ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సభలు నిర్వహించగా.. ఎంపికైన లబ్ధిదారుల పేర్లను అధికారులు చదివి వినిపించారు. అందులో చాలా వరకు అర్హత ఉన్న వారు పథకాలకు ఎంపిక కాలేదని అన్ని సభల్లోనూ రభస జరిగింది. పేర్లు రాని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని అధికారు లు సూచించడంతో పలువురు అప్లికేషన్ పెట్టుకున్నారు.
కొడంగల్, జనవరి 28 ; రాష్ట్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం రోజున ఎంతో ఆర్భాటంగా ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డుల వంటి పథకాలను ప్రారంభించింది. అయితే మండలంలోని అన్నారం గ్రామాన్ని ప్రభుత్వం పైలట్ పథకం కింద ఎంపిక చేసింది. కొంతమంది లబ్ధిదారులకు మాత్రమే అధికారులు పథకాల ప్రొసీడింగ్ కాపీలను పం పిణీ చేశారు. మిగిలిన వారికి ఎప్పుడు పంపిణీ చేస్తారో చెప్పడం లేదు. అర్హుల జాబితాను బయటికి విడుదల చేయకపోవడంతో తాము అర్హత సాధించామో లేదో తెలియని అయోమయ పరిస్థితి నెలకొన్నదని పలువు రు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మండలంలోని అన్నారం గ్రామంలో పై నాలుగు పథకాల ప్రారంభం వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణరెడ్డి చేతుల మీదుగా ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా వారు పలువురు లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. మిగిలిన వారికి స్థానిక అధికారులు అందిస్తారని చెప్పారు. అన్నారంలో రైతు భరోసాకు 962 మంది, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు 13 మంది, కొత్త రేషన్ కార్డులకు 159 మంది, ఇందిరమ్మ ఇండ్లకు 294 మంది ఎంపికైనట్లు అధికారులు తెలిపారు. గతంలో దరఖాస్తు చేసుకున్న 63 మందికి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు. రైతుభరోసా జాబితాలో ఇప్పటికే 90 శాతం వరకు పూర్తైందని, రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అయినట్లు లబ్ధిదారులు పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు సంబంధించి కొంతమందికి ప్రొసీడింగ్ కాపీలు వచ్చాయని, కానీ ఎటువంటి నగదు మంజూరు కాలేదని చెబుతున్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై ఇప్పటివరకు ఎటువంటి భరోసా లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఆ పథకానికి 13 మంది ఎంపికైనట్లు అధికారులు ప్రకటించారు. ఇందిరమ్మ ఇండ్ల జాబితాపై ప్రస్తుతం సర్వే జరుగుతుందని, గతంలో వైఎస్సార్ హ యాంలో ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు మళ్లీ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని.. వాటి వివరాలను పరిశీలిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
అర్హుల జాబితాను అధికారులు చెప్పడంలేదు..
ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న ప్రతి లబ్ధిదారుడికీ పథకాలను మంజూరు చేస్తామని అప్పట్లో సీఎం చెప్పారు. తీరా పథకాలు అందించే క్రమంలో కొర్రీలు పెడుతున్నారు. ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇంటికోసం అప్లికేషన్ పెట్టా. తన పేరు జాబితాలో వచ్చిందో.. రాలేదో కూడా ఇంతవరకు తెలియదు. అర్హుల జాబితా అడిగితే అధికారులు బయటికి చెప్పడం లేదు. మొన్న ఆదివారం గ్రామంలో జరిగిన కార్యక్ర మంలో కొంతమందికే ప్రొసీడింగ్ పత్రాలను అందించినట్లు తెలిసింది. పైలట్ గ్రామంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందిస్తామని ప్రభుత్వం చెప్పినందున తనకు ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేసి ఆదుకోవాలి.
– బైండ్ల ఎల్లప్ప, అన్నారం, కొడంగల్
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లేదు..
ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తామని ప్రకటించినప్పుడు చాలా సంతోషించా. తనకు గుంట భూమి కూడాలేదు. కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నా. మా గ్రామంలో ఈ పథకానికి 13 మంది ఎంపి కైనట్లు అధికారులు చెప్పారు. ప్రభుత్వం ఎవరికీ నగదును పంపిణీ చేస్తుందో తెలియదు. తనలాంటి వారికి అందిస్తే ఆర్థికంగా చేయూతగా ఉంటుంది.
-దేవమ్మ, అన్నారం. కొడంగల్
అర్హతలున్నా జాబితాలో పేరు రాలేదు..
మర్పల్లి మండలంలోని గుండ్లమర్పల్లి గ్రామాన్ని ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది. గణతంత్ర దినోత్సవం రోజున నాలుగు పథకాలను అధికారులు ఆర్భాటంగా ప్రారంభించి.. పలువురు లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను అందించారు. అన్ని అర్హతులున్నా.. ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తన పేరు రాలేదు. – బిచ్చప్ప, గుండ్ల మర్పల్లి, మర్పల్లి