ఓ వైపు కరోనా పరిస్థితులు.. కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం నిధుల్లో ఏకపక్షంగా కోత విధించడం.. తెలంగాణకు నిధుల విషయంలో కక్షపూరితంగా వ్యవహరించడం.. పెద్ద నోట్ల రద్దు వంటి కారణాల నేపథ్యంలో రుణమాఫీకి జాప్యం జరిగింది. ఏదేమైనా రైతులను అప్పుల బాధల నుంచి విముక్తి చేయాలని సంకల్పించిన సీఎం కేసీఆర్ ఆర్థిక సంక్షోభ సమయంలోనూ రుణమాఫీ చేపట్టి ఆదుకున్నారు.
ఇచ్చిన హామీ మేరకు రూ.లక్షలోపు పంట రుణాలను మాఫీ చేసి అండగా నిలువడాన్ని ప్రజలు కొనియాడుతున్నారు. రుణమాఫీతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వేలమంది రైతులకు మేలు జరిగింది. వికారాబాద్ జిల్లాలో 71,912 మంది రైతులకు సంబంధించిన రూ.365.17 కోట్లు మాఫీ కాగా, రంగారెడ్డి జిల్లాలో 56,040 మందికి చెందిన రూ.27.76కోట్లను ప్రభుత్వం చెల్లించింది. ఈ నిధులను ఇప్పటికే ఆయా బ్యాంకుల్లో జమ చేయడంతో అన్నదాతలు సంబురాలు చేసుకుంటున్నారు. కేవలం పదిరోజుల్లోనే రుణమాఫీ ప్రక్రియను పూర్తిచేయడంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మొదటి నుంచి రైతుల అభ్యున్నతికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు ఉమ్మడి జిల్లా ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్‌కు జనం జేజేలు పలుకుతున్నారు.
వికారాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ) : ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సెప్టెంబర్ రెండో వారంలోగా రూ.లక్షలోపు పంట రుణాలను మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పిన గడువుకు ముందే రూ.లక్షలోపు పంట రుణాలను మాఫీ చేసి మరోసారి రైతు బాంధవుడిగా నిలిచారు. రెండో విడుత రుణమాఫీలో భాగంగా తొలుత రూ.25 వేలలోపు రుణాలకు సంబంధించి 10,807 మంది రైతులకు సంబంధించిన రూ.16.24 కోట్ల రుణాలను మాఫీ చేసిన ప్రభుత్వం తదనంతరం రూ.25 వేల నుంచి రూ.36 వేల వరకు గల రుణాలకు సంబంధించి 21,193 మంది రైతులకు సంబంధించిన రూ.78.41 కోట్లను పంట రుణాలు ప్రభుత్వం మాఫీ చేసింది.
అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రైతు ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ తొమ్మిదేండ్ల పాలనలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలుచేసింది. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఇచ్చిన మాట ప్రకారం వ్యవసాయానికి 9 గంటల విద్యుత్తును సరఫరా చేసిన రాష్ట్ర ప్రభుత్వం,..రెండేళ్లలోనే విద్యుత్తు రంగంలో నవశకం మొదలయ్యిందనే విధంగా వ్యవసాయానికి ఉచిత 24 గంటల నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నది. అదేవిధంగా రైతుబంధు, రైతుబీమా పథకాలతోపాటు రూ.లక్ష రుణమాఫీని పూర్తి చేసిన ప్రభుత్వం,.. మరోసారి రూ.లక్ష రుణమాఫీ ప్రక్రియను కూడా పూర్తి చేసి రైతు సంక్షేమ ప్రభుత్వంగా నిలిచింది.
