సిటీబ్యూరో : ఏడు జిల్లాల నుంచి 11 జిల్లాలకు హెచ్ఎండీఏ పరిధి పెరిగినా.. భవన నిర్మాణ అనుమతులు విధానం ఇంకా గందరగోళంగానే ఉన్నది. బిల్డ్ నౌ అందుబాటులోకి తీసుకువస్తున్నామంటు రెండు వారాల కిందటే ప్రకటించిన హెచ్ఎండీఏ ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలు చేయకలేకపోతున్నది. దీంతో కుప్పకూలిన రియల్ ఎస్టేట్‌కు ఇదో గుదిబండలా మారుతున్నది. సంస్కరణల పేరిట ప్రభుత్వం చేపడుతున్న చర్యలు భవన నిర్మాణ రంగాన్ని మరింత దారుణంగా మారుస్తున్నాయి.
రోజుల వ్యవధిలో అనుమతులు జారీ చేసే టీఎస్ బీపాస్ విధానానికి ఫుల్స్టాప్ పెట్టి బిల్డ్ నౌ తీసుకువచ్చిన ప్రభుత్వం.. అందుకు తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో హెచ్ఎండీఏలో అనుమతుల ప్రక్రియ అయోమయానికి దారితీస్తున్నది. ఏడాదిగా దీనిపై కసరత్తు చేస్తున్నా ఇప్పటివరకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడం ఆ రంగానికి సమస్యగా మారుతున్నది. పూర్తి స్థాయిలో బిల్డ్ నౌ కార్యకలాపాలు మొదలు కాకపోవడంతో హెచ్ఎండీఏ పరిధిలో భవన నిర్మాణ అనుమతులకు దరఖాస్తుదారులు ఇబ్బందులుపడుతున్నారు.
ఏఐ ఆధారిత వ్యవస్థతో వేగంగా భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియను సంస్కరిస్తామని గొప్పలు చెప్పుకొన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. అందుకు తగినట్లుగా ఏర్పాట్లను చేయడంలో విఫలమైంది. చకచకా అనుమతులు దేవుడెరుగు.. కనీసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు లేకుండా పోయింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతుల ప్రక్రియను ఆన్లైన్లోనే వేగంగా పూర్తి చేసేలా టీఎస్ బీపాస్ తీసుకువచ్చి.. సమర్థవంతంగా అమలు చేసింది. ఇన్నాళ్లు దీని ఆధారంగా అనుమతులు కూడా మంజూరు చేసింది. కానీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ టీఎస్ బీపాస్ లోపభూయిష్టంగా ఉందని, మరింత పారదర్శకత, వేగవంతమైన అనుమతుల కోసం బిల్డ్ నౌ ప్రారంభిస్తామని ప్రకటించింది.
11 జిల్లాలకు విస్తరించిన హెచ్ఎండీఏ పరిధిలో ఏప్రిల్ మొదటివారంలోనే బిల్డ్ నౌ అందుబాటులోకి వస్తుందని అధికారులు వెల్లడించారు. కానీ అప్లికేషన్ పనితీరులో వస్తున్న లోపాలను సవరించడానికే సమయం పడుతున్నది. దీంతో అప్లికేషన్ అందుబాటులోకి రాలేదని, ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో అమలవుతున్నా.. ఇందులో వస్తున్న షార్ట్ ఫాల్స్, సెక్యూరిటీ, పనితీరులోని లోపాలను సవరిస్తున్నారు.
అప్పటి వరకు పాత విధానంలోనే దరఖాస్తు ప్రక్రియను కొనసాగించి, బ్యాక్ ఎండ్ టెస్టింగ్ తర్వాత పూర్తి స్థాయిలో అమలు చేస్తే సరిపోయేదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అధికారులకు శిక్షణ ఇచ్చి, పూర్తి స్థాయిలో అప్లికేషన్ రూపుదిద్దుకున్న తర్వాతే అమల్లోకి వస్తుందని హెచ్ఎండీఏ వర్గాలు చెబుతున్నారు. అప్పటివరకు పాత విధానంలో అనుమతుల ప్రక్రియకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని పలువురు బిల్డర్లు కోరుతున్నారు