వికారాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ) 13 : కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నెలకొన్న వివాదం దృష్ట్యా పోలీసులు వికారాబాద్ జిల్లాలో శుక్రవారం బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేశారు. కౌశిక్‌రెడ్డి ఇంటిపై గాంధీతో పాటు ఆయన అనుచరులు చేసిన దాడికి నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. దీంతో అప్రమత్తమైన జిల్లా పోలీసులు పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి, ఇతర బీఆర్ఎస్ శ్రేణులను శుక్రవారం గృహ నిర్బంధాలు చేశారు. మాజీ ఎమ్మెల్యేలు, వారి అనుచరులు హైదరాబాద్‌కు వెళ్లకుండా అడ్డుకున్నారు. జిల్లాలోని కొడంగల్, తాండూరు, పరిగి, వికారాబాద్ నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్‌లు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. గురువారం అర్ధరాత్రి నుంచే బీఆర్ఎస్ నాయకుల కదలికలను పోలీసులు కనిపెడుతూ వారిని ఎటూ వెళ్లకుండా అడ్డుకున్నారు. బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్ట్‌లపై పార్టీ శ్రేణులు, ప్రజాస్వామ్య వాదులు మండిపడుతున్నారు. ఇందిరమ్మ ప్రజా పాలన అందిస్తామని అంటున్న రేవంత్‌రెడ్డి సర్కార్ ఎమర్జెన్సీని తలపించేలా ప్రతిపక్ష నేతలను అప్రజాస్వామికంగా నిర్బంధిస్తున్నదని విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అక్రమ అరెస్టులను ఖండిస్తూ జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి.
కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు..
కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ శ్రేణులను అక్రమంగా అరెస్ట్‌లు చేయించడం సరికాదని, రాబోవు రోజుల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం పరిగి మాజీ ఎమ్మెల్యేను పరిగి ఎస్ఐ సంతోష్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే టీ హరీశ్‌రావు నేతృత్వంలో బీఆర్ఎస్ శ్రేణులను వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించి అర్ధరాత్రి వరకు నిర్బంధించడం ఎంత వరకు సమంజసమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన ఉద్యమ స్ఫూర్తితో ప్రజా సమస్యలపై ఉద్యమిస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన తీరును ప్రజలు గమనిస్తున్నారని,