రూ.లక్షలోపు పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. రెండో విడత రుణమాఫీలో భాగంగా విడతల వారీగా పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించినప్పటికీ గతంలో రూ.36 వేల వరకు రుణాలను తీసుకున్న రైతుల రుణాలను మాఫీ చేసిన ప్రభుత్వం.. మిగతా రూ.37 వేల నుండి రూ.99,999ల వరకు గల పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. జిల్లావ్యాప్తంగా రూ.లక్షలోపు పంట రుణాల మాఫీతో జిల్లాలోని 71,912 మంది రైతులకు లబ్ధి చేకూరింది. జిల్లావ్యాప్తంగా రూ.లక్షలోపు పంట రుణాలు తీసుకున్న 71,912 మంది రైతులకు సంబంధించిన రూ.365.17 కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం మరోసారి రూ.లక్షలోపు పంట రుణాలను మాఫీ చేశారు. రైతాంగం పంట రుణాలు తీసుకున్న ఆయా బ్యాంకుల్లో ప్రభుత్వం రుణమాఫీ డబ్బులను ఈ మేరకు జమ చేసింది. నవంబర్ రెండో వారం లోపు మొత్తం రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఇంకా నెల రోజుల సమయం ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం మెజార్టీ రైతుల రుణాలను మాఫీ చేసి సీఎం కేసీఆర్ సంచలనం సృష్టించారు. రుణమాఫీ ప్రక్రియ పూర్తి కావడంతో జిల్లాలో రూ.లక్షలోపు పంట రుణాలు తీసుకున్న రైతులు సంబురాలు నిర్వహిస్తున్నారు.
రుణ మాఫీ.. రైతన్న హ్యాపీ
రంగారెడ్డి, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ) : రైతు రుణమాఫీ పథకంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాలో రూ.లక్షలోపు అప్పులన్నింటికీ చెల్లింపులను పూర్తి చేసింది. దీంతో జిల్లాలో 56,040 మంది రైతులకు సంబంధించిన రూ.275.76కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి. స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా రుణమాఫీ నిధుల విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకుని అమలు చేయడంతో పది రోజుల వ్యవధిలోనే రూ.99,999 వరకు ఉన్న రైతుల బాకీ మొత్తం చుక్తా అయ్యింది. రైతులకు ఇచ్చిన హామీని, ఎన్నికల నాటి హామీని సీఎం నిలబెట్టుకున్నారంటూ జిల్లా రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నది.
రెండు పర్యాయాలు రుణ మాఫీ
2014లో అధికారంలోకి వచ్చిన సందర్భంగా సీఎం కేసీఆర్ తొలి పర్యాయంగా రుణమాఫీని అమలు చేశారు. రెండో పర్యాయంగా రూ.లక్ష లోపు పంట రుణాలు మాఫీ చేస్తామని 2018 ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు వెంటనే రుణ మాఫీ ప్రక్రియను మొదలుపెట్టి 2021లో మొదటి విడుతలో ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాలో రూ.25వేల లోపు ఉన్న 9,299 మంది రైతులకు సంబంధించిన రూ.14.41కోట్లను బ్యాంకులకు చెల్లించింది. మలి విడుతలో రూ.50వేల లోపు రుణాలు తీసుకున్న 12,400 మంది రైతులకు సంబంధించిన రూ.42.09కోట్లను మాఫీ చేసింది. ఈ నెల 2న రూ.లక్ష వరకు రుణాలను మాఫీ చేయాలని సంకల్పించిన సీఎం కేసీఆర్ అందుకనుగుణంగా నిధులను విడుదల చేశారు. ఈ మేరకు గత పది రోజుల వ్యవధిలోనే రూ.99,999లోపు రుణాలు తీసుకున్న 34,341 మందికి సంబంధించిన రూ.219కోట్లను మాఫీ చేసింది. మొత్తంగా లక్ష లోపు రుణాలు తీసుకున్న 56,040 మంది రైతులకు సంబంధించిన రూ.275.76కోట్ల రుణాలు చుక్తా అయ్యాయి.
ఆర్థిక సంక్షోభంలోనూ..
ఎన్నికల నాటి హామీని వెంటనే అమలు చేయాలని ప్రభుత్వం భావించినప్పటికీ రైతు రుణమాఫీకి ఎన్నో ప్రతి బంధకాలు ఏర్పడ్డాయి. ఓ వైపు కరోనా పరిస్థితులు.. కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం నిధుల్లో ఏకపక్షంగా కోత విధించడం, తెలంగాణకు నిధుల విషయంలో కక్షపూరితంగా వ్యవహరించడం, పెద్ద నోట్ల రద్దు వంటి కారణాల నేపథ్యంలో రుణమాఫీకి జాప్యం ఏర్పడింది. అయితే రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులను అప్పుల బాధల నుంచి విముక్తి చేయాలని సంకల్పించిన సీఎం కేసీఆర్ ఆర్థిక సంక్షోభ సమయంలోనూ రుణమాఫీ ప్రక్రియకు శ్రీకారం చుట్టి మరోసారి మానవీయ పాలనను ప్రతిబింబింపజేశారు.
