తాండూరు రూరల్, మార్చి 4 : రాజీవ్ స్వగృహ టౌన్ షిప్లో పేద, మధ్యతరగతి లబ్ధిదారులు సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. శనివారం తాండూరులోని రాజీవ్ స్వగృహ టౌన్‌షిప్‌తోపాటు మండల పరిధిలోని అంతారంలో తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించారు. ఎంపీడీవో కార్యాలయంలోని డీఎల్పీవో కార్యాలయాన్ని తనిఖీ చేశారు. విరిగిపోయిన కుర్చీలను చూసి, వెంటనే కుర్చీలను మార్చాలని ఆదేశించారు. ఎంపీడీవో కార్యాలయం ఎదుట పిచ్చిమొక్కలతో నిండి ఉన్న పాత పార్కును పరిశీలించారు. 15 రోజుల్లో పార్కు మొత్తాన్ని శుభ్రం చేయాలని తహసీల్దార్ చెన్నప్పలనాయుడు, ఎంపీడీవో సుదర్శన్‌రెడ్డిని ఆదేశించారు. మన కార్యాలయాలే ఇలా ఉంటే, ప్రజలకు ఏమి చెబుతామని అధికారులను ప్రశ్నించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో తన వారసులకు భూమి రిజిస్ట్రేషన్ చేసేందుకు వచ్చిన ఓ వృద్ధురాలిని కలెక్టర్ పలుకరించారు. ధరణి హెల్ప్‌డెస్క్‌ను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ధరణితో 99 శాతం రైతుల సమస్యలు పరిష్కరించవచ్చని తెలిపారు. క్షేత్రస్థాయిలో ధరణిపై రైతులకు అవగాహన కల్పించక పోవడంవల్లే చెడ్డ పేరు వస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసినప్పటి నుంచి కేవలం 5 దరఖాస్తులు రావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మీరు సరిగ్గా పని చేయడంలేదని అధికారులపై మండిపడ్డారు. ధరణిపై గ్రామాల్లో విస్తృతగా ప్రచారం చేయాలని సూచించారు.
అమ్మకానికి సిద్ధంగా ఫ్లాట్లు
రాజీవ్ స్వగృహ టౌన్షిప్లో మిగిలిపోయిన ఫ్లాట్లను వేలం ద్వారా విక్రయిస్తున్నామని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. ఎంపీడీవో కార్యాలయంలో రాజీవ్ స్వగృహ టౌన్షిప్పై సమావేశం నిర్వహించి.. లబ్ధిదారుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. గతంలో మూడు సార్లు ఈ ప్లాట్ల విక్రయాలపై సమావేశాలు జరిగాయన్నారు. అయినా కొనుగోలు చేసేందుకు లబ్ధిదారులు ముందుకు రావడంలేదని తెలిపారు. డీటీపీసీ ఆమోదంతో కాలనీలో విద్యుత్, మురుగు కాలువల నిర్మాణాలు, మంచినీటి సౌకర్యం, రోడ్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఇంకా కొన్ని నిర్మాణాలు జరగాల్సి ఉందని తెలిపారు. ఈ ప్లాట్లు హైదరాబాద్ రోడ్డుకు అతి సమీపంలో.. పట్టణానికి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయన్నారు.
ఎంసీహెచ్ దవాఖాన కూడా ఉందన్నారు. ప్రభుత్వ లేవుట్ చేసి ఉందని తెలిపారు. అన్ని సౌకర్యాలు కలిగిన రాజీవ్ గృహలో ఫ్లాట్లు కొనుగోలు చేసి, సొంతింటి కలను నెరవేర్చుకోవాలని ఆయన సూచించారు. లబ్ధిదారులు కలెక్టర్ పేర రూ.10,000 ఈఎండీ కట్టాలని తెలిపారు. చదరపు అడుగు ధర ఎక్కువగా ఉందని.. ధరను తగ్గించాలని సమావేశానికి వచ్చిన లబ్ధిదారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఈ విషయాన్ని మరోసారి సమావేశంలో చర్చిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. 17న ఫ్లాట్ల వేలం ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో అశోక్‌కుమార్, ట్రైనీ ఏఐఎస్ సంచిత్ గంగ్వార్, తహసీల్దార్ చెన్నప్పలనాయుడు, ఎంపీవో సుదర్శన్‌రెడ్డి, పలువురు అధికారులు ఉన్నారు.