కొడంగల్ జూన్ 3: బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఎట్లుండే.. ఇప్పటి కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఏవిధంగా మారిందో ప్రజలు గుర్తిం చాలని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా స్థానిక ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 14 సంవత్సరాలు నిరంతర పోరాటంతో ఎందరో ఆత్మబలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని కేసీఆర్ అన్నింటా ప్రగతిపథంలో నడిపించి ప్రపంచపటంలో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని ఎన్నో అద్భుత పథకాలను అమలు చేసి సంక్షేమానికి స్వర్ణయుగాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి తెలంగాణ ప్రజలు అష్టకష్టాలను ఎదుర్కొంటున్నారన్నారు. అధికారాన్ని దక్కించుకునేం దుకు కాంగ్రెస్ అమలు సాధ్యంకాని హామీలిచ్చిందన్నారు. ఆరు నెలల కాలం పూర్తైయినా ఆరు గ్యారెంటీలను అమలు పరచ లేకపోయిందన్నారు. ఈనెల 4వ తేదీతో కోడ్ ముగియనుందని, ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
పోలీసులు అత్యుత్సహాన్ని ప్రదర్శిస్తున్నారని, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై అనవసరంగా కేసు లు బనాయించి ఇబ్బంది పాలు చేస్తున్నట్లు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ మధుయాదవ్, నారాయణపేట జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ శ్యాసం రామకృష్ణ, మాజీ వైస్ ఎంపీపీ నారాయణరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ బీములు, మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, పార్టీ నేతలు చాంద్‌పాషా, కోట్ల యాదగిరి, సలీం, నరేశ్, రఘుపతిరెడ్డి, ముక్తార్, మైపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
వికారాబాద్ : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల చివరి రోజు సందర్భంగా సోమవారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్, పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డితో కలిసి జెండావిష్కరణ చేశారు. అనంతరం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభు త్వ దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, కౌన్సిలర్లు అనంత్‌రెడ్డి, గోపాల్, కిరణ్పటేల్, పార్టీ మండల అధ్యక్షుడు కమాల్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
పరిగి: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు రోజు సోమవారం పరిగిలోని సర్కారు దవాఖానలో రోగులకు, బాలసదనంలో చిన్నారులకు పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పండ్లు పంపిణీ చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు ఉత్సవాల ముగింపు రోజు మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి పండ్లు పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, ఎంపీపీ కరణం అరవిందరావు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, కౌన్సిలర్లు నాగేశ్వర్, రవీంద్ర, ఎదిరె క్రిష్ణ, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఎస్.భాస్కర్, బీఆర్ఎస్ నాయకులు బి.రవికుమార్, అన్వర్‌హుస్సేన్, తాహెర్‌అలీ, అబ్దుల్ బషీర్, హాజీ అమిరొద్దీన్, రాజు, రవి పాల్గొన్నారు.
బొంరాస్‌పేట: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మండలంలోని రేగడిమైలా రంలో బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ జగదీశ్వరయ్య, గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షుడు శ్యామలయ్యగౌడ్, గోవింద్‌రెడ్డి తదితరులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్ని వర్గాలను ఏకం చేసి శాంతియుతంగా పోరాటం చేసి రాష్ర్టాన్ని సాధించారన్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిందని అన్నారు. కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.