ఫార్మా సిటీ ఏర్పాటులో భాగంగా నిర్వాసితులకు ప్లాట్ల పంపిణీపై పలు రకాల అనుమానాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. ప్లాట్ల లేఅవుట్ గుండా 300 ఫీట్ల రోడ్డు నిర్మాణాన్ని ప్రభుత్వం తలపెట్టడంతో పాట్ల పంపిణీకి ఆటంకంగా మారింది. ఫార్మా భూ నిర్వాసితులకు పరిహారంతోపాటు అదనంగా సర్వే నం.90, 91లలో ఎకరాకు 121 గజాల చొప్పున పాట్లను ఇచ్చేందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం హెచ్ఎండీఏ వెంచర్‌ను ఏర్పాటు చేసింది.
ఇప్పటికే లబ్ధిదారులకు పాట్లకు సంబంధించిన పట్టాలను గత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి 2023లో అందజేసిన విషయం తెలిసిందే. యాచారం మండలంలోని మేడిపల్లి గ్రామంలో మూడు రోజుల క్రితం గతంలో సేకరించిన ఫార్మా భూములను సర్వే చేసి, హద్దులు గుర్తించి, ఫెన్సింగ్ వేసే పనిని అధికారులు చేపట్టారు. స్థలం ఇవ్వకుంటే సర్వే అడ్డుకుంటామని అధికారులపై రైతులు ఒత్తిడి తెస్తున్నారు.
దీంతో వారం నుంచి పది రోజుల్లోగా డ్రా తీసి లబ్ధిదారులకు ప్లాట్లను పంపిణీ చేయనున్నట్లు ఆర్డీవో అనంతరెడ్డి రైతులకు హామీ ఇవ్వడంతో రైతులు సర్వేను అంగీకరించారు. ప్రస్తుతమున్న లేఅవుట్లో సుమారు 200 ప్లాట్ల వరకు రోడ్డు నిర్మాణంలో కోల్పోవలసి వస్తుందని సమాచారం. దీంతో రోడ్డు నిర్మాణంలో కోల్పోతున్న ప్లాట్ల కోసం మళ్లీ అదనపు లేఅవుట్ తయారు చేయాల్సి రావడంతో అధికారులకు తలనొప్పిగా మారింది. ప్రస్తుత లేఅవుట్ వెనకాల ఉన్న సుమారు 67 ఎకరాల స్థలంలో అదనపు లేఅవుట్ చేపట్టనున్నట్లు తెలుస్తున్నది.
– యాచారం, ఏప్రిల్ 6
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 300 ఫీట్ల రోడ్డు నిర్మాణం లేఅవుట్ గుండా తలపెట్టడంతో ప్లాట్ల పంపిణీకి ఆటంకంగా మారింది. దీంతో ప్రస్తుతమున్న లేఅవుట్లో సుమారు 200 ప్లాట్ల వరకు రోడ్డు నిర్మాణంలో కోల్పోవలసి వస్తుందని సమాచారం. దీంతో రోడ్డు నిర్మాణంలో కోల్పోతున్న ప్లాట్ల కోసం మళ్లీ అదనపు లేఅవుట్ తయారు చేయాల్సి రావడంతో అధికారులకు తలనొప్పిగా మారింది. ప్రస్తుత లేఅవుట్ వెనుకాల ఉన్న సుమారు 67 ఎకరాల స్థలంలో అదనపు లేఅవుట్ చేపట్టనున్నట్లు తెలుస్తున్నది. అయితే దానికి సమయం పట్టే అవకాశాలు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
సర్వేను అడ్డుకుంటాం
లబ్ధిదారులు తమ ప్లాట్లు పంపిణీ చేయాలని ఒత్తిడి తేవడం.. లేఅవుట్ పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడంతో అధికారులకు ఎటూ పాలుపోవడంలేదు. త్వరలో ప్లాట్లు పంపిణీ చేయకపోతే ఫార్మా భూముల సర్వేను ఎక్కడ అడ్డుకుంటారోనని అటు పోలీసులు.. ఇటు అధికారులు ఆలోచనలో మునిగారు. పైగా సర్వే సుమారు 60 రోజులపాటు కొనసాగనుండటంతో అధికారుల్లో టెన్షన్ మొదలైంది. పది రోజుల్లోగా ప్లాట్లు పంపిణీ చేయకపోతే సర్వేను అడ్డుకునేందుకు రైతులు సైతం సిద్ధంగా ఉన్నారు.
