న్యూస్‌నెట్‌వర్క్, నమస్తేతెలంగాణ: నూతన సంవత్సరం వేడుకలను ప్రజలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. 2023 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త ఏడాది 2024 కి సాదరంగా స్వాగతం పలికారు. ఇండ్లలోనే కొందరు కేక్‌లు కట్‌చేసి సంబురాలు చేసుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి దాటి కొత్త ఏడాదిలోకి ప్రవేశించిన వెంటనే మిత్రులు, బంధువులకు ఫోన్లలో సందేశాలు పంపుతూ కొత్త ఏడాది శుభా కాంక్షలు తెలుపుకున్నారు.
సోమవారం ఉదయం కొందరు దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. నూతన సంవత్సరంలో మంచి జరగాలని దేవుణ్ని ప్రార్థించారు. ఇండ్ల ముందు కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ ముగ్గులు వేశారు. కొత్త ఏడాది వేడుకల సందర్భంగా ఆదివారం రాత్రి వరకు బేకరి షాపులు, కిచెన్ సెంటర్లు, మఠన్ దుకాణాలు రద్దీగా కనిపించాయి. కొడంగల్‌లో మహాలక్ష్మివేంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. బొంరాస్‌పేట పోలీస్ స్టేషన్లో ఎస్సై శంకర్ సిబ్బందితో ఆది వారం రాత్రి కేక్ కట్ చేసి కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. కులకచర్ల మండల పరిధిలోని బండవెల్కిచర్ల పాంబండ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. నూతన వాహనాలు తీసుకొని దేవాలయాల దగ్గర పూజలు చేయించారు.