రంగారెడ్డి, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో అప్గ్రేడ్ అయిన దవాఖానల్లోనూ సరైన వసతులు అందక రోగులు ఆపసోపాలు పడుతున్నారు. ఏరియాలు పెరుగుతుండడంతో ఆయా ఆస్పత్రులను పది పడకల నుంచి యాభై పడకలకు పెంచి పేదలకు మెరుగైన వైద్యంతోపాటు కాన్పులు, కుటుంబనియంత్రణ ఆపరేషన్లు చేయాల్సి ఉంటుంది. కాగా, జిల్లాలో ఐదు ఆస్పత్రులు అప్గ్రేడ్ కాగా.. అందులో సరిపడా డాక్టర్లు, వైద్య పరికరాలు, సిబ్బంది మాత్రం ఇప్పటికీ సమకూర్చలేదు.
గత కేసీఆర్ ప్రభుత్వం ఐదు దవాఖానలను అప్గ్రేడ్ చేసి సిబ్బందిని, వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకునేలోపే.. అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగా.. అప్గ్రేడ్ అయిన ఆస్పత్రులపై ఎలాంటి శ్రద్ధ చూపకపోవడంతో సామాన్యులతోపాటు డెలివరీలకు వెళ్తున్న మహిళలకు డాక్టర్లు లేక స్టాఫ్ నర్సులే సాధారణ కాన్పులు చేస్తున్నారు. అలాగే, గతంలో డీపీఎల్ క్యాంపుల ద్వారా కుటుం బ నియంత్రణ ఆపరేషన్లు చేసే వారు. కొంతకాలంగా ఆ క్యాంపులను నిర్వహించకపోవడంతో పేదలు ప్రైవేట్ దవాఖానలను ఆశ్రయించాల్సి దుస్థితి నెలకొన్నది.
జిల్లాలో అప్గ్రేడ్ అయిన ఆస్పత్రులు
గత బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాలోని ఆమనగల్లు, హయత్నగర్, శంషాబాద్, ఇబ్రహీంపట్నం, యాచారం ఆస్పత్రులను అప్గ్రేడ్ చేసింది. ఈ ప్రాంతాలు రోజురోజుకూ విస్తరిస్తున్నాయి. పెరుగుతున్న రోగులకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు వాటి బెడ్ల సామర్థ్యాన్ని కూడా పెంచింది. గైనకాలజిస్టు, మత్తు, జనరల్ ఫిజీషియన్, ఆర్థోపెడిక్, రేడియాలజిస్టు, చెవి, ముక్కు, కంటి వంటి వ్యాధులకు సంబంధించిన వైద్యులు, ఇతర సిబ్బందిని నియమించాల్సి ఉండగా.. అప్పుడే అసెంబ్లీ ఎన్నికలొచ్చి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగా.. ఇప్పటివరకు ఏ ఒక్క డాక్టర్, సిబ్బందిని కూడా నియమించలేదు.
ఈ ఆస్పత్రులపైనా ఆజమాయిషీ కూడా కరువైంది. గతంలో ఈ దవాఖానలు డీఎంహెచ్వో ఆధీనంలో ఉండగా.. వైద్యసేవలు బాగా అందడం.. ఔట్ పేషెంట్లతోపాటు కాన్పులు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు బాగా జరగడంతో వాటిని వైద్యవిధాన పరిషత్లోకి మార్చారు. అక్కడికెళ్లిన తర్వాత ఈ ఆస్పత్రులపై పర్యవేక్షణ కొరవడింది. ఇటీవల వైద్యారోగ్యశాఖ మంత్రి ఇబ్రహీంపట్నం ఆస్పత్రిని సందర్శించి రోగులకు అందుతున్న వైద్యసేవలు, ఆస్పత్రికి కావల్సిన వసతులను పరిశీలించాల్సి ఉండగా.. ఈ కార్యక్రమం అనుకోని కారణాలతో వాయిదా పడింది. ప్రభుత్వం స్పందించి ఐదు దవాఖానల్లో సరిపడా సిబ్బందిని భర్తీ చేసి, వసతులు కల్పించాలని జిల్లావాసులు కోరుతున్నారు.
గైనకాలజిస్టులు లేక.. తగ్గిన కాన్పులు
గత బీఆర్ఎస్ హయాంలో అమ్మఒడి పథకం కింద గర్భిణులకు పౌష్టికాహారం, బాలింతలకు కేసీఆర్ కిట్లు పంపిణీ చేశారు. అలాగే, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ కాన్పులను పెంచేందుకు స్త్రీల వైద్య నిపుణులు అందుబాటులో ఉండేవారు. సాధారణ డెలివరీలతోపాటు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కూడా పెద్దఎత్తున జరిగేవి. అలాగే, డీపీఎల్ క్యాంపుల ద్వారా కూడా ఆపరేషన్లు చేసేవారు. కాగా, ఐదు దవాఖానలు డీఎంహెచ్వో పరిధి నుంచి వైద్యవిధాన పరిషత్లో చేరిన తర్వాత సరిపడా వైద్యులు, సిబ్బంది లేక సాధారణ కాన్పులు నెలకు పది కూడా దాటడంలేదు. అలాగే, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు పూర్తిగా నిలిచిపోయాయి. ఎవరైనా కు.ని ఆపరేషన్లు చేయించుకోవాలంటే ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొన్నది.
గైనకాలజిస్టులు లేరు
ఇబ్రహీంపట్నం, యాచారం ప్రభుత్వ ఆస్పత్రుల్లో గైనకాలజిస్టులు లేకపోవడంతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయలేకపోతున్నాం. కేవలం సాధారణ కాన్పులే చేస్తున్నాం. ఈ నెలలో ఇప్పటివరకు నాలుగు డెలివరీలు మాత్రమే జరిగాయి. స్త్రీల వైద్య నిపుణులుంటే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లూ చేసేవాళ్లం.
– ప్రియాంక, యాచారం వైద్యురాలు
అప్గ్రేడ్ పేరుతో కాలయాపన
గత కేసీఆర్ ప్రభుత్వం ఐదు ప్రభుత్వ ఆస్పత్రులను అప్గ్రేడ్ చేసి వైద్యవిధాన పరిషత్లోకి చేర్చింది. కాగా, ఆ దవాఖానలను కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవడంలేదు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లతోపాటు కాన్పుల కోసం ఆస్పత్రులకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కోసారి వైద్యులు లేక స్టాఫ్ నర్సులే కాన్పులు చేస్తుండడంతో తల్లీబిడ్డల ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆస్పత్రుల్లో సరైన వైద్యసిబ్బంది, పరికరాలను సమకూర్చాలి.
– చెరుకూరి మంగ, మాజీ ఎంపీటీసీ