షాబాద్, మే 3: పొద్దున లేస్తే కేసీఆర్‌ను తిడుతూ.. దేవుళ్ల మీద ఓట్టు పెడుతూ రేవంత్‌రెడ్డి కాలయాపన చేయడం తప్పా రాష్ర్టానికి చేస్తున్నదేమీలేదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితారెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి శంకర్‌పల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌కు మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్‌తో కలిసి రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ పదేండ్లలో కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమానికి ప్రతి గడపకూ తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
కేసీఆర్ ఇంటి మీది కాకిని, తమ ఇంటి మీద వాలనివ్వమని చెబుతున్న రేవంత్‌రెడ్డి.. రంజిత్‌రెడ్డి ఏ ఇంటి నుంచి వచ్చాడో తెలువదా అన్ని ప్రశ్నించారు. అంటే ఆయన కాకి కాదేమో.. గద్దనేమో అని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి వచ్చినప్పటి నుంచి కేసీఆర్ జపం లేకుండా బతుకలేకపోతున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్న రేవంత్‌రెడ్డి ఆరు నెలలు గడిచినా ఎందుకు మాఫీ చేయడం లేదన్నారు. ఇదొక్కటే కాదు అధికారంలోకి రావడానికి నోటికి ఏది వస్తే అది మాట్లాడి గద్దెనెక్కిన తరువాత హామీలన్ని విస్మరించారన్నారు.
రేవంత్‌రెడ్డి వికారాబాద్ చౌరస్తాకు వచ్చినప్పుడు డిసెంబర్ 9వ తేదీన రైతు రుణమాఫీ చేస్తానన్నారని.. ఇప్పుడేమో ఆగస్టు 15న రుణమాఫీ చేస్తామంటూ మరోసారి రైతులను మోసం చేయాలని చూస్తున్నారన్నారు. కరీంనగర్ పోయి వేములవాడ దేవుడి మీద ఓట్టు, బాసరలో అమ్మవారి మీద, యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహాస్వామి మీద, నగరంలోని పెద్దమ్మ గుడి వద్ద ఓట్టు వేశారని.. ఇక చేవెళ్లకు వస్తే వేంకటేశ్వరస్వామి మీద కూడా ఓట్టు వేస్తారేమోనని అన్నారు. అయితే రేవంత్‌రెడ్డి అవాస్తవాలు తెలిసిన ఇక్కడి వేంకటేశ్వరస్వామి ఆగస్టు 15 దాకా ఆయన ఈ రూట్లో రాకపోతే బాగుండునేమో అని అనుకుంటుండొచ్చని అన్నారు.
బీజేపీ కేంద్రంలో పదేండ్లు అధికారంలోకి ఉండి తెలంగాణకు ఏమన్నా చేసిందేమో ఆ పార్టీ నాయకులు చెప్పాలన్నారు. కేసీఆర్ పలుమార్లు పోయి మోదీని నిధులు అడిగితే ఇవ్వలేదన్నారు. మోదీని చూసి తనకు ఓటు వేయాలని బీజేపీ అభ్యర్థి అడుగుతున్నాడే తప్పా, తాము తెలంగాణకు ఇది చేశామని చెప్పడానికి ఏమీ లేదన్నారు. ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలిస్తాం, రైతుల ఖాతాల్లో రూ.15లక్షల చొప్పున డబ్బులు వేస్తామని చెప్పిన బీజేపీ.. ఇప్పటివరకు ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. 13వ తేదీన కారు గుర్తుకు ఓటు వేసి కాసాని జ్ఞానేశ్వర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ.. చేవెళ్ల ఎంపీగా తనను ఆశీర్వదించాలన్నారు.
పార్లమెంట్లో తెలంగాణ గొంతుక వినిపిస్తానని తెలిపారు. చేవెళ్ల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ ఎన్నో ఏండ్ల తర్వాత చేవెళ్ల గడ్డపై బీసీనేతకు అవకాశం వచ్చిందన్నారు. ఇక్కడి ఓట్లలో 50శాతానికి పైగా బీసీలు ఉన్నారని, వారందరూ ఏకమై బీసీ బిడ్డ కాసానిని గెలిపించుకోవాలన్నారు. కాంగ్రెస్, బీజేపీలను ఓడించి గుణపాఠం చెప్పాలన్నారు. కార్యక్రమంలో పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జి రాంబాబుయాదవ్, ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాపారావు, పీఏసీఏస్ చైర్మన్ బద్దం శశిధర్‌రెడ్డి, పార్టీ అధ్యక్షుడు గోపాల్, నాయకులు గోవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.