రంగారెడ్డి, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ) : నైసర్గిక స్వరూపం రోజురోజుకూ మారుతుండడంతో జిల్లా ఉనికి ప్రశ్నార్థకంగా మారుతున్నది. ఇప్పటికే జిల్లాను వికారాబాద్, మేడ్చల్ జిల్లాలుగా విభజించారు. జిల్లాలోని శివారు ప్రాంతాలన్నింటినీ మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లుగా మార్చడంతోపాటు వాటిని హైదరాబాద్ మహానగర పాలక సంస్థలో కలిపే పనులు చురు గ్గా సాగుతున్నాయి. అలాగే, జిల్లాలో ఉన్న గ్రా మపంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చడంతో ఇప్పటికే జిల్లాలో సగానికి పైగా పంచాయతీలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోకి వె ళ్లాయి. దీంతో జిల్లాలో ఏ ప్రాంతం ఎక్కడ ఉం టుందో..? ఏ మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుందో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడింది.
పెరుగుతున్న పట్టణీకరణ, హైదరాబాద్ మహానగరం రోజురోజుకూ విస్తరిస్తుండడంతో జిల్లా స్వరూపం మారిపోతున్నది. గతంలో జిల్లాను వికారాబాద్, మేడ్చల్ జిల్లాలుగా విభజించారు. ఆ తర్వాత జిల్లాలోని శివారు ప్రాంతాలన్నింటినీ మున్సిపాలిటీలుగా మార్చారు. వాటిని హైదరాబాద్ నగరపాలక సంస్థలో కలపాలని యోచిస్తున్నారు. మారుతున్న సమీకరణలతో జిల్లా నైసర్గిక స్వరూపం వడివడిగా మారిపోతున్నది.
జిల్లాను క్రమంగా హెచ్ఎండీఏ తన ఆధీనంలోకి తీసుకుంటున్నది. గతంలో జిల్లాలో ఉన్న 22 మండలాలు దాని పరిధిలోకి వెళ్లిపోయాయి. ప్రస్తుతం ఉన్న 21 మండలాల్లో ఆరు మండలాలనూ హెచ్ఎండీఏ తన ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నాలు మొదలెట్టింది. రీజినల్ రింగ్‌రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఏర్పాటవుతున్న నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ పరిధిలో ఉన్న అనేక మండలాలను తన పరిధిలోకి తీసుకుంటున్నది. ఇబ్రహీంప ట్నం, అబ్దుల్లాపూర్‌మెట్, హయత్‌నగర్, కందుకూరు, రాజేంద్రనగర్, బాలాపూర్, గండిపేట, చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి, శంషాబాద్, మం చాల, యాచారం, షాద్‌నగర్, పారుఖ్నగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి తదితర మండలాలు హెచ్ఎండీఏ పరిధిలో ఉన్నాయి.
ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాలతో ఉన్న జిల్లా ఇక నుంచి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి వెళ్లనున్నది. జిల్లాలోని అన్ని మండలాలు హెచ్ఎండీఏ పరిధిలోకి వెళ్లనుండడంతో అనుమతులు, ట్యాక్సీలు ఇతరత్రా అన్ని మౌలిక వసతులూ హైదరాబాద్ మె ట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీలోకి రానున్నాయి. భూముల మార్కెట్ విలువ పెరగడంతోపాటు అనుమతుల విలువ కూడా హెచ్ఎండీఏ నుంచే రానున్నాయి. అలాగే, ఆయా మండలా లు హెచ్ఎండీఏ ఆధీనంలోకి వెళ్లనుండడంతో వాటిలో అధికంగా మౌలిక వసతులు సమకూరనున్నాయి.
జిల్లా పరిధిలోని రీజినల్ రింగ్‌రోడ్డు (ఆర్ఆర్ఆర్) లోపల ఉన్న మాడ్గుల, కడ్తాల్, తలకొండపల్లి, కేశంపేట మండలాలను హెచ్ఎండీఏ తన పరిధిలోకి తీసుకోవాలని చూస్తున్నది. ఈ మేరకు ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలను పంపించింది. హెచ్ఎండీఏ నిర్ణయంతో ఇక నుంచి జిల్లాలోని అన్ని మండలాలు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి రానున్నాయి.