Vikarabad | శంకర్పల్లి, జులై 2 : అసలే వర్షాకాలం.. నీరు రోడ్డుపై ప్రవహిస్తుంటే వాహనదారులు వెళ్లడానికి ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. కానీ అదే వర్షపు నీరు రోడ్డుపై నిలిచిపోయి అలాగే ఉంటే ఇంకెంత ఇబ్బందులు ఎదురవుతాయి. శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఫతేపూర్ బ్రిడ్జి వద్ద మంగళవారం రాత్రి కురిసిన వర్షాలకు భారీగా వరద నీరు చేరి శంకర్పల్లి నుండి వికారాబాద్ వెళ్లే ప్రయాణికులకు రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఎదురైంది. వర్షపు నీరు అంతా రోడ్డుపై చేరి చిన్న చెరువును తలపిస్తుంది. మోకాళ్ళ ఎత్తుల నీటి నుండి దాటుకుని వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. వర్షం పడినపుడల్లా తూతూ మంత్రంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు, శాశ్వత పరిష్కారం మాత్రం చూపలేకపోతున్నారు.
కేవలం ఒక్కరోజు రాత్రి కురిసిన వర్షానికి ఇంత దారుణమైన పరిస్థితి వస్తే ముందు ముందు రాబోయే వర్షాలకు ఏలాంటి పరిస్థితి ఎదురవుతుందోనని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. నీరు వెళ్లే మార్గం చేయకుండా రోడ్డు వేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నటువంటి ఆర్ అండ్ బి అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందేనని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా గత నెలలో స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య చేతుల మీదుగా రావులపల్లి బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. కానీ టెండర్ ప్రక్రియ పూర్తికాకముందే సాంక్షన్ లెటర్ని ఆధారంగా చేసుకుని శంకుస్థాపన చేయడం ఎంతవరకు సమంజసం అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
నరకం అనుభవిస్తున్నారు..
ఏదో చేయాలని హడావిడిగా ప్రణాళిక లేకుండా పనులు చేస్తే ఇట్లనే ఉంటది. ఈ ప్రాంత ప్రజలు నరకం అనుభవిస్తున్నారు, తక్షణమే పరిష్కారం చూపాలి. మండలంలో స్థానిక ఎన్నికలు వస్తున్నందున రావులపల్లి రోడ్‌ను టెండర్ కాకుండానే ప్రారంభించారు. ఈ పనులను కూడా వెంటనే ప్రారంభించాలి. కేవలం ఎన్నికల స్టంట్లు కాకుండా ప్రజా సమస్యలను నిజంగా తీర్చే ఉద్దేశం ఉంటే వెంటనే ఈ బ్రిడ్జి కింద పనులు, శంకరపల్లి రోడ్ పనులను వెంటనే పూర్తి చేయాలి.
– శంకర్పల్లి మాజీ ఎంపీపీ ధర్మన్నగారి గోవర్ధన్ రెడ్డి
వర్షపు నీరు నిల్వకుండా చేస్తాం..
వర్షపు నీరు నిలవకుండా పోవడానికి ఇంతకుముందే పై అధికారులతో చర్చించి ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. రెండు రోజుల్లో పైప్ లైన్ వేయించి వర్షపు నీరు అక్కడ నిలవకుండా సమస్యను పరిష్కారిస్తాం.
– ఆర్ అండ్ బీ ఏఈ రవీంద్ర
ప్రాసెస్‌లో టెండర్
రావులపల్లి కలాన్ రోడ్డు టెండర్ ప్రాసెస్‌లో ఉంది. గతంలో రావులపల్లి కలాన్ బీటీ రోడ్డుకు విడుదలైన 50 లక్షల నిధులకు బ్యాలెన్స్ వర్క్ కింద ఇప్పుడు ఈ రెండు కోట్ల 50 లక్షల నిధులు విడుదలయ్యాయి.
– పంచాయతీరాజ్ ఏఈ నందకిశోర్