రైతుల్లో సర్వత్రా హర్షాతిరేకాలు
సీఎం కేసీఆర్ రైతులకు ఇచ్చిన హామీ మేరకు రూ.లక్ష లోపు రుణాలను మాఫీ చేయడంపై రంగారెడ్డి జిల్లా రైతాంగం సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నది. రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్, సాగు నీరు వంటి పథకాలను చిత్తశుద్దితో నిరాటంకంగా కొనసాగిస్తున్నారని రైతులు కొనియాడుతున్నారు. రైతు పక్షపాతిగా దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రైతుబాంధవుడిగా నిలిచారని వేనోళ్ల పొగుడుతున్నారు. ప్రపంచంలో రైతులను పట్టించుకునే నాథుడు ఉన్నాడంటే అది సీఎం కేసీఆర్ మాత్రమేనని రైతాంగం పేర్కొంటున్నది. సీఎం కేసీఆర్‌ను గుండెల్లో పెట్టుకుంటామని ముక్తకంఠంతో అభిమానాన్ని చాటుకుంటున్నది.
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి
– ఎల్గని ఎట్టయ్యగౌడ్, సురంగల్, మొయినాబాద్ మండలం
సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి. రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నాడు. గతంలో పంటల సాగు కోసం స్టేట్ బ్యాంక్‌లో లోన్ తీసుకున్నాను. వడ్డీతో కలిసి రూ.85 వేల వరకు అయ్యింది. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం నాకు మాఫీ చేసింది. సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. ఎందుకంటే కేసీఆర్ రైతులకు అన్ని రకాలుగా మేలు చేస్తున్నాడు. ప్రభుత్వం చేస్తున్న మేలు రైతులెవరూ మరిచిపోరు. రైతు బంధు, రైతు బీమాతో రైతుల కుటుంబాన్ని ఆదుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా రైతులు బీఆర్ఎస్కు అండగా ఉంటారు.
రుణ మాఫీ చేసి రైతు బాంధవుడయ్యారు
– మాలె కృష్ణయ్యగౌడ్, రైతు, కులకచర్ల
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ ప్రకటించి సీఎం కేసీఆర్ రైతుల పాలిట బాంధవుయ్యాడు. లక్ష రూపాయల వరకు వ్యవసాయ రుణాలన్నింటినీ మాఫీ చేస్తానని చెప్పిన సీఎం చేసి చూపించాడు. దీంతో చాలా మంది రైతులకు మేలు జరిగింది. నేను లక్షలోపు రుణం తీసుకున్నాను. తీసుకున్న రుణం మాఫీ అయ్యింది. వ్యవసాయదారులపై సీఎం కేసీఆర్ తీసుకుంటున్న శ్రద్దకు ఆయనకు రైతులమంతా రుణపడి ఉంటాం. మంచి సుపరిపాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్ ఎప్పుడూ సీఎంగా ఉంటే రైతులకు ఎంతో మేలు జరుగుతుంది.
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు
– హరిప్రసాద్‌గౌడ్, ఇబ్రహీంపట్నంరూరల్
రైతులను గతంలో ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకోలేదు. కాని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా కృషిచేస్తున్నారు. రైతుల కోసం రైతు బంధు, రైతు బీమాతో పాటు పంటల బీమా అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. రైతు రుణ మాఫీ లక్ష వరకు చేసి చరిత్రలో నిలిచిన గొప్ప నాయకుడు. మాలాంటి ఎంతోమంది రైతులకు ధీమాగా నిలుస్తున్న ముఖ్యమంత్రికి జీవితాంతం రుణపడి ఉంటాం.
