పరిగి : ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ ఇచ్చేంత వరకూ రైతుల పక్షాన పోరాడుతామని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక సర్కారుఅని.. వ్యవసాయాన్ని నాశనం చేస్తున్నదని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వా లని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం పరిగిలో నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షలో పాల్గొన్న మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చుతామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు ఏ ఒక్క హామీనీ సరిగ్గా అమలు చేయలేదని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో అన్నదాతలు తమ పంటలను ఏ ఇబ్బంది లేకుండా సంతోషంగా సాగు చేసుకున్నారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. వంద రోజులు దాటినా ఐదు ఎకరాల వారికి కూడా రైతుబంధు డబ్బులు రాలేదన్నారు. కరెంటు కోతలు అప్పుడే మొదలయ్యాయని..రుణమాఫీ ఊసే లేదని ఆరోపించారు. వరి పంటకు మద్దతు ధరతోపాటు క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించాలని..లేకపోతే రైతుల తరఫున బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు.
కార్యక్రమంలో దోమ జడ్పీటీసీ కొప్పుల నాగారెడ్డి, పరిగి, పూడూరు ఎంపీపీలు కరణం అరవిందరావు, మల్లేశం, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సురేందర్, మండలాల పార్టీ అధ్యక్షులు ఆర్.ఆంజనేయులు, సత్తినేని సుధాకర్‌రెడ్డి, గోపాల్‌గౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మేడిద రాజేందర్, బి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, పీరంపల్లి రాజు, ఎస్.భాస్కర్, పి.వెంకటయ్య, నల్క జగన్, వెంకటయ్య, రాజేందర్‌రెడ్డి, పి.రా మన్నమాదిగ, బి.రవికుమార్, కౌన్సిలర్లు నాగేశ్వర్, వారాల రవీంద్ర, ఎదిరె కృష్ణ, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.