ముందుగా డ్రా తీసి తరువాత ప్లాట్ల కబ్జా ఇవ్వాలని అధికారులు యోచిస్తున్నారు. లేదా ముందుగా అందుబాటులో ఉన్న వాటిని కబ్జా ఇచ్చి మిగతావి తరువాత ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీంతో అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదంతా బాగానే ఉన్న అసలు సమస్య మళ్లీ మొదటికొచ్చింది. జిల్లాలోని కందుకూరు మండలం మీర్ఖాన్పేట సమీపంలోని బేగరికంచె (బల్జగూడ)లో ఫార్మా భూనిర్వాసితుల కోసం లేఅవుట్ చేసిన విషయం తెలిసిందే.. ఈ లేఅవుట్లో బ్లాకులవారీగా ప్లాట్ల తయారీ, రోడ్ల నిర్మాణం, కల్వర్టుల నిర్మాణం తదితర అభివృద్ధి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నవి.
14,000 ఎకరాల్లో భూముల సేకరణ
జిల్లాలోని యాచారం, కందుకూరు మండలాల్లో ముచ్చర్ల కేంద్రంగా ప్రపంచంలోనే అతిపెద్ద హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీని ఏర్పాటు చేసేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2017లో శ్రీకారం చుట్టింది. దీని కోసం కొంత మేరకు భూసేకరణ సైతం అప్పటి సర్కారు చేపట్టింది. హైదరాబాద్‌కు సమీపంలో 19,333 ఎకరాల్లో ఫార్మాసిటిని ఏర్పాటు చేసేందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. దీనికి ఇప్పటికే జాతీయ పెట్టుబడి, తయారీ జోన్ (నిమ్జ్) హోదాను కేంద్రం కల్పించింది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి టీఎస్ఐఐసీ (రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ) రైతుల నుంచి సుమారు 14,000 ఎకరాలకు పైగా పట్టా, అసైన్డ్ భూములను సేకరించింది. ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన రైతులకు ముందుగా ఎకరాకు పట్టా భూమికి రూ.12.50 లక్షలు, అసైన్డ్ భూమికి రూ.7.70 లక్షలు, తరువాత రైతుల డిమాండ్ మేరకు పట్టాకు రూ.16 లక్షలు, అసైన్డ్‌కు రూ.8 లక్షల పరిహారాన్ని అందజేసింది. ఇంకా 2,500 ఎకరాల భూమికి సంబంధించి కోర్టులో కేసులు ఉండటం వలన పరిహారం చెల్లించలేకపోయింది. కొంత మంది రైతులు ఫార్మాసిటీకి వ్యవసాయ భూములను ఇవ్వబోమని స్పష్టం చేశారు. దీంతో ఈ భూములపై గత కొంతకాలంగా ప్రభుత్వానికి రైతులకు మధ్య పోరాటం కొనసాగుతున్నది.
