వికారాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ) : ఆరుగాలం కష్టపడి పండిస్తున్న రైతన్నకు నష్టాలే మిగులుతున్నా యి. ఓ వైపు ప్రభుత్వ నిర్లక్ష్యం.. మరోవైపు అకాల వర్షాలతో కన్నీళ్లే మిగులుతున్నాయి. గత వారం, పదిహేను రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తేమ శాతం అంటూ అన్నదాత నుంచి ధాన్యాన్ని కొనేందుకు కొనుగోలు కేంద్రా ల నిర్వాహకులు కొర్రీలు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. బుధవారం రాత్రి, గురువారం ఉదయం కురిసిన వర్షానికి జిల్లాలోని కొనుగోలు కేంద్రాల వద్ద, రో
డ్లపై ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది.
ధారూరు, దోమ, కులకచర్ల మండలాల్లో రైతులు ధాన్యాన్ని విక్రయించేందుకు అంతా సిద్ధం చేసి గన్నీ బ్యాగుల్లో నింపిన తర్వాత ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో మళ్లీ ఆరబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా కొన్ని చోట్ల రోడ్లపై ఆరబోసిన ధాన్యం వర్షపు నీటిలో కొట్టుకుపోయింది. అకాల వర్షంతో పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతన్న పుట్టెడు దుఃఖంతో ధాన్యం గింజలను ఒక్క దగ్గరికి కుప్పగా పోస్తున్నాడు.
అదేవిధంగా కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని ఆరబెట్టుకున్న పరిస్థితి కూడా మరీ దారుణంగా తయారైంది. తేమ శాతం ఎక్కువగా ఉందంటూ తూకం వేయకపోవడంతో కొనుగోలు కేంద్రాల వద్ద ఇప్పటికే పది రోజులుగా ధాన్యాన్ని ఆరబెట్టుకున్న రైతులకు గత రెండు రోజులుగా కురిసిన వర్షంతో వడ్లు తడిసిపోవడంతో మరోవారం రోజులపాటు అక్కడే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎప్పుడు వర్షం వస్తుందో తెలియని పరిస్థితులుండడంతో ఇంటిల్లిపాది ధాన్యాన్ని ఆరబెట్టి రోడ్ల పక్కనే జాగారం చేస్తున్నారు. చేతికొచ్చిన పంట నష్టపోతుండడంతో ప్రభుత్వం ఆదుకోవాలని, తేమ శాతం అంటూ కొర్రీలు పెట్టకుండా కొనాలని డిమాండ్ చేస్తున్నారు.
దళారుల వద్దకు ధాన్యం..
కేసీఆర్ హయాంలో ప్రతి గ్రామంలోనూ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి అన్నదాతకూ మద్దతు ధర అందించేలా చర్యలు చేపడితే.. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ మాత్రం రైతుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అన్యాయం చేస్తున్నది. జిల్లాలో యాసంగి వరి కోతలు పూర్తై నెల రోజులు కావొస్తున్నా ధాన్యం సేకరణలో సర్కార్ తీవ్ర జాప్యం చేస్తున్నది. కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లిన ధాన్యాన్ని తేమ శాతం ఎక్కువగా ఉందంటూ తూకం వేయకపోవడంతో అన్నదాతలు అక్కడే ఆరబెట్టుకొని పడిగాపులు కాస్తున్నారు.
మరోవైపు కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లిన ధాన్యాన్ని 10-15 రోజులు అవుతున్నా కాంటా చేయకపోవడం తో విసుగు చెందిన జిల్లా రైతులు దళారులను ఆశ్రయించి తక్కువ ధరకు అమ్ముతూ నష్టపోతున్నారు. ఏదో ఒక కొర్రీ పెడుతూ గత వారం రోజులుగా తూకం వేయకపోవడంతో ఆగ్రహం చెందిన రైతులు బుధవారం రాత్రి దోమ మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రం ఎదుట రోడ్డుపై ధాన్యం సంచుల్ని పడేసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
అదేవిధంగా కొనుగోలు కేం ద్రాల్లో తరుగు పేరిట కిలోల కొద్ది తీస్తూ నట్టేట ముంచుతున్నారని పలువురు రైతులు మండిపడుతున్నారు. ఒక క్వింటాలో పది కిలోల వరకు తరుగు తీస్తూ దోపిడీ చేస్తున్నారని పేర్కొంటున్నారు. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వమే కొర్రీలు పెడుతూ నష్టం కలిగిస్తుండడంతో ప్రైవేట్ వ్యాపారులు, దళారులను రైతులు ఆశ్రయిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అవకతవకలతోపాటు సమస్యలపై జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తడిచిన ధాన్యాన్నీ సేకరించాలి..
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని త్వరగా సేకరించకపోవడంతో అకాల వర్షాలకు తడిసిపోతున్నాయి. అక్కడ టార్పాలి న్లు అందుబాటులో ఉం డక.. రైతన్నకు తీవ్ర నష్టం జరుగుతున్నది. తడిచిన ధాన్యాన్ని మళ్లీ ఆరబెట్టేందుకు అన్నదాత మరో వారం పాటు అక్కడే ఉండాల్సిన దుస్థితి నెలకొన్నది. అన్నదాతల ఇబ్బందులను గుర్తించి తడిచిన ధాన్యాన్ని కూడా సేకరించి, ఆదుకోవాలి.
-మల్లేశ్‌గౌడ్ తుంకిమెట్ల, బొంరాస్‌పేట
వడ్లను ఎప్పుడు కొంటారు..
వడ్లను ఎప్పుడు కొంటారో తెలియడం లేదు. గత 15 రోజులుగా ఇబ్బంది పడుతున్నాం. వర్షం వస్తే టార్పాలిన్లు కప్పుతూ.. తగ్గాక తీస్తున్నాం. ఇక్కడే నిరీక్షించాల్సి వస్తున్నది. అంతేకాకుండా ప్రతిరోజూ కూలీల తో పనులు చేస్తుండడంతో ఆర్థికంగా భారంగా మా రుతున్నది. ధాన్యం కొనుగోళ్లను ఒకే కాంటాతో చేస్తుండడంతో చాలా ఇబ్బందిగా ఉన్నది. అధికారులు స్పందించి కాంటాల సంఖ్యను పెంచాలి.
-గోరప్ప, రైతు నాగసముందర్ గ్రామం, ధారూరు
గత 15 రోజులుగా వడ్ల కుప్పల వద్దే..
గత 15 రోజులుగా రోడ్లపైనే ఉంటూ నిద్ర లేని రా త్రులను గడుపుతున్నాం. ఇంకా ఎప్పుడు తమ ధా న్యాన్ని కొంటారు. ఒకవైపు అకాల వర్షాలతో వడ్లు తడిసిపోతాయేయోననే భయంగా ఉన్నది. అయినా వడ్లను సేకరించడంలేదు.
– రాములమ్మ నాగసముందర్ గ్రామం, ధారూరు
వడ్లు తడుస్తున్నాయ్..
బొంరాస్‌పేట, దుద్యాల మండలాల పరిధుల్లో అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యాన్ని రోడ్లు, కల్లాల్లో ఆరబెట్టి తీసుకొస్తే కొనుగోలు కేంద్రాల్లో టా ర్పాలిన్లు అందుబాటులో లేకపోవడంతో అకాల వర్షాలతో వడ్లు తడిసిపోయే ప్రమాదం ఉన్నది. అందువల్ల వచ్చిన ధాన్యాన్ని తూకం వేయాలి. కొనుగోళ్ల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి.
-హన్మంతు నాగిరెడ్డిపల్లి, బొంరాస్‌పేట