Cm Kcr
రైతుల పక్షపాతి సీఎం కేసీఆర్
– గంగిడి భూపాల్‌రెడ్డి, రైతు సంఘం నాయకుడు, షాబాద్
రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేయడం సంతోషకరం. 24గంటల విద్యుత్, రైతు బంధు, రైతు బీమా పథకాలతో అన్నదాతలకు వ్యవసాయంపై మరింత నమ్మకం పెరిగింది. ఎరువులు, విత్తనాల కొరత లేకుండా ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఎంతో బాగున్నాయి. రూ.లక్ష లోపు రైతుల బ్యాంకుల రుణాలన్నీ ఒకేసారి మాఫీ చేయడం సంతోషకరమైన విషయం. గత ప్రభుత్వాలు రైతులకు ఎన్నో హామీలు ఇచ్చి అమలుకు నోచుకోకపోవడంతో అన్నదాతలు ఇబ్బందులు పడాల్సి వచ్చేది. రైతుబిడ్డగా సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ ప్రకటించి రైతులకు అండగా నిలువడం హర్షణీయం.
రైతులకు రుణ మాఫీ చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దే..
– ఎంబడి చెన్నయ్య, అంతిరెడ్డిగూడ, నందిగామ మండలం
గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా రైతులను పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంట్, పంటలకు మద్దతు ధర కల్పించి కొనుగోలు చేస్తున్నారు. దీంతోపాటు రైతులకు రుణ మాఫీ చేశారు. రైతుల కోసం ఇన్ని పథకాలు అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దే..
రైతుపై కేసీఆర్ ప్రేమకు నిదర్శనం
– జంతుక అల్లాజీ, యువ రైతు, జంగారెడ్డిపల్లి
రుణమాఫీ అమలుకావడం కేసీఆర్‌కు రైతుపై ఉన్న ప్రేమకు నిదర్శనం. సీఎం రైతులకు రూ.లక్ష రుణ మాఫీ చేసి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న ప్రతిపక్ష పార్టీలకు చెంపపెట్టులాంటిది. సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హమీని నిలబెట్టుకుని రైతు కుటుంబాల్లో వెలుగులు నింపారు. ఇవే కాకుండా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు, పెట్టుబడి సాయం, రైతు బీమా, పంటలకు మద్దతు ధర, ఇన్ని చేస్తున్న సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం.
రైతు రుణ మాఫీతో ఎంతో ధీమా
– కాయితి మోహన్‌రెడ్డి, రైతు ఇబ్రహీంపట్నం
రైతు రుణ మాఫీతో ఎంతో ధీమాగా ఉంది. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతులకు 1లక్ష వరకు రుణమాఫీ చేసిన గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్. రైతుల కోసం ఆది నుంచి పెద్దపీట వేస్తున్న కేసీఆర్.. రుణమాఫీ ప్రకటించడం ఎంతో సంతోషకరం. మాలాంటి ఎంతోమంది రైతులకు రుణ మాఫీ చేయడం ఎంతో ధీమాగా ఉంది. సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.
రూ.85 వేల రుణం మాఫీ అయ్యింది..
– రాములు, దేవునిఎర్రవల్లి, చేవెళ్ల మండలం
గతంలో ఏ ప్రభుత్వాలూ రైతుల పక్షాన నిలబడిన దాఖలాలు లేవు. తెలంగాణ ప్రభుత్వం పెద్దమనసుతో రైతుల రుణాలు మాఫీ చేసేందుకు నిర్ణయం తీసుకోవడం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే అంశంగా చెప్పొచ్చు. నాకు రూ.85 వేల బ్యాంకు రుణం మాఫీ అయ్యింది. చాలా సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ రైతుల పక్షాన నిలిచి అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు. ఆయనకు యావత్ తెలంగాణ రైతాంగం రుణపడి ఉంటుంది.
రుణమాఫీ చేయడం సంతోషంగా ఉంది
– నర్సింహులు, దేవరంపల్లి, చేవెళ్ల మండలం
తెలంగాణ ప్రభుత్వం రైతులకు రుణ మాఫీ చేయడం సంతోషంగా ఉంది. రైతుల కష్టాలు తెలిసిన నాయకుడు కేసీఆర్. ఏకకాలంలో రూ.లక్ష రుణ మాఫీ చేయడం మా అదృష్టం. దీంతోపాటు అన్ని విధాలుగా రైతులకు అండగా ఉన్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలంగాణ ప్రభుత్వమే. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రైతులందరం రుణపడి ఉంటాం.
