పెద్దేముల్, డిసెంబర్ 29: తెలంగాణ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ ఆరోగ్య పరంగా అమలు చేస్తున్న వివిధ రకాల పథకాలతో పాటు నూతనంగా గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లను ఉచితంగా పంపిణీ చేసి తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడడానికి నిర్ణయం తీసుకొని ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారు. ముఖ్యంగా మాతాశిశువుల సంరక్షణకు తెలంగాణ సర్కార్ ప్రాధాన్యమిస్తూ ఆ దిశగా చర్యలు చేపడుతున్నది. తల్లి ఆరోగ్యంగా ఉంటేనే పుట్టబోయే బిడ్డ బాగుంటుంది. ప్రభుత్వం గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ న్యూట్రిషన్ కిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా గర్భిణుల్లో రక్తహీనతకు చెక్ పెట్టేందుకు, పోషకాహార లోపాన్ని అరికట్టేందుకు సుమారు 5 రకాల ఆహార పదార్థాలతో కూడిన న్యూట్రిషన్ కిట్లను ఆయా గ్రామాల్లోని గర్భిణులకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తూ తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నది. మరోవైపు తెలంగాణలో సీఎం కేసీఆర్ మహిళా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ ఇప్పటికే ఆరోగ్యలక్ష్మి, కేసీఆర్ కిట్, ఆడపిల్ల జన్మిస్తే రూ.13 వేల రూపాయలు, మగబిడ్డ జన్మిస్తే రూ.12వేలు అందిస్తున్న విషయం తెలిసిందే.
కిట్‌లో 5 రకాల ఆహార పదార్థాలు
ప్రభుత్వం గర్భిణులకు అందజేస్తున్న నూట్రిషన్ కిట్లలో మొత్తం సుమారు 5 రకాల ఆహార పదార్థాలు ఉంటాయి. అందులో ప్రధానంగా 1. న్యూట్రి మిక్స్ పౌడర్(మదర్స్ హార్లిక్స్ పౌడర్) 2.ఐరన్ సిరప్లు 3. ఖర్జూరాలు 4.నెయ్యి 5. ఆల్బండజోల్ మాత్ర 6. కొలతల కప్పు వంటి మొత్తం 5 ఆహార పదార్థాలు, ఒక కప్పు ఉంటాయి. వీటన్నింటినీ కలిపి ఒక బుట్టలో భద్రపరచి ప్రభుత్వం అందిస్తున్నది. ముఖ్యంగా గర్భిణులు న్యూట్రి మిక్స్ పౌడర్‌ను ప్రతి రోజూ పాలతో కానీ, నీళ్లతో కానీ రెండు సార్లు తీసుకోవాలి. ఇలా తీసుకోవడంతో గర్భిణుల్లో అవసరమైన శక్తి, ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు అందుతాయి. అలాగే ప్రతి రోజూ ఐరన్, ఫోలిక్ యాసిడ్ సిరప్ తీసుకోవడంతో గర్భిణుల్లో రక్తహీనతను అదుపు చేయడమే కాకుండా ప్రసవ సమయంలో వచ్చే క్లిష్ట సమస్యలను తక్కువ బరువుతో ఉండే జననాలను తగ్గించుకోవచ్చు. ఖర్జూరం విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటుంది. నెయ్యిలో ఎక్కువ మొత్తంలో మంచి ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఎ, ఈ, డీ ఉంటాయి. అవి తల్లి గర్భంలో ఉన్న బిడ్డకి పోషణనివ్వడమే కాకుండా చక్కటి అవసరమైన శక్తిని ఇస్తుంది. ఆల్బండజోల్ మాత్రను రెండో త్రైమాసికంలో గర్భిణులు వేసుకోవాలి. దీంతో నులిపురుగులను నివారించి రక్తహీనత అరికట్టేందుకు ఉపయోగపడుతుంది. నూట్రి మిక్స్ పౌడర్ (మదర్స్ హార్లిక్స్ పౌడర్)ను ప్రతి రోజూ రెండు సార్లు తాగడానికి అనుగుణంగా ఉండేందుకు కొలతల కోసం కప్పును ఉపయోగించాలి.
మండలంలో 120 న్యూట్రిషన్ కిట్ల పంపిణీ
ప్రభుత్వం గర్భిణులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నది. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ నూతన పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 21న తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్లో సహచర మంత్రులతో కలిసి మొట్టమొదటిసారిగా ప్రారంభించారు. ఎనీమియా ఎక్కువగా ఉన్న సుమారు 9 జిల్లాల్లో మొదటిసారిగా ప్రారంభించారు. అందులో భాగంగా వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సుమారు 120 న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేశారు. ఈ కిట్లను స్థానిక వైద్య సిబ్బంది నియమ నిబంధనల ప్రకారం.. 5 నెలల గర్భిణులుగా ఉండి రెండు సార్లు వైద్య పరీక్షను పూర్తి చేసుకున్నవారికి ఫస్ట్ కిట్లను స్థానిక పీహెచ్సీలో, ఏడు నెలల్లో ఉన్న గర్భిణులకు జిల్లా దవాఖానలో, వైద్య పరీక్ష చేయించుకొన్నవారికి సెకండ్ కిట్లను జిల్లా దవాఖానలో పంపిణీ చేస్తారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వంలో తల్లికి పౌష్టికాహారం శిశువుకు ఆరోగ్యాన్ని అందించాలని పుట్టబోయే బిడ్డ కోసం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, పుట్టిన బిడ్డ కోసం కేసీఆర్ కిట్‌ను అందిస్తూ మహిళా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నారు.
కిట్లను ఇవ్వడం సంతోషకరం..
ప్రభుత్వం గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించి, మా గురించి, మా ఆరోగ్యం గురించి ఉచితంగా న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉంది. వైద్యుల సలహాల మేరకు ప్రతి రోజూ ఆహార పదార్థాలను తీసుకోవడంతో మా ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకం ఉంది.
– స్నేహ, గర్భిణి, బుద్దారం
సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం
సీఎం కేసీఆర్ తల్లీబిడ్డల సంపూర్ణ ఆరోగ్యానికి పోషకాహారం తప్పనిసరి అని భావించి, గర్భిణుల సమస్యలను గుర్తించి న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేయడం అభినందనీయం. గర్భిణులు ప్రతి ఒక్కరూ సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటారు.
– పసుల శశికళ, గర్భిణి, హన్మాపూర్
సమస్యలు రావు..
గర్భిణుల్లో ఎక్కువ మొత్తంలో రక్తహీనత, పోషకాహార లోప సమస్యలు విరివిగా ఉంటాయి. గర్భిణుల సమస్యలను గుర్తించి ప్రభుత్వం మాతా శిశువు సంరక్షణ కోసం అందిస్తున్న నూట్రిషన్ కిట్లలోని ఆహార పదార్థాలను తీసుకోవడంతో సమస్యలను అధిగమించవచ్చు. కిట్లను పంపిణీ చేసినందుకు ప్రభుత్వానికి, వైద్య సిబ్బందికి, ప్రజాప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు.
– అశ్విని, గర్భిణి, మారేపల్లి
క్రమం తప్పకుండా తీసుకోవాలి ..
న్యూట్రిషన్ కిట్లను తీసుకొన్న గర్భిణులు ప్రతి రోజూ వైద్యులు సూచించిన విధంగా ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవాలి. ముఖ్యంగా కిట్‌లో ఉండే న్యూట్రి మిక్స్ పౌడర్(మధర్స్ హార్లిక్స్ పౌడర్), ఐరన్ సిరప్లు, ఖర్జూరాలు, నెయ్యిలను తీసుకోవడం వలన రక్తహీనత తగ్గి, పోషకాహార లోపంతో బాధపడే వారికి మేలు జరుగుతుంది. దీంతో ప్రసవ సమయంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించాలి.
– అరుణకుమారి, పీహెచ్ఎన్,పెద్దేముల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం