రంగారెడ్డి, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : మెదడు వాపు వ్యాధి ఇప్పటికే రాష్ట్రంలో పలు జిల్లాల్లో విజృంభించింది. గడిచిన ఏడాది కాలంలో ఈ కేసుల సంఖ్య అధికంగా పెరిగినట్టు వైద్యాధికారులు చెబుతున్నారు. ఐదేండ్ల నుంచి పదేండ్ల లోపు పిల్లలకు ఈ వ్యాధి సోకే అవకాశాలు అధికంగా ఉంటాయని నిపుణులంటున్నారు. అపరిశుభ్రత, పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటం, దోమ కాటు, పోషకాహార లోపం, మొదలైన కారణాల ద్వారా ఈ వ్యాధి సోకుతుందని వైద్యులు చెబుతున్నారు. హెర్పిస్ సింప్లక్స్ వైరస్, మీజిల్స్, మమ్స్, చికెన్ పాక్స్, తదితర వైరస్‌లతో పాటు డెంగీ వైరస్ ద్వారా కూడా ఈ వ్యాధి రావొచ్చంటున్నారు. ఇన్ఫెక్షన్లతో మెదడులో కదలికలు తగ్గిపోయి, ఈ వ్యాధికి మార్గం ఏర్పడుతున్నదని చెబుతున్నారు.
ఈ నెల 27 వరకు అందనున్న వ్యాక్సిన్
మెదడు వాపు వ్యాధిని ‘జపనీస్ ఎన్సెపాలైటీస్’ అని అంటారు. దీనినే మెదడు వాపు జరం అని కూడా అంటారు. ఈ వ్యాధిని ఆదిలోనే నిర్మూలించేందుకు ప్రభుత్వం పిల్లలకు వ్యాక్సినేషన్ చేస్తున్నది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లోని పిల్లలకు ఈ వ్యాక్సిన్లను అందిస్తున్నది. చిన్న పిల్లల్లో తొమ్మిది నెలల నుంచి 12 నెలల పిల్లలకు ఫస్ట్ డోస్, 16 నెలల నుంచి రెండేండ్ల పిల్లలకు రెండో డోస్‌ను అందించనున్నారు. చిన్న పిల్లలకు తొడ భాగంలో ఇంజిక్షన్ ఇవ్వనున్నారు. ఐదేండ్ల నుంచి 15 ఏండ్ల పిల్లలకు భుజానికి వ్యాక్సినేషన్ ఇస్తారు. వ్యాక్సిన్ పంపిణీ మూడు వారాల పాటు ఏకధాటిగా కొనసాగనుంది. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 27 వరకు వ్యాక్సిన్ జిల్లాకు అందనున్నట్టు వైద్యాధికారులు చెబుతున్నారు.
మెదడు వాపు లక్షణాలు
ప్రధానంగా మెదడు వాపు జ్వరం, తలనొప్పితో మొదలవుతుంది. అనంతరం, రోగం తీవ్రరూపం దాల్చుతుంది. తీవ్ర జ్వరంతో పాటు నీరసించిపోవడం, మూర్చపోవడం, కళ్లు తిరగడం, కోమాలోకి వెళ్లడం వంటివి ఈ వ్యాధికి సంబంధించిన ప్రధాన లక్షణాలు. చిన్నారుల్లో ఈ వ్యాధిని గుర్తించడం కొంత ఇబ్బందేనని వైద్య నిపుణులు చెబుతున్నారు.
వ్యాధితో కలిగే ఇబ్బందులు
వ్యాధి గుర్తింపు ఇలా..
రోగుల్లో వ్యాధిని నిర్ధారించేందుకు సిటీ స్కాన్, ఎమ్మారై పరీక్షలు నిర్వహిస్తారు. పై పరీక్షలతో మెదడును ఫొటో తీసి, పరిశీలిస్తారు. ఈఈజీలను పరిశీలించి మెదడు వాపు ఏమేరకు ఉన్నదనే విషయాన్ని నిర్ధారిస్తారు.
ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తున్నది
వ్యాధి వచ్చినవారు దీని నుంచి కోలుకోవడానికి నాలుగు నుంచి ఆరు వారాల సమయం పడుతున్నది. ఇందుకు చికిత్స అందించేందుకు న్యూరో ఫిజీషియన్, పెడియాట్రిక్, న్యూరో సర్జన్, పెడియాట్రిక్ కార్డియాలజిస్ట్, పల్మనాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్, తదితర స్పెషల్ విభాగాలకు చెందిన వైద్యులు రోగి ఆరోగ్య పరిస్థితి ఆధారంగా చికిత్స చేయాల్సి ఉంటుంది. ఈ రోగ నివారణకు సుమారు రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకు ఖర్చవుతుంది. ప్రభుత్వం ఉచితంగా ముందస్తు నివారణ నిమిత్తం వ్యాక్సిన్‌ను అందజేస్తున్నది. పదిహేనేండ్ల లోపు ఉన్న ప్రతి ఒక్కరూ దీనిని వినియోగించుకోవాలి. ఈ నెలలోనే వ్యాక్సిన్ జిల్లాకు అందే అవకాశాలున్నాయి. వ్యాధి నిర్ధారణలో ఎవ్వరూ నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు.
– వెంకటేశ్వర్రావు, డీఎంఅండ్‌హెచ్‌వో, రంగారెడ్డి జిల్లా