రైతు రుణ మాఫీతో రైతన్నలకు చేయూత
– బక్కప్రభు, దేవనూర్, యాలాల మండలం
రైతు రుణ మాఫీతో రైతన్నలకు చేయూత అందనుంది. సీఎం కేసీఆర్ రుణ మాఫీ ప్రకటనతో అన్నదాతల సంబురాలు మిన్నంటాయి. గ్రామగ్రామాన రైతులు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు నిర్వహించారు. కేసీఆర్ రైతు పక్షపాతిగా నిలిచారు. రైతుల సంక్షేమం కోసం రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంటు అందిస్తూ రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగగా మార్చారు. రాబోయే ఎన్నికల్లో సీఎంగా కేసీఆర్‌ను గెలిపించి హ్యాట్రిక్ సీఎంగా చూడబోతున్నాం.
సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం
– సిద్ధిగారి చెన్నయ్య, కడ్తాల్
రైతుల కష్టాలు తెలిసిన నాయకుడు తెలంగాణ రాష్ర్టానికి సీఎంగా ఉండటం మనందరి అదృష్టం. బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న 24 గంటల ఉచిత కరెంట్, రైతు బంధు, రైతు బీమా పథకాలతో ఆనందంగా వ్యవసాయం చేసుకుంటున్నాం. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేసిండు. ఇది వరకు వ్యవసాయం చేయడం చాలా కష్టమయ్యేది. ఎప్పుడు కరెంట్ వచ్చేదో, పోయేదో తెలియకుండా ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయం చేసుకుంటున్నాం. పంట రుణమాఫీ చేసిన సీఎం కేసీఆర్ గొప్ప నాయకుడు.
దేశంలోనే రుణమాఫీని చేసిన ఏకైక రాష్ట్రం మన తెలంగాణ
– నర్సింహులు, కోకట్, యాలాల మండలం
దేశంలోనే రుణమాఫీని చేసిన ఏకైక రాష్ట్రంగా మన తెలంగాణ నిలిచింది. వ్యవసాయం దండుగ కాదు పండుగ అని సీఎం కేసీఆర్ మరోసారి నిరూపించారు. రుణమాఫీతో మాకు మరింత విశ్వాసం పెరిగింది. ఈ నిర్ణయం మా జీవన స్థితిగతులను మార్చనుంది. జీవనోపాధి రుణమాఫీతో మెరుగుపడనుంది. తెలంగాణ రైతులకు ఇది శుభవార్త. రైతులు ఎదుర్కొంటున్న ఆర్థ్థిక ఒత్తిడిని తగ్గించడానికి రుణమాఫీ ఎంతో ఉపయోగపడుతుంది. ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని అమలు చేయడం ఒక్కకేసీఆర్కు మాత్రమే సాధ్యం.
స్వాతంత్య్ర దినోత్సవ వేళ రైతులందరికి శుభవార్త
– బోయిని శ్రీశైలం, కోకట్, యాలాల మండలం
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నిలబెట్టుకుంది. కరోనా మహమ్మారి విజృంభణ, లాక్డౌన్లతో ఆర్థిక ఇబ్బందులు, పెద్దనోట్ల రద్దు ప్రభావంతో రుణమాఫీ కొంత ఆలస్యమైంది. ఎంత ఆలస్యమైనా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో కేసీఆర్ సారుకు కేసీఆర్ సారే సాటి. తెలంగాణ ప్రభుత్వం తీసుకొన్న రుణమాఫీ నిర్ణయం దేశవ్యాప్తంగా ఓ సంచలనం. రాష్ట్రంలో రైతు రాజ్యం ఉందనడానికి ఈ ఒక్కటీ చాలు. వ్యవసాయ రుణాలతో భారం పడుతున్న రైతులకు ఆర్థిక ఉపశమనం కల్పించడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ మా కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి
– మధు, శంకర్పల్లి
తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష లోపు రుణమాఫీ చేయడం గొప్ప విషయం. సీఎం కేసీఆర్ రైతులకు అండగా నిలుస్తూ రైతు బాంధవుడయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయి. రైతు బంధు, రైతు బీమా అందిస్తుండు. కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రిని, నాయకుడిని ఇప్పటివరకు చూడలేదు. రైతుల కోసం నిరంతరం శ్రమించే శ్రామికుడు కేసీఆర్. రుణమాఫీ చేసినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు.