హైదరాబాద్-నాగార్జునసాగర్ ప్రధాన రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. ఈ రహదారి క్రమక్రమంగా మృత్యుమార్గంగా మారిపోతున్నది. ఒకవైపు నాగార్జునసాగర్ రహదారిపై ఇబ్రహీంపట్నం నుంచి మాల్ వరకు అతి ప్రమాదకరమైన మూల మలుపులు ఉండటం, మరోవైపు మలుపుల వద్ద రోడ్లు, భవనాల శాఖ అధికారులు సరైన ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో ప్రమాదాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నది. సాగర్ రహదారిపై ప్రయాణం అంటేనే ద్విచక్రవాహనదారులు భయపడిపోవాల్సిన దుస్థితి నెలకొన్నది. ఈ రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు ఎప్పుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు.
యాచారం, అక్టోబర్ 26
ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలో సాగర్ రహదారి సుమారు 37 కిలోమీటర్ల పొడవునా ఉన్నది. బొంగ్లూరు ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం పోలీస్స్టేషన్ల పరిధిలోకి వస్తుంది. మూల మలుపులు అతి ప్రమాదకరంగా ఉండటంతో గున్గల్గేటు, నక్కగుట్టతండా, చింతపట్లగేటు, తక్కళ్లపల్లిగేటు, తమ్మలోనిగూడగేటు, మాల్ మైసమ్మ టెంపుల్ ప్రాంతాలు ప్రమాదాలకు నిలయంగా మారాయి. అతివేగం, మద్యం సేవించడం, రాత్రిపూట నిద్రమత్తు, అజాగ్రత్తగా నడపడంతోనే ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. రోజురోజుకూ రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నప్పటికీ ఆర్టీఏ, పోలీసులు, ఆర్అండ్బీ, ట్రాఫిక్ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో అనేక మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇటీవలే తమ్మలోనిగూడ గేటు వద్ద బైకును ట్రాక్టర్ ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు దుర్మరణం చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.
ప్రమాదమని తెలిసినా..
తక్కళ్లపల్లి, తమ్మలోనిగూడ గేట్ల వద్ద ఉన్న మూలమలుపు అత్యంత ప్రమాదకరంగా ఉన్నది. ఈ మూలమలుపు వద్ద ఇప్పటివరకు సుమారు వందకుపైగా ప్రమాదాలు జరిగాయి. కొన్ని నెలల క్రితం తమ్మలోనిగూడ గేటు వద్ద కారు చెట్టుకు ఢీకొని ఒకరు మృతిచెందగా, రెండు లారీలు ఢీకొని ఇద్దరు ప్రాణాలు విడిచారు. తక్కళ్లపల్లి గేటు వద్ద తండ్రీకొడుకులు మృతిచెందగా, పోలీస్‌స్టేషన్ వద్ద ఒకరు దుర్మరణంపాలయ్యారు. మాల్ మైసమ్మ టెంపుల్ వద్ద ఒకరు మృతిచెందగా, చింతపట్ల గేటు వద్ద ఇరువురు తీవ్రగాయాలపాలయ్యారు. ప్రమాదకర మలుపుల వద్ద వారానికొకటి చొప్పున ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ ఆర్అండ్బీ అధికారులు ఎలాంటి ప్రమాద సూచిక బోర్డులను ఏర్పాటు చేయడంలేదు. గున్గల్గేటు సమీపంలో కూడా తరచుగా ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలేదని ప్రజలు వాపోతున్నారు.
విస్మరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
సాగర్ రహదారిపై రోజురోజుకూ వాహనాల సంఖ్య పెరిగిపోతున్నది. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల బస్సులు, లారీలు, ఆటోలు, క్రూయిజర్లు, ప్రైవేటు వాహనాలు, ద్విచక్ర వాహనాలు పెద్దఎత్తున రాకపోకలు సాగిస్తున్నాయి. మాల్ నుంచి కాగజ్‌ఘాట్ వరకు డబుల్ రోడ్డుండటం వలన ప్రమాదాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నది. దీన్ని దృష్టిలో ఉంచుకుని సాగర్ రహదారి విస్తరణ పనులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళికలను రచించింది. కానీ కాంగ్రెస్ సర్కారు సాగర్ రహదారి విస్తరణ పనులను విస్మరించింది. కాగజ్‌ఘాట్ నుంచి మాల్ వరకు ఫోర్ లేన్ రోడ్డుగా మార్చి, డివైడర్లను నిర్మిస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలుండవని పలువురు భావిస్తున్నారు.
సాగర్ రహదారిపై ఘోర ప్రమాదాలివే…
తమ్మలోనిగూడెంగేటు వద్ద లారీని ఆల్టో కారు ఎదురుగా ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగు అక్కడికక్కడే చనిపోయారు.
యాచారంలో తండ్రీకొడుకులు చనిపోయారు. పోలీస్‌స్టేషన్ సమీపంలో ఇద్దరు యువకులు అసువులుబాసారు. ఇటీవలే రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు.
నాగార్జునసాగర్-హైదరాబాద్ ప్రధాన రహదారిపై జరిగిన గత మూడేండ్లలోనే 270 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ ప్రమాదాల్లో 338 మందికి పైగా ప్రయాణికులు గాయాలపాలయ్యారు. 2023లో 72 మంది మృతిచెందగా, 50 మందికి పైగా గాయపడ్డారు. 2024లో 130 మంది దుర్మరణం చెందగా 150 మంది గాయపడ్డారు. 2025లో ఇప్పటివరకు 68 మంది మృతిచెందగా 138 మందికి గాయాలయ్యాయి.
రోడ్డు ప్రమాదాలను అరికట్టాలి
సాగర్ రహదారిపై తరచూ కొనసాగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ద వహించాలి. మంచాల మండల పరిధి కాగజ్‌ఘాట్ నుంచి మాల్ వరకు సాగర్ రోడ్డును నాలుగు లేన్ల రోడ్డుగా మార్చాలి. రోడ్డుపై తగిన సూచిక బోర్డులు, ములుపుల వద్ద బారికేడ్లను ఏర్పాటు చేయాలి. ప్రైవేటు వాహననాల వేగంపై సంబంధిత పోలీసు, ట్రాఫిక్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. ప్రమాదాల నివారణకు పోలీసులు, ఆర్అండ్బీ, ఆర్టీఏ, ట్రాఫిక్ అధికారులు కృషి చేయాలి.
– రాజూనాయక్, మాజీ సర్పంచ్, నందివనపర్తి
ప్రమాదాల నివారణకు కృషి
నాగార్జున సాగర్ రహదారిపై రోడ్డు ప్రమాదాలు జరుగకుండా ప్రత్యేక దృష్టి సారించాం. వాహనాల తనిఖీలు ముమ్మరం చేస్తున్నాం. యాచారం, మాల్ ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. ఓవర్ స్పీడ్, రాష్ డ్రైవింగ్‌కు పాల్పడుతున్న వాహనదారులపై తగిన చర్యలు తీసుకొని చలానా విధిస్తున్నాం. రాంగ్ రూట్, అక్రమ పార్కింగ్‌లపై కొరడా ఝుళిస్తున్నాం. పీఎస్ పరిధిలో వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ మరింత ముమ్మరం చేస్తాం. పోలీస్, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
– నందీశ్వర్‌రెడ్డి, సీఐ, యాచారం పీఎస్