బంజారాహిల్స్: పెళ్లి పేరుతో తనను నమ్మించి శారీరకంగా లోబర్చుకున్న సహోద్యోగి తనను మోసం చేశాడని మనస్తాపంతో ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ పరిధిలో ఉంటున్న యువతి(26) కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నది. 2019లో ఆమెకు వివాహం కాగా నాలుగేండ్లు కుమారుడున్నాడు. భర్తతో విభేదాలు రావడంతో విడిపోయి ఒంటరిగా ఉంటున్నది. ఈ క్రమంలో పంజాగుట్ట పీఎస్‌లో పనిచేస్తున్న సమయంలో స్వప్నిల్ (27) అనే కానిస్టేబుల్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.పెళ్లి చేసుకుంటానని నమ్మించిన స్వప్నిల్.. ఆమెను శారీరకంగా లోబర్చుకున్నాడు.
ఆమె గర్భవతి కావడంతో అబార్షన్ చేయించాడు. ఇటీవల మరో యువతితో సన్నిహితంగా ఉంటున్నాడని, తనతో పెళ్లి గురించి అడిగితే దుర్భాషలాడుతున్నాడని బాధిత యువతి మనస్తాపానికి గురైంది. మహిళా కానిస్టేబుల్ పెళ్లి గురించి నీలదీయగా, స్వప్నిల్ పెళ్లికి నిరాకరించాడు. దీంతో నిద్రమాత్రలు తీసుకున్న మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నది. ఆస్పత్రిలో చికిత్స అందించగా ప్రాణాపాయం తప్పింది. బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కానిస్టేబుల్ స్వప్నిల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.