గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేలుగా గెలిచి 14 నెలలు పూర్తైనా సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడంతో ఆయా సెగ్మెంట్లలోని వివిధ వర్గాల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని షాద్‌నగర్, చేవెళ్ల, కల్వకుర్తి, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో హామీలను అమలు చేయాలంటూ ప్రజలు ఎక్కడికక్కడే నిలదీస్తున్నారు. హామీలను అమలు చేస్తారనే నమ్మకంతోనే ఓట్లు వేశామని.. తీరా గెలిచిన తర్వాత ముఖం చాటేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
-రంగారెడ్డి, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ)
ఇబ్రహీంపట్నం సెగ్మెంట్లో ఫార్మాసిటీ..
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఫార్మాసిటీ అనుబంధ గ్రామాలైన మేడిపల్లి, కుర్మిద్ద, నానక్‌నగర్, తాటిపర్తి గ్రామాల్లో రైతుల పట్టా భూములను నిషేధిత జాబితాలో నుంచి తొలగించి వారి భూములు వారికే తిరిగి ఇప్పిస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకులు హామీలిచ్చారు. దీంతో ఆయా గ్రామాల్లోని బాధిత రైతులంతా తమ ఓట్లను కాం గ్రెస్ అభ్యర్థికే వేశారు. అయితే ఆ పార్టీ అధికారంలోకి వచ్చి 14 నెలలు దాటినా తమ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించలేదని.. తమకు రైతుభరోసాతోపాటు పొలాలపై బ్యాంకులు రుణా లూ ఇవ్వడంలేదని.. తమ భూములను అమ్ముకోవాలన్నా రిజిస్ట్రేషన్లు కావడంలేదని ఆ నాలుగు గ్రామాల రైతులు ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీని ఏర్పాటు చేసుకుని దాని ఆధ్వర్యంలో ఆందోళన బాట పట్టారు.
ఇటీవల ఆ రైతులు తమ భూములను ప్రభుత్వం తీసుకోవద్దంటూ కోర్టును ఆశ్రయించగా.. రైతుల నుంచి బలవంతంగా భూములను తీసుకోవద్దని ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. కాగా, ఫార్మాసిటీ ఏర్పాటుకు భూములు ఇచ్చేందుకు అభ్యంతరమేమిటో తెలిపేందుకు కలెక్టరేట్‌కు రావాల్సింది ఇటీవల కలెక్టర్ నారాయణరెడ్డి బాధిత రైతులకు నోటీసులు ఇచ్చారు. వాటిని అందుకున్న వందలాది మంది అన్నదాతలు కలెక్టరేట్‌కు తరలిరాగా.. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో వా రు అక్కడే బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ భూములను ఫార్మాసిటీ ఏర్పాటు కోసం తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
చేవెళ్ల సెగ్మెంట్లో 111జీవోపై..
చేవెళ్ల నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో 111 జీవో సమస్య ఎప్పటి నుంచో ఆ ప్రాంత ప్రజలను వెంటాడుతున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ జీవోను ఎత్తివేసినా ఎన్నికల కోడ్ రావడంతో కొంత ఆలస్యమైనది. ప్రస్తుత ఎమ్మెల్యే యాదయ్య 111 జీవో ఎత్తివేతకు చట్టబద్ధత తీసుకొస్తామని హామీ ఇచ్చి.. ఆ తర్వాత దానిని పట్టించుకోవడంలేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ఆందోళనలను తీవ్రతరం చేస్తామని ప్రజలు హెచ్చరిస్తున్నారు.
షాద్‌నగర్‌లో చటాన్‌పల్లి రైల్వే వంతెనపై రైతుల నిరసన
షాద్‌నగర్ నియోజకవర్గంలోని షాద్‌నగర్ పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్లో అతి ముఖ్యమైనది చటాన్‌పల్లి నుంచి షాద్‌నగర్ వరకు వెళ్లే మార్గంలో రైల్వే వంతెన నిర్మాణం.. దీనిని త్వరగా నిర్మించాల న్న డిమాండ్ రోజురోజుకూ పెరుగుతున్నది. బ్రిడ్జి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని.. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే చటాన్‌పల్లి నుంచి షాద్‌నగర్ వరకు వెళ్లే మార్గంలో రైల్వే వంతెనను నిర్మిస్తానని హామీ ఇచ్చి మరిచిపోయారని పలువురు స్థానికులు ఎమ్మెల్యే తీరుపై మండిపడుతున్నారు.
కల్వకుర్తి నియోజకవర్గంలోని మాడ్గుల, ఆమనగల్లు మండలాల్లోనూ హామీలను అమలు చేయాలంటూ నిరసనలు, ఆందోళనలు పెరుగుతున్నాయి. ఎన్నికలకు ముందు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఇర్విన్‌ను ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారని.. గెలిచిన తర్వాత ఆ మాటే మరిచిపోయారని..ఇటీవల పలు ప్రారంభోత్సవాలకు వచ్చి న ఎమ్మెల్యే కసిరెడ్డి, ఎంపీ మల్లు రవిలను ఇర్విన్ ప్రజలు అడ్డుకుని తీవ్ర నిరసన తెలిపారు. అలాగే, అందుగుల గ్రామంలోనూ బ్రిడ్జిని నిర్మిస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చి.. తర్వాత విస్మరించారని స్థానికులు ఆందోళనకు దిగారు.