తుర్కయాంజల్ : వారం రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వానలకు తుర్కయాంజల్‌లోని మాసాబ్ చెరువుకు వదర నీరు పోటెత్తింది. అలుగు నీరు దిగువ గ్రామాల పై విరుచుకుపడుతుంది. వరద ఉధృతితో ఇంజాపూర్-తొరూర్ గ్రామాల రోడ్డుపై ప్రవహిస్తుండటంతో ఇరు గ్రామాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే దీనికి దిగువన ఉన్న మునగనూర్-హయత్‌నగర్ రోడ్డు మార్గం పై కూడా వరద ప్రవహిస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరో పక్క కొహెడ వెంకట్‌రెడ్డి వాగుకు వరద నీరు పోటెత్తడంతో కొహెడ-తొరూర్ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అదే విధంగా తారామతిపేటలో సీతవాగు ఉరకలేస్తుండటంతో ఓఆర్ఆర్ సమీపంలో తారామతిపేట-గౌరెల్లి బ్రిడ్జీ వద్ద వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది.