ఇబ్రహీంపట్నం రూరల్, జూన్ 10 : పుట్టిన ఊరు రుణం తీర్చుకోవాలన్న సంకల్పంతోపాటు గ్రామంలోని ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చి అందరికీ ఆదర్శంగా నిలిచారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)అధ్యక్షుడిగా ఉన్న అరిషణపల్లి జగన్మోహన్రావు. ఆయన మండలంలోని దండుమైలారం గ్రామానికి చెందిన వారు. సొంత నిధులు, రౌండ్‌టేబుల్ ఆర్గనైజేషన్ సహకారంతో ఊరిలోని జడ్పీహెచ్ఎస్లో విద్యార్థులకు మౌలిక వసతులు, అదేవిధంగా ప్రాథమిక పాఠశాల భవనాన్ని రూ.75 లక్షలతో సకల హంగులతో కార్పొరేట్ పాఠశాలకు దీటుగా నిర్మించారు.
దీంతో ఆయన సేవలను గుర్తించిన వందేమాతరం ఫౌండేషన్ సభ్యులు సోమవారం నగరంలోని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు విద్యాదాత పురస్కారాన్ని అందించారు. ఈ అవార్డును ఆయన వందేమాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రవీందర్, మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాశ్‌నారాయణ, సెయింట్ సంస్థ వ్యవస్థాపకుడు మోహన్‌రెడ్డి, విద్యాశాఖ కమిషనర్ దేవసేన, ైప్లెటెక్ ఏవియేషన్ అకాడమీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మమత చేతుల మీదుగా అందుకున్నారు.
ఈ సందర్భంగా జగన్మోహన్రావు మాట్లాడుతూ.. తన సేవలను గుర్తించి వందేమాతరం ఫౌండేషన్ విద్యాదాత పురస్కారాన్ని అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని.. గ్రామంలో ఎలాంటి ఇబ్బందులున్నా సహకరిస్తానని తెలిపారు. జగన్మోహన్రావుకు విద్యాదాత అవార్డు రావడం దండుమైలారం గ్రామానికి ఎంతో గర్వకారణమని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు రవణమోని జంగయ్యముదిరాజ్, సహకారసంఘం చైర్మన్ బిట్ల వెంకట్‌రెడ్డి, పలువురు గ్రామ పెద్దలు అభినందించారు.