెందిన రైతులకు నష్టపరిహారం అందలేదు.
– మేడిద రాజేందర్, నస్కల్, పరిగి మండలం