షాబాద్, అక్టోబర్ 23 : పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గ్యార క్రాంతికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు ర్యాలీగా కలెక్టరేట్‌కు వెళ్లగా పోలీసులు అడ్డుకోవడంతో గేటు ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా క్రాంతికుమార్ మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా విద్యార్థుల జీవితాల్లో మార్పు రాలేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 13లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఎదురుచూస్తున్నారన్నారు. కళాశాల యాజమాన్యాలు ఫీజులు కట్టాలని విద్యార్థులను వేధిస్తున్న పరిస్థితి నెలకొన్నదన్నారు.
వికారాబాద్ జిల్లాలో..
పరిగి, అక్టోబర్ 23 : ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ బుధవారం పరిగిలోని వివిధ కళాశాలల విద్యార్థులు ఏబీవీపీ ఆధ్వర్యంలో వివిధ కళాశాలల విద్యార్థులు కొడంగల్ చౌరస్తా నుంచి ప్రధాన రహదారి గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సాయి గణేశ్ మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు సుమారు రూ.7800కోట్లు ఉన్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పది నెలలైనా విద్యా శాఖకు మంత్రి లేడని, ముఖ్యమంత్రికి విద్యా రంగంపై ఎంత చిత్తశుద్ధి ఉన్నదో అర్థం చేసుకోవచ్చన్నారు. స్కాలర్షిప్లు రాని కారణంగా కళాశాలల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వబోమంటున్నాయని, విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తే కాంగ్రెస్‌కు రాబోవు రోజుల్లో తగిన గుణపాఠం తప్పదన్నారు. బకాయిలు విడుదల చేయకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి గణేశ్, ప్రేమ్‌కుమార్, రఘు, ఇమ్రాన్, ధనరాజ్, శివ, ప్రవీణ్, మల్లేశ్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.