Chain System Fraud | చేవెళ్ల టౌన్, ఫిబ్రవరి 13: ఎల్ఎఫ్ఎల్ యాప్ ద్వారా అధిక డబ్బులు సంపాదించుకోవచ్చునని ఉన్న డబ్బులను ఓ మహిళ పోగొట్టుకున్న సంఘటన చేవెళ్ల పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. చేవెళ్ల ఎస్ఐ శ్రీకాంత్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం చేవెళ్ల మున్సిపల్ కేంద్రంలోని టీచర్స్ కాలనీలో నివాసి కూతాడి పుష్ఫలత (35)కు ఆమెకి తెలిసిన స్నేహితులు డిసెంబర్లో ఎల్ఎఫ్ఎల్ యాప్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే మనకు రెట్టింపు డబ్బులు వస్తాయని చెప్పారు. ఇది చైన్ సిస్టం బిజినెస్ అని చెప్పడంతోపాటు పుష్ఫలతకు వాట్సాప్ ద్వారా ఎల్ఎఫ్ఎల్ యాప్ లింక్ పంపారు.
గతేడాది డిసెంబర్ ఎనిమిదో తేదీన ఎల్ఎఫ్ఎల్ యాప్‌లో రిజిస్టర్ చేసుకుని పుష్పలత ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించారు. నాటి నుండి గత నెల మూడో తేదీ వరకూ సుమారు రూ.88,623 యాప్ ద్వారా ఇన్వెస్ట్ చేసింది. దీంతో ఆ యాప్ క్లోజ్ చేశారని తెలుసుకుని వెంటనే సైబర్ క్రైమ్ 1930 కాల్ చేసి పిర్యాదు చేశారు. తర్వాత చేవెళ్ల పోలీస్ స్టేషన్లో గురువారం పిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.