హయత్నగర్ రూరల్, మే 6 : భానుడి ఉగ్రరూపానికి శరీరం నీరసంగా ఉన్నప్పుడు.. నాలుక దాహార్తితో ఉన్నప్పుడు ఠక్కున గుర్తొచ్చే పానీయం గోలీసోడా. బస్టాండ్లు, రహదారుల పక్కన బండిలో… ఇలా ఎక్కడైనా గోలీసోడా కనిపిస్తే చాలు.. వెంటనే ఓ గ్లాస్ తాగితే హాయిగా ఉండేది. ఒకప్పుడు భాయ్ ఓ గోలీ సోడా అనగానే బండిపై అమ్మే వ్యక్తి కలరా, లెమనా అని అడిగి కీస్మనే శబ్దంతో ఒకటి కొట్టి చేతిలో పెట్టేవాడు. ఒకప్పుడు రెండు ఫ్లేవర్లలో మాత్రమే దొరికే ఈ సోడాను రోడ్డు పక్కన, లేదా తోపుడు బండ్లపై పెట్టుకొని అమ్మేవారు. రోడ్డు పక్కనే చిన్న థర్మాకోల్ డబ్బాల్లోనూ ఐస్ ముక్కల మధ్య పెట్టుకుని విక్రయిస్తున్నారు.
ధర ఒక్కటి రూ.40 నుంచి..
ఇప్పుడు గోలీసోడాకు మంచి డిమాండ్ ఉన్నది. కూల్డ్రింక్ షాపులు, పెద్దపెద్ద రెస్టారెంట్లలోనూ గోలీసోడాలను విక్రయిస్తున్నారు. పాత రుచులు ఆస్వాదించాలనుకునే వారు కూల్డ్రింక్లకు బదులు గోలీసోడాల వైపు చూస్తున్నారు. రోడ్డు పక్కన విక్రయిస్తున్న గోలీసోడాలు రూ.15కు ఒక్కటి అమ్ముతున్నారు. అదే సమయంలో రెస్టారెంట్లు, పెద్ద దుకాణాలు, బ్రాండెడ్ టీ షాపుల్లో మాత్రం ఒక్క గోలీసోడా రూ.40 నుంచి రూ. 90 వరకు విక్రయిస్తున్నారు.
విభిన్నమైన ఫ్లేవర్లతో..
పెద్ద దుకాణాల్లో లెమన్, ఆరెంజ్, బ్లూబెర్రీ, మొజిటో, గ్రీన్ యాపిల్, పైనాపిల్, స్ట్రాబెర్రీ, రెడ్ గోవా, అమెరికన్ ఐస్క్రీం, పైనాపిల్ గ్రీన్, కివీ, మ్యాంగో, గ్రేప్, మసాలా జీర, సుగంధ, లెమన్ సాల్ట్ తదితర రకాల గోలీసోడాలు అందుబాటులోకి వచ్చాయి. రెస్టారెంట్లలో బిర్యానీతోపాటు గోలీసోడాలు తీసుకోవడం మరింత పెరిగింది. వివిధ రుచుల్లో లభిస్తుండటంతో భోజనప్రియులు ఆసక్తిచూపుతున్నారు.
మంచిగిరాకీ ఉంది..
మళ్లీ గోలీసోడాలు వచ్చాయా.. అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. కూల్డ్రింక్లకు బదులు గోలీసోడాలను తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడే కూర్చుని ఒకప్పటితరం గోలీసోడా గురించి చర్చించుకుంటుండటం చూశా. నేటితరం కూడా సోడాలంటే ఇష్టపడుతున్నారు. సాధారణంగా గోలీ సోడాలో 17 ఫ్లేవర్లు ఉంటాయి. అందులో బ్లూబెర్రీ, ఆరెంజ్, లెమన్, లెమన్ సాల్ట్ ఫ్లేవర్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. రోజూ 50కిపైగా గోలీసోడాలు అమ్ముతుంటాను. ఎండాకాలంలో మంచి గిరాకీ ఉంటున్నది.
– మహేశ్వర్రెడ్డి, టీహౌస్ నిర్వాహకుడు కుంట్లూర్