Pharma | యాచారం, మే 6 : ఫార్మా భూ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించకపోతే ఫార్మా ఫెన్సింగ్‌ను అడ్డుకుని తీరుతామని రైతులు స్పష్టం చేశారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి.. మండలంలోని మేడిపల్లి, నానక్‌నగర్ గ్రామాలకు చెందిన ఫార్మా రైతులతో తహసీల్దార్ అయ్యప్ప ఆధ్వర్యంలో మంగళవారం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో రైతులు తమ సమస్యలను పరిష్కరించాలని ఆర్డీఓను నిలదీశారు. అసైన్డ్ భూములకు డబ్బులు చెల్లించకుండా పీఓటీ పేరుతో అక్రమంగా పెన్సింగ్ వేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఫార్మాసిటికి భూములు ఇచ్చిన రైతులకు పూర్తిస్థాయిలో డబ్బులు చెల్లించేవరకు అట్టి భూములకు ఫెన్సింగ్ వేయవద్దని సూచించారు. ఫార్మాకు భూములిచ్చిన రైతులకు పూర్తిస్థాయిలో డబ్బులు చెల్లించకుండానే ఫెన్సింగ్ వేయటం ఎంతవరకు సమంజసమని రైతులు ప్రశ్నించారు.
దీంతో ఆర్డీఓ స్పందిస్తూ.. అసైన్డ్ భూములకు ఫెన్సింగ్ వేస్తున్నట్లు తెలిపారు. ఫెన్సింగ్‌ను అడ్డుకోవద్దని బాధిత రైతులకు న్యాయం చేసేందుకు కృషిచేయనున్నట్లు ఆయన తెలిపారు. రైతులు మాత్రం డబ్బులు చెల్లించటంతో పాటు ఫార్మా ప్లాట్లు ఇచ్చేవరకు ఫెన్సింగ్ వేయవద్దని పట్టుబట్టారు. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి పరిష్కరించేందుకు కృషిచేస్తానని ఆర్డీఓ సూచించారు. దీంతో రైతులు మాత్రం తమ సమస్యలను పరిష్కరించిన తర్వాతే సర్వే చేసిన భూములకు ఫెన్సింగ్ వేసుకోవాలని, అప్పటివరకు భూముల జోలికి రావద్దని కోరారు. ఈ కార్యక్రమంలో ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు కానమోని గణేష్, సందీప్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, మంగమ్మ, మేడిపల్లి, నానక్‌నగర్ గ్రామాలకు చెందిన రైతులున్నారు.