ఇప్పటికే లబ్ధిదారుల జాబితా విడుదల
యాచారం మండలంలోని మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాలకు చెందిన లబ్ధిదారుల జాబితాను అధికారులు గత జనవరిలోనే విడుదల చేశారు. ఆయా గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ప్లాట్ల లబ్ధిదారుల పూర్తిస్థాయి జాబితాను రైతులకు అందుబాటులో ఉంచారు. గత సంక్రాంతికే లాటరీ ద్వారా లబ్ధిదారులకు ప్లాట్లను కేటాయించనున్నట్లు ప్రచారం జరిగింది. ఫార్మాసిటీ ఏర్పాటుకు భూములు కోల్పోయిన రైతుల కోసం జిల్లాలోని కందుకూరు మండలం మీర్ఖాన్పేట సమీపంలోని బేగరికంచె(బల్జగూడ)లో ఫార్మా భూనిర్వాసితుల కోసం హెచ్ఎండీఏ లేఅవుట్‌ను ఏర్పాటు చేశారు.
620 ఎకరాల్లో ఏర్పాటు చేసిన హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ లేఅవుట్లో బ్లాకులవారీగా ప్లాట్లను తయారుచేశారు. అందులో అభివృద్ధి పనులు సైతం ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గత సంక్రాంతికే లబ్ధిదారులకు ప్లాట్లు పంపిణీ చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించినప్పటికీ నేటికీ నెరవేరకుండా పోయింది. నేరుగా ప్రభుత్వమే రైతుల పేరిట రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్లు ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపినప్పటికీ అది కలగానే మిగిలింది. ఇప్పటికైనా ప్లాట్లు పంపిణీ చేస్తారా అంటూ లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.
నిర్వాసితులకు ఎకరాకు 121 గజాల ప్లాటు
ఫార్మా భూ నిర్వాసితులకు పరిహారంతోపాటు అదనంగా కందుకూరు మండలం మీర్ఖాన్పేట గ్రామ సమీపంలోని బేగరికంచె(బల్జగూడ) వద్ద సర్వే నం.90, 91లలో ఎకరాకు 121 గజాల చొప్పున పాట్లను ఇచ్చేందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం హెచ్ఎండీఏ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే లబ్ధిదారులకు ప్లాట్లకు సంబంధించిన పట్టాలను గత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి 2023లో అందజేసిన విషయం తెలిసిందే.
బీఆర్ఎస్ హయాంలోనే లబ్ధిదారులకు ప్లాట్లు అందజేయాలని అప్పటి ప్రభుత్వం భావించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయించే సమయంలోనే అసెంబ్లీ ఎన్నికల కోడ్ వచ్చింది. దీంతో పాట్ల పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది. యాచారం, కందుకూరు, కడ్తాల్ మండలాలకు సంబంధించిన భూనిర్వాసితులకు ఇళ్ల స్థలాలకు సంబంధించి పట్టాలను ఇప్పటికే అందజేసింది.
దీని కోసం కందుకూరు మండలం మీర్ఖాన్పేట సమీపంలో బల్జగూడ ప్రాంతంలో సుమారు 622 ఎకరాల్లో హెచ్ఎండీఏ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే అక్కడ భూమి చదును చేసి బ్లాకులవారీగా ప్లాట్లను తయారు చేసి, రోడ్ల నిర్మాణం సైతం చేపట్టారు. ప్లాట్ల పక్కనే నయా నగరి (ఫోర్త్ సిటీ) నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం పనులు సైతం శరవేగంగా కొనసాగుతున్నాయి. దీంతో రైతులకు ఫార్మా ప్లాట్లపై ఆశలు చిగురిస్తున్నాయి.
యాచారం మండలంలో 3745 ప్లాట్లు
యాచారం, కందుకూరు, కడ్తాల్ మండలాలకు చెందిన 5720 మంది రైతులకు ప్లాట్లు పంపిణీ చేయనున్నారు. ఇందులో యాచారం మండలంలోని నాలుగు గ్రామాలకు కలిపి ఎకరాకు 121 గజాల చొప్పున మొత్తం 3745 ప్లాట్లు కేటాయించారు. ఇందులో కుర్మిద్దకు 1240, నానక్‌నగర్ 359, మేడిపల్లి 1601, తాటిపర్తికి 545 ప్లాట్లు మంజూరు చేశారు. ప్లాట్లకు సంబంధించిన పూర్తి జాబితాను ఆయా గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ఇప్పటికే నోటీసు బోర్డులో రైతులకు అందుబాటులో ఉంచారు.
ఫార్మా ప్లాట్ల లబ్ధిదారులు కందుకూరు మండలంలో మీర్ఖాన్పేట, బేగరికంచె, పంజాగూడ, సాయిరెడ్డిగూడ, అన్నోజీగూడ, ముచ్చర్ల, సార్లరావులపల్లి, కడ్తాల్ మండలంలో పల్లెచెల్కతండా గ్రామాలకు చెందిన రైతులు ఉన్నారు. త్వరలో ఇండ్ల స్థలాలు పంపిణీ చేసి, లాటరీ విధానం ద్వారా ప్లాట్లు కేటాయించి మహేశ్వరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రైతుల పేరిట రిజిస్ట్రేషన్ చేసి ప్లాట్లు అప్పగించాలని రైతులు కోరుతున్నారు.
ప్లాట్లు పంపిణీ చేయాలి
ఫార్మా భూ నిర్వాసితుల కోసం కేటాయించిన ఇంటి స్థలాలను ప్రభుత్వం వెంటనే లబ్ధిదారులకు అందజేయాలి. సర్టిఫికెట్లు కలిగిన ప్రతి రైతుకు ఎకరాకు 121 గజాల చొప్పున ఇంటి స్థలాలను కేటాయించి ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వాలి. లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి ప్లాట్లు కేటాయించాలి. హెచ్ఎండీఏ వెంచర్లో వాటర్ ట్యాంకులు, బడి, పార్కులు, విద్యుత్, భూగర్భ డ్రైనేజీ, రోడ్లను కాంగ్రెస్ సర్కారు ఏర్పాటు చేయాలి. అధికారులు రైతులను ఎలాంటి అయోమయానికి గురిచేయొద్దు.
– మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, ఇబ్రహీంపట్నం
ప్లాట్లు ఇస్తేనే భూములిస్తం
ప్రభుత్వం మాకివ్వాల్సిన ప్లాట్లను వెంటనే ఇవ్వాలి. ప్లాట్లు ఇవ్వకుంటే మా భూములు సర్కారుకు ఇవ్వం. మా భూముల్లో కంచె వేయకుండా అడ్డుకుంటాం. ప్లాట్లు ఇచ్చే వరకు మా భూముల్లో పంటలు వేసుకుంటాం. ప్లాట్లు ఇచ్చినంకనే పోలీసోళ్లు, సర్కారోళ్లు మా భూముల దగ్గరికి రావాలి. మాకు గైరాన్ భూమికి డబ్బులు రాలేదు. మాకు డబ్బులొచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. ప్లాట్లు ఇస్తారని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నం. ఈసారైనా ఆఫీసర్లు మాట తప్పకుండా ప్లాట్లు ఇవ్వాలి.
– నర్సింహనాయక్, రైతు, పల్లెచెల్కతండా
త్వరలో ప్లాట్ల కేటాయింపు
భూనిర్వాసితులకు ప్లాట్లను డ్రా పద్ధతిలో త్వరలోనే కేటాయించేందుకు కృషి చేస్తున్నాం. ప్లాట్లకు సంబంధించిన లబ్ధిదారుల పూర్తి వివరాలను ఇప్పటికే గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచాం. అర్హులైన లబ్ధిదారులకు ఎకరాకు 121 గజాల చొప్పున ప్లాట్లను ప్రభుత్వమే రైతుల పేరుపై మహేశ్వరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించి రైతులకు డాక్యుమెంట్లు ఇచ్చేందుకు యత్నిస్తున్నది. రైతులెవరూ ఆందోళన చెందొద్దు. ప్రతి ఒక్కరికీ ప్లాట్లను అందజేసేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తాం.
– అనంతరెడ్డి, ఆర్డీవో, ఇబ్రహీంపట్నం