ఇబ్రహీంపట్నంరూరల్ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధియే లక్ష్యంగా ముందుకు సాగేందుకు రాష్ట్రంలో అనేక అనుబంధ గ్రామాలను నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే ఇబ్రహీంపట్నం మండలంలోని కర్ణంగూడ గ్రామం నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటైంది. నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడిన కర్ణంగూడ గ్రామానికి తొలిసారిగా సర్పంచ్‌గా ఎన్నికైన వంగేటి కవిత తిరుమల్‌రెడ్డి గ్రామాభివృద్ధియే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. నూతనంగా ఏర్పడిన గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించడంతో పాటు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమంలో ఆగ్రస్థానం సాధించింది.
దీంతో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సహకారంతో గ్రామానికి నూతన గ్రామ పంచాయతీ భవనం ఏర్పాటు కోసం ప్రభుత్వం గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అభినందిస్తూ ఆర్జీఎస్ఏ నిధులు కింద రూ. 20లక్షలు మంజూరు చేసింది. అతితక్కువ కాలంలో గ్రామ పంచాయతీ భవనాన్ని సకల హంగులతో పూర్తి చేశారు. గురువారం నూతన గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవానికి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి హాజరుకానున్నందున సర్పంచ్ కవిత తిరుమల్‌రెడ్డి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.